Kia Syros EV : నెక్సాన్ ఈవీకి చెక్! 520 కి.మీ రేంజ్‌తో దూసుకొస్తున్న కియా ఎలక్ట్రిక్ కారు- బుకింగ్స్ ఓపెన్..

Kia Syros EV range : ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో రారాజుగా వెలుగుతున్న టాటా నెక్సాన్ ఈవీకి గట్టి పోటీ ఇచ్చేందుకు కియా మోటార్స్ సరికొత్త సైరోస్ ఈవీని సిద్ధం చేస్తోంది. ఇంకొన్ని రోజుల్లో లాంచ్ కానున్న ఈ సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ బ్యాటరీ, రేంజ్ వివరాలు లీక్ అయ్యాయి. ఆ వివరాలు..

Published on: Jul 13, 2026, 10:43:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) హవా రోజురోజుకూ పుంజుకుంటోంది. ముఖ్యంగా సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈవీ సెగ్మెంట్‌లో టాటా నెక్సాన్ ఈవీ ఇప్పటివరకు తిరుగులేని లీడర్‌గా కొనసాగుతోంది. అయితే ఈ ఆధిపత్యానికి బ్రేక్ వేసేందుకు దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మార్కెట్లో ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ‘కియా సైరోస్’ మోడల్‌ను ఇప్పుడు పూర్తి ఎలక్ట్రిక్ అవతారంలో తీసుకువస్తోంది.

కియా సైరోస్​ ఐసీఈ మోడల్..
కియా సైరోస్​ ఐసీఈ మోడల్..

మరో రెండు వారాల్లో, అంటే జులై ఆఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో ఈ సరికొత్త కియా సైరోస్ ఈవీ అధికారికంగా మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పలు కియా డీలర్‌షిప్‌లలో రూ. 25,000 టోకెన్ అడ్వాన్స్‌తో అన్-అఫీషియల్ బుకింగ్స్ కూడా ప్రారంభించినట్లు సమాచారం.

అయితే లాంచ్‌కు ముందే దీనికి సంబంధించిన కీలకమైన బ్యాటరీ సామర్థ్యం, రేంజ్ వివరాలు డీలర్ వర్గాల ద్వారా లీకయ్యాయి. దీనితో కార్ల ప్రియుల్లో ఈ కారుపై ఆసక్తి మరింత పెరిగింది.

కియా సైరోస్​ ఈవీ రేంజ్- నెక్సాన్ ఈవీ కన్నా ఎక్కువ!

మీడియా సమాచారం ప్రకారం.. ఈ అప్‌కమింగ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కియా సంస్థ రెండు రకాల బ్యాటరీ ప్యాక్‌లతో ఆఫర్ చేయబోతోంది. బడ్జెట్ వినియోగదారుల కోసం ఒక స్టాండర్డ్ వేరియంట్, ఎక్కువ దూరం ప్రయాణించే వారి కోసం లాంగ్ రేంజ్ వేరియంట్‌ను తీసుకువస్తున్నారు.

స్టాండర్డ్ రేంజ్: ఇందులో 42 kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 420 కిలోమీటర్ల (ఏఆర్​ఏఐ సర్టిఫైడ్) రేంజ్ ఇస్తుందని లీకైన వివరాలు చెబుతున్నాయి.

లాంగ్ రేంజ్: ఇందులో భారీ సామర్థ్యం గల 51.4 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించనున్నారు. ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 520 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని తెలుస్తోంది.

ఈ 520 కిమీ రేంజ్ గనుక నిజమైతే, ప్రస్తుత సెగ్మెంట్ లీడర్ టాటా నెక్సాన్ ఈవీ లాంగ్ రేంజ్ వేరియంట్ కంటే ఇది ఎక్కువే అని చెప్పాలి.

కియా సైరోస్ ఈవీ లుక్ అదిరింది..

ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఐసీఈ (పెట్రోల్/డీజిల్) సైరోస్ ప్లాట్‌ఫామ్‌ ఆధారంగానే ఈ ఎలక్ట్రిక్ కారును రూపుదిద్దారు. కానీ రోడ్డుపై చూడగానే ఇది ఈవీ అని గుర్తుపట్టేలా కియా కొన్ని అదిరిపోయే మార్పులు చేసింది. ముందుభాగంలో సాంప్రదాయ గ్రిల్‌కు బదులుగా ఈవీల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన క్లోజ్డ్ గ్రిల్ ప్యానెల్ వస్తోంది. బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచేలా సరికొత్త ఏరోడైనమిక్ అలాయ్ వీల్స్, కారుకు స్పోర్టీ లుక్ ఇచ్చే నియాన్-గ్రీన్ బ్రేక్ కాలిపర్స్, వెనుక భాగంలో 'Clean EV' అనే ప్రత్యేక బ్యాడ్జింగ్‌ను జోడించారు.

కియా సైరోస్ ఈవీ ఫీచర్ల జాతర..

కియా సైరోస్​ ఈవీ లోపలి భాగాన్ని గనుక గమనిస్తే, ఫీచర్ల విషయంలో సంస్థ ఎక్కడా రాజీ పడలేదు. డాష్‌బోర్డ్‌పై కళ్లు చెదిరేలా రెండు భారీ 12.3 అంగుళాల డిస్‌ప్లేల సెటప్ ఉంటుంది. ఇందులో ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం, మరొకటి డ్రైవర్ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కోసం పని చేస్తుంది. ఇవి కాకుండా ఏసీ కంట్రోల్స్ కోసం ప్రత్యేకంగా మరో 5 అంగుళాల టచ్ ప్యానెల్‌ను అమర్చారు.

డ్రైవింగ్‌ను మరింత సుఖమయం చేసేందుకు పవర్డ్ డ్రైవర్ సీట్, వేసవిలో చల్లదనాన్ని ఇచ్చే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. అంతేకాదు, ఈ సెగ్మెంట్లోనే మొదటిసారిగా వెనుక సీట్లో కూర్చునే ప్రయాణికుల కోసం 'రియర్ సీట్ బేస్ వెంటిలేషన్' సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. వీటితో పాటు డ్యుయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం ఆడియో సిస్టమ్ మరియు భద్రత కోసం అత్యంత అధునాతన లెవెల్ 2 అడాస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) ఫీచర్లు ఈ కారు సొంతం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More