నైపుణ్యాధారిత స్వల్పకాలిక కోర్సులు అత్యవసరం: సద్గురు శ్రీ మధుసూదన్ సాయి
నైపుణ్యాధారిత స్వల్పకాలిక కోర్సులు ప్రస్తుత తక్షణ అవసరమని, త్వరలోనే తమ విద్యాసంస్థల్లో ఈ తరహా కోర్సులను రూపొందించనున్నామని 'వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్' వ్యవస్థాపకులు సద్గురు శ్రీ మధుసూదన్ సాయి అన్నారు.
హైదరాబాద్ నగరంలో శుక్రవారం (సెప్టెంబరు 25) జరిగిన 'కంపాషన్ ఇన్ యాక్షన్' కార్యక్రమంలో టాలీవుడ్ నిర్మాత, రామానాయుడు స్టూడియోస్ చైర్మన్, సురేశ్ ప్రొడక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ దగ్గుబాటి సురేశ్ బాబు అడిగిన ప్రశ్నలకు సద్గురు శ్రీ మధుసూదన్ సాయి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా విద్యా రంగంలో సంస్కరణల ఆవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు.

అమెరికా సహా అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో దీర్ఘకాలిక కోర్సుల పట్ల విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. భారతదేశంలో విద్యార్థులు కళాశాలల్లో నేర్చుకుంటున్న దానికి, పారిశ్రామిక అవసరాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని విద్యా రంగంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
విద్యాసంస్థలు ఎప్పటికీ వ్యాపార కేంద్రాలు కాకూడదు. చాలా పాఠశాలల్లో విలువల విద్య, నైతిక విద్య తరగతులే జరగడం లేదు. ఇలాంటి వాటిని 'టైమ్‌వేస్ట్'గా చాలా మంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. నేటి జెన్-జీ లేదా జెన్-ఆల్ఫా తరాలు ఈ విధంగా తయారు కావడానికి నైతిక విద్య లోపించడం కూడా ఒక కారణమని ఆయన స్పష్టం చేశారు.
జెన్-జీ పై ఉన్న అభ్యంతరాల గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. "ఈ తరం వారు మనకంటే వేగంగా నేర్చుకుంటారు, చాలా చురుకుగా ఉంటారు. పెద్దలు ఈ విషయాన్ని అంగీకరించాలి. అదేవిధంగా జెన్-జీ తరం యువత కూడా నిదానంగా జీవించడాన్ని అలవాటు చేసుకోవాలి" అని సద్గురు సూచించారు.
ముద్దేనహళ్లిలోని మధుసూదన్ సాయి వైద్య విజ్ఞాన, పరిశోధనా సంస్థలో పలు వైద్య పరిశోధనలు జరుగుతున్నాయి. వెల్‌నెస్-లాంజివిటీ విషయంలో నాలుగు విధానాల సమన్వయంతో కూడిన చికిత్సా పద్ధతిని రూపొందించాం, దానికి పేటెంట్ పొందేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రెసిషన్ మెడిసిన్, టార్గెటెడ్ మెడిసిన్, జీనోమిక్స్ తదితర అంశాలపై కూడా విస్తృతంగా కృషి చేస్తున్నామని ఆయన వివరించారు.
సిద్దిపేటలోని కొండపాకలో ఉన్న శ్రీ సత్యసాయి ప్రశాంతి నికేతనం క్యాంపస్‌లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని భావన తన జీవిత అనుభవాన్ని పంచుకున్నారు. "మద్యానికి బానిసైన మా నాన్న, ఒకసారి నేను చనిపోయానని భావించి నా బట్టలనే అమ్మేశారు. నేను 8వ తరగతి పూర్తి చేసే వరకు ఎన్నో కష్టాలు పడ్డాను. ఇప్పుడు సద్గురు శ్రీ మధుసూదన్ సాయి గారు నాకు అండగా గట్టిగా నిలబడ్డారు. నా కలలకు రెక్కలు తొడిగారు" అని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.
లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ ఆపరేషన్స్ విభాగం అధిపతి రాజేష్ కె.ఎస్. ప్రస్తావన చేస్తూ.. కార్పొరేట్ కంపెనీల అధిపతులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి అక్కడి వాస్తవ సమస్యలను గమనించి పరిష్కారాలను రూపొందించాలని సూచించారు. సత్యసాయి సంజీవని ఆసుపత్రుల సమూహానికి చెందిన ట్రస్ట్ ఆఫీసర్ సౌమ్య ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌కు చెందిన కాన్సల్ జనరల్ లోరా విలియమ్స్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సత్యసాయి గ్రామానికి 50 ఏళ్లు: ముద్దేనహళ్లిలో మానవతా మహాయజ్ఞం
చిక్కబళ్లాపూర్ జిల్లా ముద్దేనహళ్లిలోని 'సత్యసాయి గ్రామం' ఐదు దశాబ్దాల సార్థక ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. శ్రీ మడియాల నారాయణ భట్ సంకల్పంతో ప్రారంభమై, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా దైవిక ఆశీస్సులతో రూపుదిద్దుకున్న ఈ పుణ్యభూమి నేడు ఉచిత విద్య, వైద్యం, పోషకాహార సేవల ద్వారా ప్రపంచవ్యాప్త మానవతా కేంద్రంగా వెలుగుతోంది.
