RCB vs MI : లాస్ట్ ఓవర్ థ్రిల్లర్! ఆర్సీబీని గెలిపించిన భువీ- ప్లేఆఫ్స్ రేసు నుంచి ఎంఐ, ఎల్ఎస్జీ ఔట్..
IPL 2026 : రాయ్‌పూర్‌లో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై ఇండియన్స్‌పై ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కృనాల్ పాండ్యా (73) మెరుపు ఇన్నింగ్స్, భువనేశ్వర్ కుమార్ (4/23) ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో టాప్‌కు చేరగా, ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి.
RCB vs MI IPl 2026 : ఐపీఎల్ 2026లో మరో సంచలనం! ముంబై ఇండియన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాస్ట్ బాల్ విక్టరీని అందుకుంది. ఫలితంగా 14 పాయింట్లతో ఈ ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది విరాట్ కోహ్లీ ఆర్సీబీ. చావోరేవో మ్యాచ్‌లో ఓటమి వల్ల ముంబై ఇండియన్స్ ఈ సీజన్ ప్లేఆఫ్స్ రేసు నుంచి ఔట్ అయ్యింది. అంతే కాదు రాయల్ ఛాలెంజర్స్ గెలుపు కారణంగా లక్నో సూపర్ జెయింట్స్ సైతం ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.
కృనాల్ పాండ్యా వీరోచిత పోరాటం
167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే షాకులు తగిలాయి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (0) డకౌట్ కాగా, పడిక్కల్ (12), రజత్ పాటిదార్ (8) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును కృనాల్ పాండ్యా అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. కండరాలు పట్టేసినా, పట్టు వదలకుండా పోరాడిన కృనాల్.. 46 బంతుల్లో 5 సిక్సర్లు, 4 ఫోర్లతో 73 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
కాగా చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం పడింది. అప్పటికే ఆర్సీబీ 7 వికెట్లు కోల్పోయింది. మూడో బంతికి షెపర్డ్ సైతం ఔట్ అయ్యాడు. ఇక ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోతుందని అందరు అనుకున్నారు. కానీ భువనేశ్వర్ కుమార్ అద్భుతం చేశాడు! వస్తూనే 6 బాదేశాడు. అనంతరం 1 బాల్ 2 రన్స్ చేయాల్సిన వేళ రసిఖ్ ఆర్సీబీని విజయ తీరాలకు చేర్చాడు.
ముంబై బౌలర్లలో కార్బిన్ బాష్ 4 వికెట్లతో చెలరేగినా, కీలక సమయంలో ఫీల్డర్లు చేసిన తప్పిదాలు ఆ జట్టును దెబ్బతీశాయి. ముఖ్యంగా కృనాల్ పాండ్యా ఇచ్చిన క్యాచ్‌ను నమన్ ధీర్, తిలక్ వర్మ పరస్పర అవగాహన లోపంతో చేజార్చడం మ్యాచ్ మలుపు తిప్పింది.
భువీ మ్యాజిక్.. ముంబై విలవిల..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ను సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తన స్వింగ్‌తో వణికించాడు. పిచ్‌పై ఉన్న పగుళ్లను, బౌన్స్‌ను చక్కగా ఉపయోగించుకున్న భువీ.. రియాన్ రికెల్టన్ (2), రోహిత్ శర్మ (22), తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (0)లను పెవిలియన్‌కు పంపి ముంబైని కోలుకోలేని దెబ్బ తీశాడు. 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో తిలక్ వర్మ (57), నమన్ ధీర్ (47) నాలుగో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకోవడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేయగలిగింది.
ఆర్సీబీ తరపున భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రదర్శన చేశాడు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


