విదేశాల్లో MBBS: NEET లేకపోతే అడ్మిషన్ రాదా? అసలు నిజాలేంటి?

విదేశాల్లో వైద్య విద్య అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు నీట్ (NEET) అర్హతపై ఉన్న అనేక సందేహాలకు ప్రముఖ అంతర్జాతీయ రుణ సంస్థ ప్రొడిజీ ఫైనాన్స్ స్పష్టతనిచ్చింది. విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశాలకు, డిగ్రీ పూర్తి చేశాక భారతదేశంలో ప్రాక్టీస్ చేయడానికి నిబంధనలు తెలుసుకోండి.

Published on: Aug 11, 2026, 14:51:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశంలో వైద్య విద్య (MBBS) చదవాలనుకునే విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. అయితే, ఇక్కడ సీటు దక్కని పక్షంలో వేలాది మంది విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయాల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో అడ్మిషన్ల ప్రక్రియ, నీట్ (NEET) నిబంధనలు, వీసా అవసరాలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఉన్నత చదువుల కోసం వెళ్లే వారికి ప్రక్రియ సులువుగానే ఉన్నప్పటికీ, ఇంటర్ తర్వాత నేరుగా మెడిసిన్‌లో చేరే విద్యార్థులే అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు.

విదేశాల్లో MBBS: NEET లేకపోతే అడ్మిషన్ రాదా? అసలు నిజాలేంటి?
విదేశాల్లో MBBS: NEET లేకపోతే అడ్మిషన్ రాదా? అసలు నిజాలేంటి?

అడ్మిషన్లకు నీట్ స్కోరుతో పనిలేదా?

అంతర్జాతీయ విద్యార్థులకు విద్యా రుణాలు అందించే 'ప్రొడిజీ ఫైనాన్స్' (Prodigy Finance) సంస్థ గ్లోబల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సోనాల్ కపూర్ ఈ అంశంపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. విదేశాల్లో హెల్త్‌కేర్ కోర్సులు చేయాలనుకునే వారి నుంచి ప్రతిరోజూ వందలాది ఎంక్వైరీలు వస్తున్నట్లు ఆమె తెలిపారు.

"డాక్టర్ కావడం అనే ఒక గొప్ప లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి దగ్గరి దారులు ఉండవు. విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడాల్సిందే. అయితే, విదేశాల్లో చదవడానికి నీట్ తప్పనిసరా అనే ప్రశ్నే అత్యధికుల నుంచి వస్తోంది" అని సోనాల్ కపూర్ పేర్కొన్నారు.

సాధారణంగా విదేశీ విశ్వవిద్యాలయాలు తమ అడ్మిషన్ల ప్రక్రియలో నీట్ స్కోర్‌ను అసలు ప్రామాణికంగా తీసుకోవు. నీట్ పరీక్ష రాయకపోయినా లేదా అందులో అత్యంత తక్కువ మార్కులు వచ్చినా సరే విదేశీ మెడికల్ కాలేజీల్లో ప్రవేశం దక్కుతుంది. అయితే, డిగ్రీ పూర్తి చేసుకున్నాక భారతదేశంలో ప్రాక్టీస్ చేయాలా వద్దా అనే అంశమే ఇక్కడ కీలకంగా మారుతుంది.

భారతీయ నిబంధనలు ఏం చెప్తున్నాయి?

విదేశాల్లో చదువుకోవడానికి నీట్ అక్కర్లేకపోయినా, వైద్య విద్య పూర్తయ్యాక తిరిగి వచ్చి భారతదేశంలో డాక్టర్‌గా సేవలు అందించాలంటే మాత్రం 'నీట్-యుజి' (NEET-UG) అర్హత సాధించడం చట్టరీత్యా తప్పనిసరి.

నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అధికారిక నిబంధనల ప్రకారం, మే 2018 తర్వాత విదేశీ సంస్థల నుంచి ప్రాథమిక మెడికల్ డిగ్రీ పొందాలనుకునే భారత పౌరులు ఎవరైనా కచ్చితంగా నీట్-యుజి అర్హత సాధించి ఉండాలి. ఈ నీట్ ఫలితమే ఎన్ఎమ్‌సి జారీ చేసే 'ఎలిజిబిలిటీ సర్టిఫికేట్'గా పరిగణిస్తారు. ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఈ సర్టిఫికేట్ మూడేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది.

డిగ్రీ పూర్తయ్యాక రాయాల్సిన పరీక్షలు

విదేశాల్లో MBBS పూర్తి చేసుకుని భారత్‌కు తిరిగి వచ్చే విద్యార్థులు ప్రస్తుతం 'ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్' (FMGE) క్లియర్ చేయాల్సి ఉంది. అయితే, నేషనల్ మెడికల్ కమిషన్ 'నేషనల్ ఎగ్జిట్ టెస్ట్' (NExT) నిబంధనలు 2023 ప్రకారం, భవిష్యత్తులో దేశీయ, విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లు అందరికీ 'నెక్స్ట్' అనే ఒకే రకమైన లైసెన్సింగ్ పరీక్షను ప్రవేశపెట్టనున్నారు.

"విదేశీ కాలేజీల్లో సీటు రావడానికి నీట్‌లో సాధించే మార్కులతో సంబంధం లేదు. కనీస అర్హత మార్కులు వచ్చినా సరిపోతుంది. కానీ, భవిష్యత్తులో మీ కెరీర్ భారత్‌లో ఉందో లేక విదేశాల్లో ఉందో ముందుగానే నిర్ణయించుకుని దానికి అనుగుణంగా ప్రణాళిక రచించుకోవడం ముఖ్యం" అని సోనాల్ వివరించారు.

నోవాగ్రాడ్ వేదికగా పూర్తి సమాచారం

ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించడానికి ప్రొడిజీ ఫైనాన్స్ 'నోవాగ్రాడ్' (NovaGrad) అనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు ఏ కాలేజీకి అర్హులు, స్కాలర్‌షిప్‌లు ఎలా పొందాలో తెలుసుకోవడానికి, వర్సిటీలను ఎంచుకోవడానికి ఈ వేదిక దోహదపడుతుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

2007లో ప్రారంభమైన ప్రొడిజీ ఫైనాన్స్, ఇప్పటివరకు 150కి పైగా దేశాలకు చెందిన 47,000 మందికి పైగా విద్యార్థులకు 2.6 బిలియన్ డాలర్లకు పైగా విద్యా రుణాలను అందజేసింది. విద్యార్థి భవిష్యత్ సంపాదన సామర్థ్యం ఆధారంగా సరిహద్దులతో సంబంధం లేకుండా లోన్లు అందించడం ఈ సంస్థ ప్రత్యేకత.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More