ముద్దేనహళ్లిలో వెలిసిన ఆధ్యాత్మిక, సేవా నికేతనం
కర్ణాటకలోని ముద్దేనహళ్లి పేరు వినగానే ఇద్దరు మహనీయులు గుర్తుకొస్తారు. ఒకరు భారతరత్న సర్ ఎం. విశ్వేశ్వరయ్య అయితే, మరొకరు పరమాత్ముని ప్రేమావతారంగా పూజలందుకునే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. విశ్వేశ్వరయ్య జన్మస్థలమైన ఈ పవిత్ర భూమిని భగవాన్ సత్యసాయి బాబా తన ప్రేమకు పాత్రమైన క్షేత్రంగా మార్చారు. అందుకే ముద్దేనహళ్లిలోని విద్యాసంస్థల ప్రాంగణానికి స్వయంగా బాబానే ‘సత్యసాయి గ్రామం’ అని నామకరణం చేశారు.
ఈ సుందరమైన ప్రాంగణాన్ని కేంద్రంగా చేసుకుని సద్గురు శ్రీ మధుసూదన సాయి ‘మానవ సేవే మాధవ సేవ’ అనే సూక్తిని నిత్యకృత్యంగా మార్చారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, పౌష్టికాహారం వంటి రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో సాగుతున్న సేవా కార్యక్రమాలకు సత్యసాయి గ్రామం ప్రధాన కేంద్రస్థానంగా నిలిచింది.
ఐదు దశాబ్దాల పవిత్ర ప్రస్థానం
నందిగిరి పర్వతాల పాదప్రాంతంలో ఉన్న ముద్దేనహళ్లిని ‘సిద్ధసంకల్ప క్షేత్రం’గా పిలుస్తారు. శ్రీ మడియాల నారాయణ భట్ కన్న సుందర స్వప్నం నేడు సత్యసాయి గ్రామంగా ఐదు దశాబ్దాల సేవా ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. సత్యసాయి గ్రామానికి శ్రీకారం చుట్టిన శ్రీ మడియాల నారాయణ భట్ 100వ జయంతి ఉత్సవాల సందర్భంలోనే ఈ 50 ఏళ్ల స్వర్ణోత్సవ మైలురాయి రావడం విశేషం.
నారాయణ భట్ 'త్యాగజీవుల' సంకల్పం
కర్ణాటక వ్యాప్తంగా ‘అన్ననవరు’గా గౌరవించబడే శ్రీ మడియాల నారాయణ భట్ 1927లో దక్షిణ కన్నడ జిల్లాలోని అలికె గ్రామంలో జన్మించారు. దేశభక్తి స్ఫూర్తితో భారత పునరుజ్జీవనానికి 10 లక్షల మంది త్యాగధనులు అవసరమని భావించిన ఆయన, వందలాది మంది యువకులను సేవామార్గంలో నడిపించారు. ఈ బృందమే ‘త్యాగజీవులు’గా ప్రసిద్ధి చెందింది.
"విద్య ద్వారానే సమాజ సంస్కరణ సాధ్యం" అని నమ్మిన నారాయణ భట్ 1960లో అలికెలో ‘లోకసేవా వృంద’ అనే సంస్థను, 1961లో ‘శ్రీ సత్యసాయి లోకసేవా ప్రౌఢశాల’ను స్థాపించారు. ఈ పాఠశాలకు విశేష ఆదరణ లభించడంతో, తన దైవమైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబాకు అత్యంత ప్రియమైన ముద్దేనహళ్లిని తన తదుపరి సేవా క్షేత్రంగా ఎంచుకున్నారు.
బాబా స్వయంగా నామకరణం చేసిన వేళ
ముద్దేనహళ్లిలో విద్యాసంస్థను ప్రారంభించాలనే సంకల్పం 1971లో రూపుదిద్దుకుంది. 1973లో బాబా మణిపాల్‌కు వచ్చిన సమయంలో ముద్దేనహళ్లి ప్రాంగణానికి స్వయంగా 'సత్యసాయి గ్రామం' అని నామకరణం చేశారు. నారాయణ భట్ ఆదేశాల మేరకు బి.ఎన్. నరసింహమూర్తి ముద్దేనహళ్లికి వచ్చి విద్యాసంస్థల నిర్వహణ బాధ్యతలను స్వీకరించారు.
