మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్.. బొగ్గు బ్లాకుల కేటాయింపు కేసులో తీర్పు
బొగ్గు బ్లాకుల కేటాయింపుల వ్యవహారంలో మాజీ ప్రధాని దివంగత డాక్టర్ మన్మోహన్ సింగ్‌పై నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. సీబీఐ రెండుసార్లు దాఖలు చేసిన క్లోజర్ నివేదికలను అంగీకరిస్తూ, 2015లో ఆయనను నిందితుడిగా ఆరోపిస్తూ ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్ల ఉత్తర్వులను సుప్రీం కోర్టు రద్దు చేసింది.
యూపీఏ (UPA) హయాంలో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన బొగ్గు బ్లాకుల కేటాయింపుల వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో మాజీ ప్రధాని, దివంగత డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు అత్యున్నత న్యాయస్థానం నిర్దోషిగా క్లీన్ చిట్ ఇచ్చింది. 2015లో ప్రత్యేక సీబీఐ కోర్టు ఆయనకు జారీ చేసిన సమన్లను రద్దు చేస్తూ, కేసును విచారించాల్సిన ఆవశ్యకత లేదని స్పష్టం చేసింది.

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే?
సీబీఐ జరిపిన విచారణలో మన్మోహన్ సింగ్‌పై ఎలాంటి నేరపూరిత ఆధారాలు లేవని తేలుస్తూ రెండుసార్లు క్లోజర్ రిపోర్టులు దాఖలు చేసింది. అయినా కూడా ప్రత్యేక ట్రయల్ కోర్టు సీబీఐ క్లోజర్ రిపోర్టులను తోసిపుచ్చి మన్మోహన్ సింగ్‌ను నిందితుడిగా పేర్కొంటూ సమన్లు జారీ చేయడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది.
"విచారణ సంస్థ సమర్పించిన క్లోజర్ నివేదికలను తోసిపుచ్చి సమన్లు జారీ చేయడానికి ప్రత్యేక కోర్టుకు ఎలాంటి బలమైన ఆధారాలు, సరైన కారణాలు లేవని భావిస్తున్నాం" అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
డిసెంబర్ 2024లో మన్మోహన్ సింగ్ మరణించినందున సాంకేతికంగా ఈ పిటిషన్ ముగిసినప్పటికీ, ఒక మాజీ ప్రధానిపై ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల చట్టబద్ధతను పరిశీలించడం న్యాయసూత్రాల దృష్ట్యా అవసరమని కోర్టు స్పష్టం చేసింది.
కేసు పూర్వాపరాలు ఏమిటి?
2005లో ఒడిశాలోని 'తలబీరా-II' (Talabira-II) బొగ్గు బ్లాక్‌ను హిందాల్కో (Hindalco) పరిశ్రమకు కేటాయించిన సమయంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉంటూనే బొగ్గు శాఖ బాధ్యతలను కూడా నిర్వర్తించారు. స్క్రీనింగ్ కమిటీ సిఫార్సులను పక్కనబెట్టి ప్రధాని హోదాలో ఆయన ఆమోదం తెలిపారనే ఆరోపణలతో వివాదం మొదలైంది. అయితే ఇది కేవలం పాలనాపరమైన నిర్ణయమని, ఇందులో ఎలాంటి నేరం లేదా అవినీతి లేదని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు.
సీబీఐ తన విచారణలో ఆయనపై ఎలాంటి ఆధారాలు లభించలేదని క్లోజర్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ, మార్చి 2015లో ప్రత్యేక సీబీఐ జడ్జి భరత్ పరాశర్ ఆయనతో పాటు మాజీ బొగ్గు కార్యదర్శి పి.సి. పరాఖ్‌లను విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు. దీనిపై మన్మోహన్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, 2015 ఏప్రిల్‌లో ఆ సమన్లపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దాదాపు 11 ఏళ్ల పాటు ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.
న్యాయవాదుల వాదనలు
మన్మోహన్ సింగ్ వారసుల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీలు మాట్లాడుతూ.. ఎలాంటి ఆధారాలు లేకుండా ట్రయల్ కోర్టు మాజీ ప్రధానిపై చేసిన ప్రతికూల వ్యాఖ్యలను, మోపిన ఆరోపణలను పూర్తిగా తొలగించాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐ తరఫు న్యాయవాది కూడా విచారణ కోర్టు పరిధి దాటి ప్రవర్తించిందని అంగీకరించారు.
ఈ తీర్పుతో సుదీర్ఘకాలంగా మన్మోహన్ సింగ్ పేరుపై ఉన్న ప్రతికూల నీడ తొలగిపోయి, ఆయన ప్రాభవానికి న్యాయపరమైన గుర్తింపు లభించినట్లయింది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


