రోహిత్ శర్మకు కైల్ జేమీసన్ గండం: న్యూజిలాండ్‌లో భారత్‌కు కలవరం

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యం సాధించినప్పటికీ, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. కివీస్ ఫాస్ట్ బౌలర్ కైల్ జేమీసన్ బౌలింగ్‌లో రోహిత్ వరుసగా విఫలమవుతున్న తీరుపై క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Published on: Nov 7, 2026, 17:28:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

న్యూజిలాండ్ పర్యటనలో భారత క్రికెట్ జట్టు విజయాల పరంపరను కొనసాగిస్తోంది. టీ20 సిరీస్ తరహాలోనే వన్డేల్లోనూ ఆధిపత్యం చెలాయిస్తూ ఐదు వన్డేల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను గెలుచుకుని 2-0 ఆధిక్యంలో నిలిచింది. శనివారం వెల్లింగ్టన్ వేదికగా వర్షం అడ్డంకిగా మారిన రెండో వన్డేలో డక్‌వర్త్ లూయిస్ (DLS) పద్ధతిలో 4 పరుగుల తేడాతో టీమిండియా ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. అయితే ఈ విజయాల వెనుక భారత జట్టు మేనేజ్‌మెంట్‌ను ఒక అంశం తీవ్రంగా కలవరపెడుతోంది. అదే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వరుస వైఫల్యాలు, అందునా కివీస్ పొడవైన పేసర్ కైల్ జేమీసన్ చేతిలోనే పదే పదే ఔట్ కావడం.

రోహిత్ శర్మకు కైల్ జేమీసన్ గండం: న్యూజిలాండ్‌లో భారత్‌కు కలవరం
రోహిత్ శర్మకు కైల్ జేమీసన్ గండం: న్యూజిలాండ్‌లో భారత్‌కు కలవరం

వెల్లింగ్టన్‌లో ఏమైంది?

స్వదేశంలో ఫ్లాట్ వికెట్లపై 101, 92 పరుగులతో వీరవిహారం చేసిన రోహిత్ శర్మ, న్యూజిలాండ్‌లోని కఠిన పరిస్థితుల్లో స్వింగ్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. హెన్రీ స్టేడియంలో 135 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన రోహిత్, కైల్ జేమీసన్ వేసిన తొలి ఓవర్లో తీవ్రంగా తడబడ్డాడు. జేమీసన్ వేసిన మొదటి 5 బంతుల్లో వేగం, స్వింగ్‌ను అంచనా వేయలేకపోయిన రోహిత్, ఆరో బంతికి ఫోర్ కొట్టి ఖాతా తెరిచాడు.

ఆ తర్వాత జేమీసన్ వేసిన ఓవర్లలో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాది జోరు పెంచేందుకు ప్రయత్నించాడు. కానీ జేమీసన్ వ్యూహాత్మకంగా వేసిన ఫుల్ లెంగ్త్ బంతిని రోహిత్ భారీ షాట్ ఆడబోగా, బంతి అవుట్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని స్లిప్‌లో ఉన్న హెన్రీ నికోల్స్ చేతిలో పడింది. దీంతో 27 బంతుల్లో 23 పరుగులు చేసిన రోహిత్ ఇన్నింగ్స్ ముగిసింది.

ఒకే తరహా వికెట్.. పునరావృతమవుతున్న తప్పులు

ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో జరిగిన మొదటి వన్డేలోనూ రోహిత్ సరిగ్గా ఇలాగే ఔటయ్యాడు. అప్పుడు కూడా జేమీసన్ ఆఫ్ స్టంప్ అవతలికి విసిరిన బంతిని రోహిత్ ముందుకు వచ్చి ఆడబోయి మిడ్ ఆఫ్ ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ సీమ్, స్వింగ్ అవుతున్న బంతులను అంచనా వేయడంలో రోహిత్ విఫలమయ్యాడు. బంతి కదలికలను సరిగ్గా గుర్తించకుండా క్రీజు వదిలి ముందుకు వచ్చి షాట్లకు ప్రయత్నించడమే అతని వికెట్ పతనానికి కారణమవుతోంది.

జేమీసన్ ఖాతాలో అరుదైన రికార్డు

గణాంకాలను పరిశీలిస్తే రోహిత్‌ను జేమీసన్ ఎంతగా ఇబ్బంది పెడుతున్నాడో అర్థమవుతుంది. వన్డేల్లో వీరిద్దరూ 7 ఇన్నింగ్స్‌లలో ఎదురెదురు పడగా, అందులో 4 సార్లు జేమీసనే రోహిత్‌ను పెవిలియన్‌కు పంపాడు. విశేషమేమిటంటే ఈ 4 వికెట్లు కూడా మ్యాచ్ తొలి 10 ఓవర్లలోనే పడటం గమనార్హం.

వన్డేల్లో మొదటి 10 ఓవర్లలో రోహిత్‌ను అత్యధిక సార్లు (చెరో 5 సార్లు) ఔట్ చేసిన బౌలర్లుగా కాగిసో రబాడా (దక్షిణాఫ్రికా), టిమ్ సౌథీ (న్యూజిలాండ్) నిలిచారు. జేమీసన్ ఇప్పుడు 4 వికెట్లతో వారి తర్వాతి స్థానంలో ఉన్నాడు. సిరీస్‌లో ఇంకా మూడు వన్డేలు మిగిలి ఉన్నందున, రోహిత్ తన లోపాలను సరిదిద్దుకోకపోతే జేమీసన్ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More