Skoda Peaq : 640 కి.మీ రేంజ్ స్కోడా పీక్‌పై బిగ్ అప్డేట్- క్రేజ్ మామూలుగా లేదుగా!
Skoda Peaq range : చెక్ ఆటోమేకర్ స్కోడా తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'పీక్' ఉత్పత్తిని ప్రారంభించింది. ఇప్పటికే 8,500లకు పైగా బుకింగ్‌లు పొందిన ఈ ఈవీ ప్రత్యేకతలు ఆటోమొబైల్ రంగంలో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఈ స్కోడా పీక్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
చెక్ రిపబ్లిక్‌లోని మ్లాడా బోలేస్లావ్ ప్లాంటులో ఆటోమొబైల్ రంగంలో సరికొత్త శకానికి నాంది పడింది! ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా తన ప్రతిష్టాత్మక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘పీక్’ ఇక్కడ ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించింది. కంపెనీ ప్రధాన తయారీ కేంద్రంలో అసెంబ్లీ లైన్లు జోరుగా పనిచేస్తున్నాయి. పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ మోడళ్లు అయిన ఎన్యాక్, ఎల్‌రాక్‌లతో పాటు ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కూడా తయారు చేస్తున్నారు. కేవలం కార్లే కాకుండా, పీక్ కోసం అత్యుత్తమ బ్యాటరీ సిస్టమ్‌లను కూడా సంస్థ అక్కడే తయారు చేస్తుండటం విశేషం.

ఈ నేపథ్యంలో ఈ స్కోడా పీక్ ఈవీకి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
స్కోడా పీక్ ఈవీ- ఉత్పత్తిలో సరికొత్త ప్రయోగాలు..
మ్లాడా బోలేస్లావ్ ప్లాంటులో తయారవుతున్న నాల్గోవ మోడల్ 'పీక్' కావడం గమనార్హం. ఒకప్పుడు పెట్రోల్, డీజిల్ కార్ల తయారీ కోసం మాత్రమే రూపొందించిన ఈ ప్లాంటును, ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అనుగుణంగా ఎంతో ఆధునీకరించారు.
2020లో తొలిసారిగా ఎన్యాక్ ఎలక్ట్రిక్ కారు ఉత్పత్తి ఇక్కడే ప్రారంభమైంది. ఆ తర్వాత 2025 జనవరిలో ఎల్‌రాక్, ఇప్పుడు తాజాగా పీక్ ఈ జాబితాలో చేరాయి. ఈ మూడు ఈవీలతో పాటు ఆక్టేవియా కాంబి కార్లను కూడా ఇక్కడే అసెంబ్లీ చేస్తున్నారు. ఇప్పుడు చెక్ ప్లాంట్లలో తయారవుతున్న మొత్తం స్కోడా వాహనాల్లో ఈవీల వాటా ఏకంగా 23 శాతానికి చేరుకోవడం విశేషం.
ఇక మార్కెట్లో ఈ కారుకు ఉన్న క్రేజ్ గురించి చెప్పాలి. జులై చివరి నాటికి ఈ ఎస్‌యూవీ కోసం కస్టమర్ల నుంచి దాదాపు 8,500 ఆర్డర్లు వచ్చాయి!
స్కోడా పీక్ ఈవీ- శక్తివంతమైన బ్యాటరీ, రేంజ్!
స్కోడా పీక్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో అత్యుత్తమ ఫీచర్లు ఉన్నాయి. టాప్-ఎండ్ వేరియంట్‌లో 91 కిలోవాట్ అవర్ గ్రాస్ బ్యాటరీని అమర్చారు. ఇందులో 86 కిలోవాట్ అవర్ వాడకానికి అనుకూలంగా ఉంటుంది. ఈ స్కోడా పీక్ ఈవీ సింగిల్ చార్జ్‌తో ఏకంగా 640 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. అలాగే తక్కువ బడ్జెట్ కోరుకునే వారి కోసం 63 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
కస్టమర్ల అవసరాలకు తగినట్లుగా 201.1 బీహెచ్‌పీ నుంచి 295 బీహెచ్‌పీ వరకు మూడు పవర్ అవుట్‌పుట్ ఆప్షన్లలో ఈ కారు వస్తోంది. రియర్-వీల్ డ్రైవ్ లేదా ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను ఎంచుకునే వెసులుబాటును కల్పించారు. దాదాపు 4.87 మీటర్ల పొడవు, 3 మీటర్ల వీల్‌బేస్‌తో వస్తున్న పీక్.. ఇప్పటివరకు స్కోడా నుంచి వచ్చిన అత్యంత పెద్ద ఎస్‌యూవీ ఇదే కావడం విశేషం. ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, డైనమిక్ షేడ్ కంట్రోల్‌తో కూడిన పనోరమిక్ రూఫ్, బై-డైరెక్షనల్ ఛార్జింగ్ టెక్నాలజీ వంటి అధునాతన హంగులను ఇందులో పొందుపరిచారు.
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో స్కోడా దూకుడు..
మార్కెట్లో తన పట్టును మరింత పెంచుకోవాలనే వ్యూహంలో భాగంగా స్కోడా ఈ ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణను చేపట్టింది. పీక్‌తో పాటు స్పెయిన్‌లోని పాంప్లోనాలో ఎపిక్ అనే ఎంట్రీ-లెవల్ అర్బన్ క్రాస్‌ఓవర్‌ను కూడా కంపెనీ పరిచయం చేసింది. ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్‌నకు చెందిన అర్బన్ కార్ ఫ్యామిలీ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇది రూపుదిద్దుకుంటోంది. ఈ సరికొత్త ఈవీల లాంచ్‌తో యూరోపియన్ ఆటోమొబైల్ మార్కెట్లో స్కోడా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


