పతనంలోనూ లాభాల పంచ్: నేడు కొనుగోలు చేయాల్సిన 7 స్టాక్స్ ఇవే

గ్లోబల్ మార్కెట్ల తీవ్ర ప్రతికూల సంకేతాలు, ముడిచమురు మంటలతో భారత స్టాక్ మార్కెట్ నేడు ఫ్లాట్‌గా లేదా నష్టాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ఒడుదొడుకుల వేళ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం నిపుణులు సూచిస్తున్న 7 కీలక షేర్ల జాబితా ఇక్కడ చూడండి.

Published on: Sep 16, 2026, 07:56:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అంతర్జాతీయ మార్కెట్లలో వ్యక్తమవుతున్న తీవ్ర ప్రతికూల సంకేతాలు, మిడిల్ ఈస్ట్‌లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. బుధవారం నాటి ట్రేడింగ్‌లో దేశీయ సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మంగళవారం నాటి సెషన్‌లో రికార్డు స్థాయి నష్టాలను చవిచూసిన దలాల్ స్ట్రీట్, నేడు కూడా తీవ్ర ఒడుదొడుకుల మధ్యే సాగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

నిన్నటి సెన్సెక్స్ టాప్ లూజర్స్ ఛార్ట్ (PTI)
నిన్నటి సెన్సెక్స్ టాప్ లూజర్స్ ఛార్ట్ (PTI)

గత సెషన్‌లో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 50 కీలకమైన 23,200 స్థాయి కంటే దిగువకు చేరింది. సెన్సెక్స్ 777.94 పాయింట్లు (1.04%) క్షీణించి 74,003.82 వద్ద ముగియగా, నిఫ్టీ 50 ఏకంగా 279.50 పాయింట్లు (1.19%) నష్టపోయి 23,118.60 వద్ద స్థిరపడింది.

గిఫ్ట్ నిఫ్టీ సంకేతాలు

నేటి ఉదయం గిఫ్ట్ నిఫ్టీ లెవెల్స్ మార్కెట్ ఫ్లాట్ ఆరంభాన్ని సూచిస్తున్నాయి. ఉదయం 7:19 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ 23,212 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది నిఫ్టీ ప్యూచర్స్ క్రితం ముగింపు కంటే కేవలం 10 పాయింట్ల డిస్కౌంట్‌లో ఉండి, ఇన్వెస్టర్ల ముందస్తు జాగ్రత్తల ధోరణిని ప్రతిబింబిస్తోంది.

ముడిచమురు మంటలు.. యూఎస్ బాండ్ ఈల్డ్స్ సెగ

వాల్ స్ట్రీట్‌లో వరుసగా రెండో రోజు నష్టాలు రావడం, బాండ్ ఈల్డ్స్ రికార్డు స్థాయికి చేరడంపై ఎన్‌రిచ్ మనీ సీఈఓ పొన్‌ముడి ఆర్ స్పందించారు. "అమెరికా మార్కెట్లలో ఏఐ ఆధారిత స్టాక్స్ మాత్రమే నిలదొక్కుకున్నాయి. ముడిచమురు ధరల పెరుగుదల, గత రెండు దశాబ్దాలలో అత్యంత గరిష్ఠ స్థాయికి చేరిన యూఎస్ 10 సంవత్సరాల ట్రెజరీ ఈల్డ్స్ ద్రవ్యోల్బణ భయాలను పెంచాయి" అని ఆయన వివరించారు.

సౌదీ అరేబియా ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌పై దాడులు, స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ వద్ద అంతరాయాల కారణంగా డబ్ల్యూటీఐ చమురు ధర బ్యారెల్‌కు 104-105 డాలర్ల శ్రేణిలో ట్రేడవుతోంది. చమురును భారీగా దిగుమతి చేసుకునే భారత్‌కు ఇది ప్రతికూల పరిణామం. ఇది రూపాయి మారకపు విలువపై ఒత్తిడి పెంచడమే కాకుండా, కరెంట్ అకౌంట్ లోటు, ద్రవ్యోల్బణ అంచనాలను దెబ్బతీస్తోంది.

సూచీల కీలక స్థాయిలు ఇవే

సెన్సెక్స్ (Sensex): ఛాయిస్ ఈక్విటీ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ సచిన్ గుప్తా ప్రకారం, సెన్సెక్స్ డైలీ చార్ట్‌లో 'బేరిష్ ఎంగల్ఫింగ్' క్యాండిల్‌ను ఏర్పరిచింది. ఇది స్వల్పకాలిక, మధ్యకాలిక ట్రెండ్ బలహీనంగా ఉందనడానికి సంకేతం. ఆర్‌ఎస్‌ఐ (RSI) 25.06 వద్ద అతిగా అమ్ముడుపోయిన (oversold) జోన్‌లో ఉంది. ప్రస్తుతం సెన్సెక్స్‌కు 73,500–74,000 మద్దతు స్థాయి కాగా, కోలుకోవడానికి 74,800–75,000 మార్కును దాటాల్సి ఉంటుంది.

నిఫ్టీ 50 (Nifty 50): హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి మాట్లాడుతూ, నిఫ్టీ ట్రెండ్ బలహీనంగా ఉందన్నారు. నిఫ్టీ 23,000 స్థాయి కంటే దిగువకు పడిపోతే, రాబోయే రోజుల్లో 22,600–22,500 శ్రేణికి చేరుకునే ప్రమాదం ఉంది. పైకి కోలుకుంటే 23,300 వద్ద తీవ్ర నిరోధం ఎదురవుతుంది.

బ్యాంక్ నిఫ్టీ (Bank Nifty): ఎల్‌కేపీ సెక్యూరిటీస్ విశ్లేషకుడు వత్సల్ భువా అభిప్రాయం ప్రకారం, బ్యాంక్ నిఫ్టీ 100-డే మూవింగ్ యావరేజ్ (100-DMA) కంటే దిగువన ట్రేడవుతోంది. ప్రతీ ర్యాలీలోనూ అమ్మకాలు జరిపే 'సెల్-ఆన్-రైజ్' వ్యూహం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. బ్యాంక్ నిఫ్టీకి 55,500 వద్ద తక్షణ మద్దతు, 55,000–55,100 వద్ద పొజిషనల్ సపోర్ట్ ఉన్నాయి. నిరోధక స్థాయి 56,500 వద్ద ఉంది.

కమోడిటీ మార్కెట్: చమురు, పసిడి ధరల ట్రెండ్

బుధవారం బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.86% తగ్గి బ్యారెల్‌కు 107.82 డాలర్ల వద్ద, యూఎస్ డబ్ల్యూటీఐ ఫ్యూచర్స్ 0.92% తగ్గి 104.86 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. అమెరికాలో అంచనాలకు భిన్నంగా చమురు నిల్వలు పెరిగినట్లు డేటా రావడంతో ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే, సౌదీ యాన్బు నౌకాశ్రయం నుంచి రవాణా నిలిపివేత, ఐరోపాకు సరఫరాల కోత ఆందోళన కలిగిస్తున్నాయి.

మరోవైపు పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4,290 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. చమురు సెగ వల్ల అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం 92% ఉందనే అంచనాలు పుత్తడిపై ఒత్తిడి పెంచుతున్నాయి.

ఇంట్రాడేలో మెరిసే 7 షేర్లు ఇవే!

ఒడుదొడుకుల మార్కెట్‌లోనూ లాభాలు అందించగల 7 స్టాక్స్‌ను మార్కెట్ నిపుణులు సుమీత్ బగాడియా, గణేష్ డోంగ్రే, షిజు కూతుపలక్కల్ సిఫార్సు చేస్తున్నారు.

  1. ప్రైమ్ ఫోకస్ (Prime Focus): కొనుగోలు ధర: రూ. 319 | టార్గెట్: రూ. 345 | స్టాప్‌లాస్: రూ. 305
  2. ఏసీఎంఈ సోలార్ హోల్డింగ్స్ (ACME Solar Holdings): కొనుగోలు ధర: రూ. 420 | టార్గెట్: రూ. 460 | స్టాప్‌లాస్: రూ. 400
  3. పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ (P N Gadgil Jewellers): కొనుగోలు ధర: రూ. 61 | టార్గెట్: రూ. 650 | స్టాప్‌లాస్: రూ. 580
  4. మ్యాన్‌కైండ్ ఫార్మా (Mankind Pharma): కొనుగోలు ధర: రూ. 2,280 | టార్గెట్: రూ. 3,380 | స్టాప్‌లాస్: రూ. 2,200
  5. బీఈఎమ్‌ఎల్ (BEML Ltd): కొనుగోలు ధర: రూ. 2,080 | టార్గెట్: రూ. 2,280 | స్టాప్‌లాస్: రూ. 2,020
  6. ఎఫ్‌డీసీ లిమిటెడ్ (FDC Ltd): కొనుగోలు ధర: రూ. 349.70 | టార్గెట్: రూ. 370 | స్టాప్‌లాస్: రూ. 342
  7. హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్ (Hatsun Agro Products): కొనుగోలు ధర: రూ. 1,275 | టార్గెట్: రూ. 1,350 | స్టాప్‌లాస్: రూ. 1,250

(గమనిక: ఈ విశ్లేషణలు మార్కెట్ నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. పెట్టుబడులు పెట్టే ముందు ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించడం శ్రేయస్కరం.)

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More