Adventure cars : మీ సాహసాల కోసం- రెనాల్ట్ డస్టర్​ అడ్వెంచర్ ఎడిషన్! హైలైట్స్​ ఇవే..

భారతదేశంలో మిడ్-సైజ్ ఎస్‌యూవీ ట్రెండ్‌ను మార్చిన ఐకానిక్ మోడల్ 'రెనాల్ట్ డస్టర్' సరికొత్త అడ్వెంచర్ ఎడిషన్‌లో మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ కారు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jul 14, 2026, 12:19:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీ కార్లకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చి, మధ్యతరగతి వాహనదారుల కలల కారుగా నిలిచిన మోడల్ ‘రెనాల్ట్ డస్టర్’. లాంచ్ అయిన కొత్తలోనే దేశీయ రోడ్లపై సంచలనాలు సృష్టించిన ఈ ఐకానిక్ ఎస్‌యూవీ, ఇప్పుడు సరికొత్త హంగులతో సరికొత్త అవతారంలో కస్టమర్ల ముందుకు వచ్చింది. ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా ఈ మోడల్ సాధించిన అద్భుత విజయాలకు గుర్తుగా ‘డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్’ని మార్కెట్లో విడుదల చేసింది.

రెనాల్ట్ డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్..
రెనాల్ట్ డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్..

ఈ సరికొత్త స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ధరను రూ. 12.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ లేటెస్ట్ ఎడిషన్ వివరాలను ఇక్కడ చూసేయండి..

రెనాల్ట్ డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్- సాహస యాత్రలను గుర్తుచేసే డిజైన్..

ఈ రెనాల్ట్ డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ సాధారణ మోడల్‌తో పోలిస్తే విజువల్ పరంగా ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. సాహసోపేతమైన ప్రయాణాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే 'లేహ్-లడఖ్' భౌగోళిక గుర్తులను, అక్కడి కోఆర్డినేట్స్ (34.27 N, 77.60 E) ను ప్రతిబింబించేలా కారుపై ప్రత్యేకమైన ‘అడ్వెంచర్ డెకాల్స్’ను అమర్చారు. కారు లోపల అడ్వెంచర్ ఫ్లోర్ మ్యాట్స్, బయట ప్రత్యేక అలంకరణలు ఈ వాహనానికి మరింత రగ్గడ్ లుక్‌ను ఇస్తున్నాయి.

ఫీచర్ల పరంగా చూస్తే, ఇందులో ఫుల్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఆకాశాన్ని తలపించేలా ఎలక్ట్రిక్ పనోరమిక్ సన్‌రూఫ్, బూట్ స్పేస్ సులభంగా తెరుచుకునేందుకు వీలుగా ఎలక్ట్రిక్ పవర్డ్ టెయిల్‌గేట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. కారు క్యాబిన్‌లో ప్రయాణీకులను అలరించేందుకు 10.1-ఇంచుల ఓపెన్‌ఆర్ లింక్ మల్టీమీడియా సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. అలాగే కారును ఎక్కడి నుంచైనా కంట్రోల్ చేసేలా ‘మై రెనాల్ట్’ యాప్ ద్వారా కనెక్టెడ్ కార్ ఫీచర్లు, ఆటోమేటిక్ డ్యూయల్-జోన్ ఎయిర్ కండిషనింగ్, కారుకు స్పోర్టీ లుక్ ఇచ్చే 17-ఇంచుల ఓషన్ అల్లాయ్ వీల్స్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

రెనాల్ట్ డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్- పవర్‌ఫుల్ టర్బో ఇంజన్లు..

కొత్త డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ మొత్తం మూడు రకాల పవర్‌ట్రెయిన్ (ఇంజన్, గేర్‌బాక్స్) కాంబినేషన్లలో లభిస్తుంది. కస్టమర్లు తమ డ్రైవింగ్ శైలికి తగినట్లుగా మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.

Turbo TCe 100 MT: దీని ధర రూ. 12.99 లక్షలుగా ఉంది. ఇందులో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 100 హెచ్​పీ శక్తిని, 160 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

Turbo TCe 160 MT: దీని ధర రూ. 13.99 లక్షలు. ఇందులో మరింత పవర్‌ఫుల్ 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 163 హార్స్‌పవర్ శక్తిని, 280 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ జత చేశారు.

Turbo TCe 160 DCT: లాంగ్ డ్రైవ్స్‌లో క్లచ్ నొక్కే బాధ లేకుండా ప్రశాంతంగా ప్రయాణించాలనుకునే వారి కోసం ఈ ఆటోమేటిక్ వేరియంట్ అందుబాటులో ఉంది. దీని ధర రూ. 15.39 లక్షలు. ఇది 6-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ (డీసీటీ) ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.

ప్రత్యేక వేదికపై గ్రాండ్ లాంచ్!

భారతీయ రోడ్లపై ఎలాంటి గుంతలు, గతుకులనైనా తట్టుకుని సుఖవంతమైన ప్రయాణాన్ని అందించడంలో డస్టర్‌కు సాటిలేదు. వేలాది మంది భారతీయ కస్టమర్ల జీవిత ప్రయాణంలో భాగమైన ఈ కారు వారసత్వాన్ని గౌరవిస్తూ ఈ అడ్వెంచర్ ఎడిషన్‌ను తెచ్చినట్లు కంపెనీ పేర్కొంది.

ఫ్రాన్స్ జాతీయ దినోత్సవమైన ‘బాస్టిల్ డే’ సందర్భంగా దేశ రాజధాని దిల్లీలో ఈ కారును ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి భారతదేశంలో ఫ్రాన్స్ రాయబారి హెచ్​ఈ థియరీ మాథౌ, రెనాల్ట్ గ్రూప్ ఇండియా సీఈఓ స్టెఫాన్ డెబ్లైస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ లాంచ్ ఈవెంట్ రెనాల్ట్ బ్రాండ్ ఫ్రెంచ్ మూలాలను, భారతదేశంతో ఉన్న బలమైన అనుబంధాన్ని మరోసారి చాటిచెప్పింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More