వోడాఫోన్ ఐడియాకు బిగ్​ రిలీఫ్​- స్టాక్​ ప్రైజ్​ జంప్​..

వోడాఫోన్ ఐడియా ఏజీఆర్​ బకాయిలను తిరిగి లెక్కించే అంశాన్ని పునఃపరిశీలించుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది సుప్రీంకోర్టు. కోర్టు నిర్ణయం తర్వాత కంపెనీ షేర్లు పెరిగాయి.

Published on: Oct 27, 2025, 12:52:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ ఐడియాకు భారీ ఊరట! సంస్థ చెల్లించాల్సిన ఏజీఆర్​ (అడ్జెస్టెడ్​ గ్రాస్​ రెవెన్యూ) బకాయిలను తిరిగి లెక్కించే (రీఅసెస్​మెంట్​) అంశాన్ని పునఃపరిశీలించుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది. ఫలితంగా సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో వోడాఫోన్​ ఐడియా షేరు ధర దూసుకెళ్లింది!

వోడాఫోన్​ ఐడియాకు ఊరట.. (Reuters)
వోడాఫోన్​ ఐడియాకు ఊరట.. (Reuters)

ఈ అంశం కేంద్ర ప్రభుత్వ ‘పాలసీ పరిధి’లోకే వస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ విషయాన్ని కేంద్రం తిరిగి పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకోవడానికి ఎటువంటి అడ్డంకి లేదని కూడా కోర్టు స్పష్టం చేసింది.

వోడాఫోన్​ ఐడియాకు 'సుప్రీం' రిలీఫ్!

ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వోడాఫోన్ ఐడియా కంపెనీకి ఇది ఒక పెద్ద ఊరట అని చెప్పుకోవాలి. టెలికాం ఆపరేటర్ ఫిర్యాదులను న్యాయపరమైన జోక్యం లేకుండా పరిష్కరించుకోవడానికి, ఏజీఆర్​ బకాయిల డిమాండ్‌ను పునఃపరిశీలించుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి కోర్టు అనుమతి ఇచ్చింది.

కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అదనపు సమయాన్ని కోరడంతో ఈ విచారణ వాయిదా పడింది. ప్రధాన న్యాయమూర్తి బీర్​ గవాయి ఈ అంశంపై స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని మెహతాను ఆదేశించి, విచారణను వాయిదా వేశారు.

వోడాఫోన్​ ఐడియా షేరు ధర..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో వోడాఫోన్​ ఐడియా షేరు రూ. 10.57 దగ్గర ఇంట్రాడే హైని నమోదు చేసి, మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల ప్రాంతంలో రూ. 9.98 (3.74శాతం లాభాల్లో) వద్ద ట్రేడ్​ అవుతోంది.

వోడాఫోన్​ ఐడియా ఏజీఆర్​ కేసు టైమ్‌లైన్..

ఏజీఆర్​ అంటే టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రమ్ ఛార్జీలను లెక్కించడానికి ఉపయోగించే ఆదాయ గణాంకం.

రుణభారం ఎక్కువగా ఉన్న వోడాఫోన్​ ఐడియా టెలికాం సంస్థ.. 2016-17 ఆర్థిక సంవత్సరం వరకు తమకు విధించిన రూ. 5,606 కోట్ల అదనపు ఏజీఆర్​ బకాయిల డిమాండ్‌ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసింది.

ఈ విషయంపై కంపెనీతో ఒక పరిష్కారానికి రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం గతంలో తెలిపింది. వోడాఫోన్ ఐడియా మనుగడలో ప్రభుత్వానికి నేరుగా భాగస్వామ్యం ఉందని కోర్డుకు గుర్తుచేసింది.

ప్రభుత్వం వోడాఫోన్​ ఐడియా కంపెనీలో దాదాపు 50% వాటాను కలిగి ఉంది.

2020 ఫిబ్రవరి 3 నాటి ‘తగ్గింపు ధృవీకరణ మార్గదర్శకాల’ను అనుసరించి, 2016-17 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న ఏజీఆర్​ బకాయిలన్నింటినీ సమగ్రంగా రీ-అసెస్​ చేసి సరిచేయాలని డీఓటీని ఆదేశించాలని వోడాఫోన్ ఐడియా 2 కోరింది.

కాగా.. ఏజీఆర్​ బకాయిల లెక్కింపులో తప్పులు ఉన్నాయని, వాటిని సరిదిద్దాలని టెలికాం కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌లను సుప్రీంకోర్టు 2021లో తోసిపుచ్చింది. ఆ ఉత్తర్వులను పునఃసమీక్షించడానికి ఈ ఏడాది ప్రారంభంలో నిరాకరించింది.

సెప్టెంబర్ 2020లో, టెలికాం సేవల ప్రొవైడర్లు తమ ఏజీఆర్​ సంబంధిత బకాయిలు రూ. 93,520 కోట్లను చెల్లించడానికి 10 సంవత్సరాల గడువును సుప్రీంకోర్టు నిర్ణయించింది. 2021 మార్చి 31 నాటికి డీఓటీ అంచనా వేసిన మొత్తం బకాయిలలో 10% చెల్లించాలని, మిగిలిన మొత్తాన్ని 2021 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చి 31 వరకు వార్షిక వాయిదాలలో చెల్లించాలని ఆదేశించింది.

ఏజీఆర్​ బకాయిల లెక్కింపులో డీఓటీ సరిగ్గానే వ్యవహరిస్తోందని అక్టోబర్ 2019లో సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. ఫలితంగా టెలికాం సంస్థల ఏజీఆర్​ బకాయిలు భారీగా పెరిగాయి.

గతంలో, ఏజీఆర్​ నిర్వచనంలో టెలికాం, నాన్-టెలికాం ఆదాయం (డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీ లేదా ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం వంటివి) కూడా ఉండేవి. అయితే 2021లో, ప్రభుత్వం నిబంధనలను సవరించింది. నాన్-టెలికాం ఆదాయాన్ని ఏజీఆర్​ లెక్కల నుంచి మినహాయించి, టెలికాం ఆపరేటర్లపై ఆర్థిక భారాన్ని తగ్గించింది.

నేటి వరకు వోడాఫోన్​ ఐడియాకు ఒక్క ఏజీఆర్​ రూపంలోనే రూ. 83,400 కోట్ల బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మొత్తం అప్పులు రూ. 2లక్షల కోట్లు దాటిపోతాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More