డిజిటల్ మోసాలకు ఆర్‌బీఐ చెక్: రూ.25 వేల వరకు పరిహారం.. కొత్త రూల్స్

డిజిటల్ బ్యాంకింగ్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకున్న బాధితులకు ఆర్‌బీఐ తీపి కబురు అందించింది. 2027 జనవరి 1 నుంచి కొత్త నిబంధనలను అమలు చేయనుంది. మోసపోయిన బాధితులకు తమ నికర నష్టంలో 85 శాతం లేదా గరిష్ఠంగా రూ.25,000 వరకు పరిహారం అందజేసే వెసులుబాటును కల్పించింది.

Published on: Oct 31, 2026, 18:12:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆన్‌లైన్ బ్యాంకింగ్, యూపీఐ వాడుక పెరుగుతున్న కొద్దీ డిజిటల్ మోసాలు కూడా విజృంభిస్తున్నాయి. ఫేక్ కస్టమర్ కేర్ నంబర్లు, ఫిషింగ్ లింకులు, నకిలీ పెట్టుబడి పథకాలు, డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరగాళ్లు ప్రజలను ముంచెత్తుతున్నారు. ఎక్కువగా వయోవృద్ధులను లక్ష్యంగా చేసుకుని ఖాతాల్లోని సొమ్మును ఖాళీ చేస్తున్నారు. డబ్బులు పోయాక ఏం చేయాలో తెలియక సతమతమవుతున్న బాధితులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఊరటనిచ్చే కొత్త నిబంధనలను తీసుకువచ్చింది.

డిజిటల్ మోసాలకు ఆర్‌బీఐ చెక్: రూ.25 వేల వరకు పరిహారం.. కొత్త రూల్స్
డిజిటల్ మోసాలకు ఆర్‌బీఐ చెక్: రూ.25 వేల వరకు పరిహారం.. కొత్త రూల్స్

2027 జనవరి 1 నుంచి ఈ నూతన మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. వీటి ప్రకారం సైబర్ మోసాల బారిన పడి సొమ్ము కోల్పోయిన బాధితులు ఇకపై మొత్తం నష్టాన్ని భరించాల్సిన అవసరం లేదు. అర్హులైన బాధితులు తమ నికర నష్టంలో 85 శాతం వరకు లేదా గరిష్ఠంగా రూ.25,000 పరిహారంగా పొందవచ్చు. ఈ రెండు మొత్తాల్లో ఏది తక్కువైతే దానిని బ్యాంకులు చెల్లిస్తాయి.

కొత్త రూల్స్ ఎప్పటి నుంచి? నిబంధనలు ఇవే!

ఈ నూతన నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చి ఏడాది పాటు కొనసాగుతాయి. ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ బదిలీల (ఈబీటీ) ద్వారా జరిగే మోసపూరిత లావాదేవీల్లో కస్టమర్‌దే తప్పు అని నిరూపించే బాధ్యతను ఆర్‌బీఐ ఈసారి బ్యాంకులపైనే మోపింది. పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) ట్రాన్సాక్షన్లు, ఏటీఎమ్ లావాదేవీలు, డైరెక్ట్ డిపాజిట్లు లేదా విత్‌డ్రాయల్స్, ఫోన్, ఇంటర్నెట్, కార్డ్ పేమెంట్ల ద్వారా జరిగే లావాదేవీలన్నీ ఈ నిబంధనల పరిధిలోకి వస్తాయి.

దేశంలో సైబర్ మోసాల తీవ్రత ఏ స్థాయిలో ఉందో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఆరేళ్ల కాలంలో భారతీయులు ఏకంగా రూ.52,976 కోట్లను సైబర్ నేరగాళ్ల చేతుల్లో కోల్పోయారని 2026 జూన్ 10న ఎన్‌హెచ్‌ఆర్‌సీ వెల్లడించింది. ఇందులో సుమారు 8 శాతం నష్టం ఒక్క "డిజిటల్ అరెస్ట్" మోసాల వల్లే వాటిల్లడం గమనార్హం.

ఎంత పరిహారం లభిస్తుంది? లెక్కింపు ఎలా?

ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. మోసపూరిత లావాదేవీ విలువ రూ.50,000 మించకుండా ఉంటేనే బాధితులు ఈ పరిహారానికి అర్హులవుతారు. పైగా, ఒక కస్టమర్ తన జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి వీలుంటుంది.

ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. బాధితులకు నేరుగా రూ.25,000 ఇచ్చేయరు. బ్యాంక్ రికవరీ చేసిన మొత్తాన్ని తీసివేశాక మిగిలిన నికర నష్టంలో 85 శాతం లేదా గరిష్ఠ పరిమితి రూ.25,000 లలో ఏది తక్కువైతే దాన్నే చెల్లిస్తాయి.

లెక్కింపు విధానం:

మొదటి ఉదాహరణ: ఒక వ్యక్తి డిజిటల్ మోసంలో రూ.20,000 కోల్పోయారనుకుందాం. ఆ తర్వాత బ్యాంక్ అధికారులు పరిశీలించి అందులో రూ.10,000 రికవరీ చేయగలిగితే, ఆ కస్టమర్ నికర నష్టం రూ.10,000 అవుతుంది. ఈ నికర నష్టంలో 85 శాతాన్ని లెక్కిస్తే రూ.8,500 వస్తుంది. కాబట్టి కస్టమర్‌కు రూ.8,500 పరిహారం లభిస్తుంది.

రెండో ఉదాహరణ: ఒకవేళ బాధితుడి నికర నష్టం రూ.40,000 ఉందనుకుందాం. ఇందులో 85 శాతం లెక్కిస్తే రూ.34,000 అవుతుంది. అయితే ఆర్‌బీఐ గరిష్ఠ పరిమితిని రూ.25,000 గా నిర్ణయించింది కాబట్టి కస్టమర్‌కు గరిష్ఠంగా రూ.25,000 మాత్రమే లభిస్తుంది.

కాగా, రూ.50,000 కంటే ఎక్కువ విలువైన మోసపూరిత లావాదేవీలు ఈ పరిహార పథకం పరిధిలోకి రావు.

పరిహారాన్ని ఎవరు చెల్లిస్తారు?

మీ ఖాతాలోని సొమ్ము మోసపూరితంగా ఖాళీ అయితే, మీరు ఖాతా కలిగి ఉన్న బ్యాంకే పరిహారం చెల్లించే బాధ్యత వహిస్తుంది. కస్టమర్ ఇచ్చే ఫిర్యాదుపై సదరు బ్యాంక్ విచారణ జరిపి, రికవరీ అయిన మొత్తాన్ని మినహాయించి నికర నష్టాన్ని లెక్కిస్తుంది. అనంతరం అర్హమైన పరిహార సొమ్మును బాధితుడి ఖాతాలో జమ చేస్తుంది.

కస్టమర్లకు తమ ఖాతా ఉన్న బ్యాంక్ నుంచి పరిహారం అందుతున్నప్పటికీ, ఈ ఆర్థిక భారాన్ని ఆర్‌బీఐ, సంబంధిత బ్యాంకులు ఉమ్మడిగా పంచుకుంటాయి. మోసం జరిగిన తీరు, లావాదేవీ విలువ, అది స్వదేశీ లావాదేవీనా లేక విదేశీ లావాదేవీనా అనే అంశాల ఆధారంగా ఆర్‌బీఐ, బ్యాంకుల వాటా ఆధారపడి ఉంటుంది.

ఫిర్యాదు ఎప్పుడు, ఎలా చేయాలి?

ఆర్‌బీఐ నిర్దేశించిన గరిష్ఠ పరిహారాన్ని పొందాలంటే బాధితులు సమయపాలన పాటించడం అత్యంత ముఖ్యం. మోసపూరిత లావాదేవీ జరిగిన 5 క్యాలెండర్ రోజుల్లోగా సదరు సమాచారాన్ని తమ బ్యాంకుకు నివేదించాల్సి ఉంటుంది.

బ్యాంకింగ్ కస్టమర్లు తమకు జరిగే ఏ రకమైన మోసపూరిత ఎలక్ట్రానిక్ బదిలీలనైనా ఆలస్యం చేయకుండా తక్షణమే బ్యాంకులకు తెలియజేయాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. దాంతో పాటు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ cybercrime.gov.in ద్వారా గానీ లేదా నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి కాల్ చేసి గానీ వెంటనే ఫిర్యాదు నమోదు చేయాలి. 5 రోజులు దాటితే ఈ పరిహార పథకం పరిధిలోకి రారని గుర్తుంచుకోవాలి.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More