లాభాల వేట: రిలయన్స్ Q2 ఫలితాలు - 16% వృద్ధికి 5 కారణాలు
రిలయన్స్ ఇండస్ట్రీస్ Q2FY26లో నికర లాభం (PAT) గతేడాది కంటే 16% వృద్ధిని సాధించి రూ. 22,146 కోట్లుగా నమోదైంది. జియో (12.8% PAT వృద్ధి), రిటైల్ (21.9% PAT వృద్ధి), O2C విభాగాల బలమైన పనితీరు ఈ వృద్ధికి ప్రధాన కారణాలు. కొత్త ఇంధనం, AI రంగాలపై ఛైర్మన్ ముకేశ్ అంబానీ దృష్టి సారించారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) తాజా త్రైమాసిక ఫలితాల్లో సత్తా చాటింది. జూలై-సెప్టెంబర్ (Q2FY26) త్రైమాసికంలో కంపెనీ నికర లాభం (PAT) గతేడాది కంటే 16 శాతం పెరిగి రూ. 22,146 కోట్లకు చేరుకుంది. బలమైన O2C, జియో, రిటైల్ వ్యాపారాలు ఈ అద్భుతమైన వృద్ధికి దోహదపడ్డాయని ఛైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు. కంపెనీ పనితీరులో కీలకమైన 5 హైలైట్స్ ఇక్కడ అందిస్తున్నాం.

మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఈ క్వార్టర్‌లో స్థిరమైన వృద్ధిని కనబరిచింది.
నికర లాభం (PAT): గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 19,101 కోట్లుగా ఉన్న నికర లాభం, ఈసారి ఏకంగా 16 శాతం పెరిగి రూ. 22,146 కోట్లకు చేరింది.
యాజమాన్యానికి దక్కిన నికర లాభం: కంపెనీ యజమానులకు (Owners) దక్కిన నికర లాభం కూడా గతేడాదితో పోలిస్తే 9.7 శాతం పెరిగి రూ. 18,165 కోట్లుగా నమోదైంది.
ఆపరేషన్స్ ద్వారా ఆదాయం: కార్యకలాపాల ద్వారా వచ్చే ఏకీకృత ఆదాయం 10 శాతం పెరిగి రూ. 2,83,548 కోట్లుగా ఉంది.
EBITDA వృద్ధి: ఏకీకృత EBITDA (వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ విమోచనకు ముందు ఆదాయం) 14.6 శాతం పెరిగి రూ. 50,367 కోట్లకు చేరుకుంది. EBITDA మార్జిన్ 80 బేసిస్ పాయింట్లు పెరిగి 17.8 శాతంగా నమోదైంది.
ముకేశ్ అంబానీ మాట్లాడుతూ, “O2C, జియో, రిటైల్ వ్యాపారాల నుండి బలమైన సహకారం లభించడంతో Q2FY26లో రిలయన్స్ అద్భుతమైన పనితీరును కనబరిచింది. దేశీయ దృష్టి సారించిన పోర్ట్‌ఫోలియో, భారతీయ ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక వృద్ధి ఈ పురోగతిని ప్రతిబింబిస్తున్నాయి” అని వివరించారు.
వ్యాపార రంగాలలో మెరుపులు: టాప్ 5 హైలైట్స్
1. జియో ప్లాట్‌ఫామ్స్: డిజిటల్ సేవల్లో దూకుడు
రిలయన్స్ టెలికాం విభాగం జియో ఈ త్రైమాసికంలో ఆరోగ్యకరమైన వృద్ధిని సాధించింది.
నికర లాభం: జియో నికర లాభం 12.8 శాతం వృద్ధితో రూ. 7,379 కోట్లకు చేరింది.
ఆపరేషన్స్ ఆదాయం: కార్యకలాపాల ద్వారా ఆదాయం 14.6 శాతం పెరిగి రూ. 36,332 కోట్లుగా నమోదైంది.
EBITDA: EBITDAలో 17.7 శాతం పెరుగుదల కనిపించింది. EBITDA మార్జిన్ 140 బేసిస్ పాయింట్లు పెరిగి 51.6 శాతానికి ఎగబాకింది.
కస్టమర్ బేస్ & ARPU: కస్టమర్ల సంఖ్య గతేడాది కంటే 5.8 శాతం పెరిగి 50.64 కోట్లకు చేరింది. సగటు ఆదాయం (ARPU) రూ. 211.4కి పెరిగింది. ప్రమోషనల్ 5G ఆఫర్ల ప్రభావం దీనిపై కొంత ఉందని కంపెనీ తెలిపింది.
భవిష్యత్తుపై ధీమా: "జియో నెట్‌వర్క్, టెక్నాలజీ నాయకత్వంతో, హోమ్స్, మొబిలిటీ సేవల్లో చందాదారుల సంఖ్య పెరుగుదలతో డిజిటల్ సేవల వ్యాపారం వృద్ధి చెందుతూనే ఉంది" అని ఛైర్మన్ అంబానీ స్పష్టం చేశారు.
2. రిలయన్స్ రిటైల్: స్టోర్ల విస్తరణే లక్ష్యం
రిలయన్స్ రిటైల్ ఈ క్వార్టర్‌లో కొత్త స్టోర్లను తెరవడంపై దృష్టి పెట్టింది. మొత్తం 412 కొత్త స్టోర్‌లు ప్రారంభించింది. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య 19,821కి చేరుకుంది.
