స్నాప్‌చాట్‌లో మరిన్ని 'సేఫ్టీ' ఫీచర్లు.. పిల్లల ఆన్‌లైన్ యాక్టివిటీలపై తల్లిదండ్రుల నిఘా!

టీనేజర్ల భద్రత కోసం స్నాప్‌చాట్ తన 'ఫ్యామిలీ సెంటర్' ఫీచర్​లో కీలక మార్పులు చేసింది. పిల్లల ప్రైవసీకి భంగం కలగకుండానే, వారు ఎవరితో ఎక్కువగా మాట్లాడుతున్నారు, లొకేషన్ ఎవరికి షేర్ చేస్తున్నారు వంటి వివరాలను తల్లిదండ్రులు తెలుసుకునేలా ఈ కొత్త టూల్స్‌ను ప్రవేశపెట్టింది.

Published on: Jan 23, 2026 3:10 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సోషల్ మీడియాలో వేగంగా మారుతున్న ట్రెండ్స్, పెరుగుతున్న సైబర్ ముప్పుల నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘స్నాప్‌చాట్’ కీలక నిర్ణయం తీసుకుంది. టీనేజర్ల ఆన్‌లైన్ భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో తన 'ఫ్యామిలీ సెంటర్' ఫీచర్‌ను మరింత అప్‌డేట్ చేసింది. భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా ఈ కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.

స్నాప్‌చాట్‌లో మరిన్ని 'సేఫ్టీ' ఫీచర్లు.. (Snapchat )
స్నాప్‌చాట్‌లో మరిన్ని 'సేఫ్టీ' ఫీచర్లు.. (Snapchat )

కేవలం నిఘా పెట్టడమే కాకుండా, ఆన్‌లైన్ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లపై పిల్లలు, తల్లిదండ్రుల మధ్య ఆరోగ్యకరమైన చర్చలు జరగాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేశామని కంపెనీ పేర్కొంది.

పిల్లలు ఎవరితో ఎక్కువగా మాట్లాడుతున్నారు?

స్నాప్​చాట్​ కొత్త అప్‌డేట్ ప్రకారం.. గడిచిన వారం రోజుల్లో తమ పిల్లలు ఎవరితో ఎక్కువగా చాట్ చేశారు, ఎవరితో టచ్‌లో ఉన్నారనే వివరాలను తల్లిదండ్రులు చూడవచ్చు. అయితే, ఇక్కడే ఒక విషయాన్ని గమనించాలి. పిల్లల వ్యక్తిగత సంభాషణలు (చాట్స్) లేదా వారు పంపుకున్న మెసేజ్‌లను తల్లిదండ్రులు చూడలేరు. కేవలం వారు ఎవరితో ఎక్కువగా సంభాషిస్తున్నారనే 'కమ్యూనికేషన్ పాటర్న్స్' మాత్రమే కనిపిస్తాయి.

దీనివల్ల పిల్లాడి ప్రైవసీని గౌరవిస్తూనే, ఒకవేళ అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా పరిచయమైతే ముందుగానే గుర్తించే అవకాశం తల్లిదండ్రులకు లభిస్తుంది.

లొకేషన్ షేరింగ్, అలర్ట్స్..

స్నాప్‌చాట్‌లోని ‘స్నాప్ మ్యాప్’ ఫీచర్‌లోనూ పారదర్శకతను పెంచారు. మీ పిల్లలు తమ లైవ్ లొకేషన్‌ను ఏయే స్నేహితులతో షేర్ చేసుకుంటున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు ఇప్పుడు చెక్ చేయవచ్చు. ఇది రియల్ టైమ్ మూవ్‌మెంట్‌ను ట్రాక్ చేయకపోయినా, లొకేషన్ షేరింగ్ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. తద్వారా ఆన్‌లైన్‌లో ప్రైవసీ సెట్టింగ్స్ ఎలా ఉండాలి అనే దానిపై పిల్లలకు తగిన సూచనలు చేయవచ్చు.

అంతేకాకుండా, ఏదైనా అసాధారణమైన యాక్టివిటీ జరిగినప్పుడు తల్లిదండ్రులకు ‘సేఫ్టీ అలర్ట్స్’ కూడా వస్తాయి. ఇది పూర్తిగా ఆటోమేటెడ్ ప్రక్రియ కాకుండా, తల్లిదండ్రులను అప్రమత్తం చేసి పిల్లలతో మాట్లాడేలా ప్రోత్సహిస్తుంది.

ఎలా ఉపయోగించాలి?

స్నాప్‌చాట్ అందిస్తున్న ఈ ఫ్యామిలీ సెంటర్ సదుపాయాన్ని పొందాలంటే తల్లిదండ్రులు, పిల్లలు ఇద్దరూ యాప్‌లో తమ అకౌంట్లను లింక్ చేసుకోవాలి.

ప్రస్తుతం ఈ ఫీచర్లు దశలవారీగా యూజర్లు అందరికి అందుబాటులోకి వస్తున్నాయి.

టీనేజర్లపై హానికరమైన కంటెంట్ ప్రభావం పడకుండా, అపరిచితులతో ఇంటరాక్షన్లు తగ్గించేలా స్నాప్‌చాట్ తీసుకున్న ఈ చర్యలపై టెక్ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆన్‌లైన్ భద్రత అనేది కేవలం టెక్నాలజీతోనే సాధ్యం కాదని, తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా తోడవ్వాలని స్నాప్‌చాట్ ప్రతినిధులు వివరించారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More