దక్షిణ రైల్వేలో 4,308 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు చేసుకోండిలా
దక్షిణ రైల్వే 4,308 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు సెప్టెంబర్ 27, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం, వయోపరిమితి, స్టైపెండ్ పూర్తి వివరాలు ఇవే.
రైల్వేలో చేరాలనుకునే యువతకు దక్షిణ రైల్వే (Southern Railway) గొప్ప అవకాశం అందుబాటులోకి తెచ్చింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 4,308 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దక్షిణ రైల్వే అధికారిక వెబ్‌సైట్ sr.indianrailways.gov.in ద్వారా సెప్టెంబర్ 27, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు.

వయోపరిమితి నిబంధనలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు కనీసం 15 సంవత్సరాలు నిండి ఉండాలి. విభాగాల వారీగా గరిష్ట వయోపరిమితి ఇలా ఉంది.
- ఫ్రెషర్స్: గరిష్టంగా 22 సంవత్సరాలు
- ఎక్స్-ఐటీఐ / ఎమ్‌ఎల్‌టీ (MLT): గరిష్టంగా 24 సంవత్సరాలు
నెలకు లభించే స్టైపెండ్ వివరాలు
- అప్రెంటిస్‌షిప్ శిక్షణ సమయంలో అభ్యర్థులకు ప్రతి నెలా స్టైపెండ్ అందిస్తారు.
- ఫ్రెషర్స్ (10వ తరగతి ఉత్తీర్ణత): నెలకు రూ. 8,200
- ఫ్రెషర్స్ (12వ తరగతి ఉత్తీర్ణత): నెలకు రూ. 9,600
- ఎక్స్-ఐటీఐ అభ్యర్థులు: నెలకు రూ. 9,600
- ఎక్స్-ఐటీఐ అభ్యర్థులకు రెండో ఏడాది శిక్షణలో కనీస స్టైపెండ్‌పై 10 శాతం, మూడో ఏడాది శిక్షణలో అదనంగా 15 శాతం వరకు స్టైపెండ్ పెరుగుతుంది.
ఎంపిక విధానం ఇలా ఉంటుంది
ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం అర్హత పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఫ్రెషర్స్ విభాగం: పదో తరగతిలో సాధించిన మార్కులను (కనీసం 50% అగ్రిగేట్ ఉండాలి) 200 మార్కులకు గుణించి మెరిట్ జాబితా తయారు చేస్తారు.
ఎక్స్-ఐటీఐ విభాగం: పదో తరగతి మార్కులను 100 మార్కులకు (కనీసం 50% అగ్రిగేట్), ఐటీఐ మార్కులను 100 మార్కులకు కుదించి, మొత్తం 200 మార్కులకు సమాన ప్రాధాన్యం ఇస్తూ మెరిట్ ఖరారు చేస్తారు.
ఎమ్‌ఎల్‌టీ (MLT) విభాగం: ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ) మార్కులను 200 మార్కులకు గుణించి మెరిట్ రూపొందిస్తారు.
దరఖాస్తు రుసుము
ఈ పోస్టులకు దరఖాస్తు రుసుము రూ. 100గా నిర్ణయించారు. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ (UPI) ద్వారా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు (PwBD), మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