నికర లాభం: నికర లాభం 21.9 శాతం వృద్ధితో రూ. 3,457 కోట్లుగా నమోదైంది.
ఆదాయం: కార్యకలాపాల ద్వారా ఆదాయం 19 శాతం పెరిగి రూ. 79,128 కోట్లుగా ఉంది.
మార్జిన్ క్షీణత: EBITDA 16.5 శాతం పెరిగినా, మార్జిన్ 20 బేసిస్ పాయింట్లు తగ్గి 8.6 శాతం వద్ద ఉంది.
వినియోగం: "మా రిటైల్ వ్యాపారం వృద్ధి వేగం పట్ల నేను సంతోషిస్తున్నాను. అన్ని ఫార్మాట్‌లు అధిక వాల్యూమ్‌లను నమోదు చేశాయి. దీనివల్ల ఆదాయం, EBITDA రెండింటిలోనూ బలమైన వృద్ధి కనిపించింది. ఇటీవలి జీఎస్టీ సంస్కరణలు వినియోగం ఆధారిత వృద్ధికి మరింత ఊపునిచ్చాయి" అని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు.
3. ఆయిల్-టు-కెమికల్స్ (O2C): లాభాల మార్జిన్ జంప్
అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో అస్థిరత ఉన్నప్పటికీ, O2C వ్యాపారం బలంగా పెరిగింది.
ఆదాయం: ఆదాయం 3.2 శాతం పెరిగి రూ. 1,60,558 కోట్లుగా నమోదైంది.
EBITDA: EBITDA 20.9 శాతం పెరిగి రూ. 15,008 కోట్లకు చేరుకుంది.
మార్జిన్ మెరుగుదల: EBITDA మార్జిన్ ఏకంగా 130 బేసిస్ పాయింట్లు పెరిగి 9.3 శాతంగా నమోదైంది.
భవిష్యత్తు అంచనా: "డౌన్‌స్ట్రీమ్ రసాయనాలు అధిక ఉత్పత్తి సామర్థ్యం కారణంగా ప్రభావితమవుతున్నాయి. పరిశ్రమ వాటాదారులు తీసుకునే చర్యలు మధ్యకాలంలో ప్రపంచ డౌన్‌స్ట్రీమ్ మార్కెట్‌లను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి" అని అంబానీ అభిప్రాయపడ్డారు.
4. ఆయిల్ అండ్ గ్యాస్ (E&P): నిర్వహణ వ్యయాల దెబ్బ
ఈ విభాగం ఆదాయంలో స్వల్ప తగ్గుదల, నిర్వహణ వ్యయాలు పెరగడం కారణంగా మార్జిన్లు తగ్గాయి.
EBITDA & మార్జిన్: EBITDA 5.4 శాతం తగ్గి రూ. 5,002 కోట్లుగా ఉంది. దీంతో మార్జిన్ 240 బేసిస్ పాయింట్లు తగ్గి 82.6 శాతంకు పరిమితమైంది.
తగ్గిన ఆదాయం: KGD6లో ఉత్పత్తి సహజంగా తగ్గడం వల్ల ఆదాయం 2.6 శాతం తగ్గింది. నిర్వహణ కార్యకలాపాల కారణంగా ఆపరేటింగ్ ఖర్చులు కూడా పెరిగాయని కంపెనీ వివరించింది.
5. న్యూ ఎనర్జీ: సోలార్, బ్యాటరీ రంగాల్లో వేగం
రిలయన్స్ కొత్త వృద్ధి ఇంజిన్‌గా భావిస్తున్న న్యూ ఎనర్జీ రంగంలో వేగంగా ముందుకు సాగుతోంది.
ఉత్పత్తి లక్ష్యాలు: 20 GWp సోలార్ పీవీ తయారీ సామర్థ్యం, 100 GWh బ్యాటరీ గిగా-ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే దిశగా రిలయన్స్ పనులు చేస్తోంది.
కమీషనింగ్: ఇప్పటికే నాలుగు పీవీ మాడ్యూల్ లైన్‌లు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 2025లో మొదటి సెల్ లైన్ కూడా కమీషన్ అవుతుందని భావిస్తున్నారు.
కచ్‌లో అభివృద్ధి: కచ్‌లోని 5,50,000 ఎకరాల స్థలంలో ఇంజనీరింగ్, సాధ్యాసాధ్యాల అధ్యయనాలు పూర్తయ్యాయి. స్థల అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయని కంపెనీ తెలిపింది.
ఏఐ ప్లాన్స్: "భారతదేశానికి, భారతీయులకు ప్రయోజనం చేకూర్చేలా అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించుకునే లక్ష్యంతోనే AI రంగంలో మా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి" అని ముఖేష్ అంబానీ తెలిపారు.
(నిరాకరణ: ఈ కథనం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అందించబడింది. మార్కెట్ పరిస్థితులు వేగంగా మారవచ్చు, కాబట్టి పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు ధృవీకరించబడిన ఆర్థిక నిపుణులను సంప్రదించాలని పెట్టుబడిదారులకు మా సలహా.)













