...
...
Next Story

చికెన్ బిర్యానీ ఇచ్చినందుకు రెస్టారెంట్ యజమానిని కాల్చి చంపిన కస్టమర్

రాంచీలో కేవలం శాఖాహార బిర్యానీకి బదులు మాంసాహార బిర్యానీ ఇచ్చినందుకు ఓ కస్టమర్ రెస్టారెంట్ యజమానిని కాల్చి చంపిన దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్డర్ విషయంలో మొదలైన ఘర్షణ కాల్పులకు దారి తీసింది. అయితే, దీని వెనుక ఆస్తి వివాదం కూడా ఉండొచ్చని స్థానిక ఎమ్మెల్యే అనుమానం వ్యక్తం చేశారు.

Published on: Oct 20, 2025 05:09 PM IST
Advertisement

చాలా చిన్న విషయమై మొదలైన వివాదం ఒక అమాయకపు ప్రాణాన్ని బలి తీసుకుంది. జార్ఖండ్‌లోని రాంచీలో చికెన్ బిర్యానీ ఇచ్చినందుకు ఆగ్రహించిన ఒక కస్టమర్, రెస్టారెంట్ యజమానిని తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది.

ఫోన్ కాల్‌తో మొదలైన ఘర్షణ

చికెన్ బిర్యానీ ఇచ్చినందుకు రెస్టారెంట్ యజమానిని కాల్చి చంపిన కస్టమర్
చికెన్ బిర్యానీ ఇచ్చినందుకు రెస్టారెంట్ యజమానిని కాల్చి చంపిన కస్టమర్

రాంచీలోని కంకే ప్రాంతానికి చెందిన ఓ గుర్తు తెలియని కస్టమర్ శనివారం రాత్రి రెస్టారెంట్‌కు వచ్చి శాఖాహార బిర్యానీని పార్శిల్‌గా తీసుకున్నాడు. ఇంటికి వెళ్లాక, తాను ఆర్డర్ చేసిన శాఖాహార బిర్యానీకి బదులు చికెన్ బిర్యానీ వచ్చిందని గుర్తించాడు. దీంతో అతను వెంటనే రెస్టారెంట్ యజమాని అయిన 50 ఏళ్ల విజయ్ నాగ్‌కు ఫోన్ చేసి, తీవ్రంగా వాగ్వాదానికి దిగాడు.

అర్ధరాత్రి రెస్టారెంట్‌కు వచ్చి కాల్పులు

ఫోన్ కాల్ తర్వాత ఈ వ్యవహారం మరింత ముదిరింది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం... రాత్రి సుమారు 11.30 గంటలకు ఆ కస్టమర్, తనతో పాటు మరో ముగ్గురు స్నేహితులను వెంటపెట్టుకుని రెస్టారెంట్‌కు వచ్చాడు. అప్పటికి విజయ్ నాగ్ అక్కడే కూర్చుని రాత్రి భోజనం చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అక్కడికి వచ్చిన కస్టమర్, విజయ్ నాగ్‌తో వాగ్వాదానికి దిగాడు. కొద్దిసేపటికే అది తోపులాట, ఘర్షణకు దారి తీసింది.

అనంతరం, కోపంతో ఊగిపోయిన ఆ కస్టమర్ వెంటనే తన వద్ద ఉన్న తుపాకీ తీసి, విజయ్ నాగ్ ఛాతిపై కాల్పులు జరిపి, తన అనుచరులతో కలిసి కారులో అక్కడి నుంచి పారిపోయాడు.

తుపాకీ శబ్దం విని చుట్టుపక్కల ప్రజలు అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న విజయ్ నాగ్‌ను వెంటనే రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS) ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఈ సంఘటనపై స్థానిక కాంకే ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు సురేష్ కుమార్ బైథా స్పందించారు. నలుగురు వ్యక్తులు వచ్చి శాఖాహారం ఆర్డర్ చేసి, అందులో చికెన్ ఎముకలు రావడంతోనే గొడవ పెరిగిందని ఆయన తెలిపారు. ఆ ఘర్షణలోనే కస్టమర్ కాల్పులు జరిపినట్లు బైథా పేర్కొన్నారు.

అయితే, ఈ కేసు కేవలం చికెన్ బిర్యానీ వివాదానికి మాత్రమే పరిమితం కాకపోవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు విజయ్ నాగ్ ఆస్తిపై కన్నేసి ఉండొచ్చని, ఇది ఆస్తి వివాదానికి సంబంధించిన అంశమై ఉండొచ్చని ఆయన ఆరోపించారు.

ఇదిలా ఉండగా, తమ కుటుంబ సభ్యుడి హత్యకు నిరసనగా విజయ్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నిందితులందరినీ 24 గంటల్లో అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే, నగరవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపడతామని హెచ్చరించారు. నిందితులను పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe