బాంబు పేలుడుతో ఎగిరిపడిన శరీర భాగాలు.. మంటల్లో 22 వాహనాలు.. పేలుడు తీవ్రత భారీ స్థాయిలో..
ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర జరిగిన కారు పేలుడు తీవ్రత అత్యంత భారీగా ఉంది. ఈ పేలుడు ధాటికి శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోగా.. ఏకంగా 22 వాహనాలకు మంటలు అంటుకున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీ ఉలిక్కి పడింది. 14 ఏళ్ల తర్వాత తొలిసారి జరిగిన పేలుళ్లలో 8 మంది మృతి చెందగా.. 24 మంది గాయపడ్డారు. మెల్లగా కదులుతున్న కారు పేలడంతో ఆ పేలుడు ధాటికి శరీర భాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. పేలుడు తీవ్రత ఎంతలా ఉంది అంటే.. ఏకంగా మూడు, నాలుగు కిలోమీటర్ల వరకు శబ్దం వినిపించడం గమనార్హం.

ఢిల్లీ పేలుడు భారీగా..
ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని రెడ్ సిగ్నల్ దగ్గర నెమ్మదిగా కదులుతున్న కారులో పేలుడు జరిగింది. ఈ కారు వెనుక భాగంలో పేలుడు సంభవించింది. ఇది హర్యానాలో రిజిస్టర్ అయిన కారుగా భావిస్తున్నారు. బాంబు పేలుడు తర్వాత మృతుల శరీర భాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోగా.. 22 వాహనాలకు నిప్పంటుకున్నట్లు పోలీసులు అధికారులు వెల్లడించారు.
ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఏమన్నారంటే?
ఎర్రకోట కారు బాంబు పేలుడుపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా స్పందించారు. “ఈరోజు సాయంత్రం 6.52 గంటల సమయంలో మెల్లగా కదులుతున్న వాహనం రెడ్ లైట్ దగ్గర ఆగింది. అప్పుడు అందులో పేలుడు సంభవించింది. ఆ పేలుడు వల్ల సమీపంలోని వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. కొందరు మరణించగా.. మరికొందరు గాయపడ్డారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. హోంమంత్రి కూడా మాతో మాట్లాడారు” అని ఆయన వెల్లడించారు.
పేలుడు సంభవించిన కారు హ్యుండయ్ ఐ20గా కొందరు చెబుతుండగా.. మరికొందరు మారుతి సుజుకి డిజైర్ అని అంటున్నారు. పేలుడు సమయంలో ఆ కారులు ప్రయాణికులు ఉన్నట్లు కూడా చెబుతున్నారు. కారు వెనుక భాగంలో ఈ పేలుడు జరిగింది.
అందరం చనిపోతామనుకున్నాం..
ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న ఒక స్థానిక దుకాణదారుడు న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. తన భయంకర అనుభవాన్ని పంచుకున్నాడు. “నా జీవితంలో ఇంత పెద్ద పేలుడు శబ్దాన్ని నేను ఎప్పుడూ వినలేదు. పేలుడు ధాటికి నేను ఏకంగా మూడుసార్లు కింద పడిపోయాను. మేమందరం చనిపోతామేమో అనిపించింది” అని ఆయన తీవ్ర ఆందోళనతో తెలిపారు.
ఘటనా స్థలానికి చేరుకున్న మరో స్థానికుడు మాట్లాడుతూ, పరిస్థితి భయంకరంగా ఉందని వివరించారు. "మేము సంఘటన స్థలానికి చేరుకున్నప్పుడు, రోడ్డుపై శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉండటం చూశాం. అసలు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు" అని చెప్పారు. ఈ ఘటనలో పలు కార్లు కూడా ధ్వంసమయ్యాయని ఆయన తెలిపారు.
“రోడ్డుపై ఎవరిదో చేయి పడి ఉండటం చూసి మేము పూర్తిగా షాక్ అయ్యాము. ఆ భయాన్ని మాటల్లో చెప్పలేను” అని ఆయన ఏఎన్ఐతో అన్నారు. స్థానిక నివాసి రాజ్‌ధర్ పాండే న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ, తన ఇంటి నుంచి మంటలు కనిపించాయని, వెంటనే ఏం జరిగిందో చూడడానికి కిందకు వచ్చానని చెప్పారు. అప్పుడు "పెద్ద పేలుడు" శబ్దం వినిపించిందని ఆయన తెలిపారు.
ఆటో డ్రైవర్ అనుభవం
పేలుడు ధాటికి గాయపడిన ఆటో డ్రైవర్ జీషన్ పీటీఐ (PTI) వార్తా సంస్థతో మాట్లాడుతూ.. పేలిన కారు తనకు "కేవలం రెండు అడుగుల దూరంలో" ఉందని చెప్పారు. “అందులో బాంబు ఉందో లేక మరేదైనా ఉందో నాకు తెలియదు.. కానీ అది పేలింది," అని ఆయన తెలిపారు.
అగ్నిమాపక దళం స్పందన
డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఏకే మాలిక్ మాట్లాడుతూ.. "చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ సమీపంలో కారులో పేలుడు" గురించి తమకు సమాచారం అందిందని తెలిపారు. వెంటనే ఏడు ఫైర్ యూనిట్లను సంఘటన స్థలానికి పంపినట్లు చెప్పారు. "సాయంత్రం 7:29 గంటలకు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడం జరిగింది" అని ఆయన జోడించారు. ఢిల్లీలో జరిగిన ఈ పేలుడు తర్వాత, ముంబైతో సహా మొత్తం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భద్రతను పెంచారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