తమ ఆధ్వర్యంలోని ‘లోకసేవా వృంద’ సంస్థను, విద్యాసంస్థలను 1976 జనవరి 6న నారాయణ భట్ భగవాన్ బాబాకు సమర్పించారు. 1977లో నారాయణ భట్ ప్రమాదవశాత్తూ పరమపదించిన తర్వాత, బాబా ఈ సంస్థల పూర్తి బాధ్యతలను స్వీకరించి ‘శ్రీ సత్యసాయి లోకసేవా ట్రస్ట్’గా పునర్నామకరణం చేశారు. బాబా మార్గదర్శకత్వంలో త్యాగజీవులు సేవా యజ్ఞాన్ని మరింత ఉధృతం చేశారు.
రికార్డు సృష్టించిన తొలి బ్యాచ్ ఫలితాలు
ముద్దేనహళ్లిలో 1973 జూన్ 11న తొలి వసతి పాఠశాల ప్రారంభమైంది. 1976లో వెలువడిన ఎస్ఎస్ఎల్‌సీ ఫలితాల్లో అప్పటి అవిభాజ్య కోలార్ జిల్లా చరిత్రలోనే తొలిసారిగా 100 శాతం ఉత్తీర్ణత సాధించి 'లోకసేవా వృంద గురుకుల పాఠశాల' రికార్డు సృష్టించింది. ఉచిత విద్యతో పాటు క్రమశిక్షణ, సంస్కారాలను నేర్పించే పాఠశాలగా ప్రజాదరణ పొందింది.
1982 నాటికి విద్యార్థుల సంఖ్య 400కు చేరింది. ఏ విద్యార్థి నుంచీ ట్యూషన్ ఫీజు వసూలు చేయకపోవడం విశేషం. కేవలం హాస్టల్ వసతి ఖర్చులను మాత్రమే విద్యార్థులకు విభజించి ఇచ్చేవారు. కన్నడ మాధ్యమంతో ప్రారంభమైన ఈ విద్యాసంస్థల్లో ఆ తర్వాత ఆంగ్ల మాధ్యమాన్ని కూడా ప్రవేశపెట్టారు.
బాబా అనుగ్రహం.. కొత్త నాయకత్వం
సత్యసాయి గ్రామాన్ని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మొత్తం 30 సార్లు సందర్శించారు. 2009 ఫిబ్రవరి 14న ఆయన చివరిసారిగా ఇక్కడకు విచ్చేశారు. బాబా దేహ వియోగానంతరం, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను సద్గురు శ్రీ మధుసూదన సాయి స్వీకరించారు. బాబా నేర్పిన సేవారంగ విస్తరణను ముద్దేనహళ్లి కేంద్రంగా విశ్వవ్యాప్తం చేశారు.
అంతర్జాతీయ సేవా కేంద్రంగా సత్యసాయి గ్రామం
సద్గురు శ్రీ మధుసూదన సాయి నాయకత్వంలో సత్యసాయి గ్రామం ప్రపంచస్థాయి మానవతా కేంద్రంగా మారింది. 'వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్' పేరుతో 100కు పైగా దేశాల్లో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఈ పవిత్ర ప్రాంగణంలో నేడు క్రింది ముఖ్య సేవా వ్యవస్థలు కొలువుదీరాయి:
సాయి ష్యూర్ కర్మాగారం: దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా పాఠశాల పిల్లలకు ఉచిత పౌష్టికాహార అల్పాహారాన్ని అందించే బృహత్ కార్యక్రమానికి ఇది కేంద్రం.
శ్రీ మధుసూదన సాయి ఆసుపత్రి: ప్రతిరోజూ వేలాది మంది పేద రోగులకు రూపాయి ఖర్చు లేకుండా అత్యుత్తమ వైద్యాన్ని అందిస్తున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి.
శ్రీ సత్యసాయి మానవ అభ్యుదయ విశ్వవిద్యాలయం: విలువల కూడిన ఉచిత ఉన్నత విద్యను అందించే విద్యా సంస్థ.
గోశాల & ప్రేమామృతం: నాటు ఆవుల సంరక్షణకు ప్రత్యేక గోశాల, వేలాది మంది సాధకులు సమావేశమయ్యే 'ప్రేమామృతం' సభాభవనం.
గత ఏడాది సత్యసాయి బాబా 100వ జయంతి వేడుకల్లో భాగంగా నిర్వహించిన విశ్వ సాంస్కృతిక మహోత్సవం, 65 దేశాల కళాకారులతో నిర్వహించిన సాయి సింఫనీ ఆర్కెస్ట్రా రెండు గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకున్నాయి. 27 మంది విద్యార్థులతో చిన్న పాఠశాలగా ప్రారంభమైన సత్యసాయి గ్రామం, 50 ఏళ్ల నిరంతర ప్రయాణంలో లక్షలాది మందికి విద్య, వైద్యం, కూడు అందిస్తున్న విశ్వసౌధంగా నిలిచింది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


