తండ్రికి దక్కిన ఆస్తిపై మనవడికి హక్కు ఉండదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు

తండ్రికి పంపకాల ద్వారా వచ్చిన ఆస్తిపై మనవడికి జన్మతః హక్కు ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 8 ప్రకారం విభజన తర్వాత లభించిన ఆస్తి తండ్రి సొంత ఆస్తిగా మారుతుందని, దానిపై పిల్లలకు భాగం ఉండదని తీర్పునిచ్చింది.

Published on: Nov 10, 2026, 20:53:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తండ్రికి తన తండ్రి (తాత) నుంచి వారసత్వంగా, పంపకాల ద్వారా దక్కిన ఆస్తిపై మనవడికి జన్మతః ఎటువంటి హక్కు ఉండదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. హిందూ వారసత్వ చట్టం, 1956 ప్రకారం భాగ పరిష్కారం పూర్తయిన తర్వాత తండ్రికి వాటాగా వచ్చిన ఆస్తి అతని వ్యక్తిగత ఆస్తిగా మారుతుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

తండ్రికి దక్కిన ఆస్తిపై మనవడికి హక్కు ఉండదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు
తండ్రికి దక్కిన ఆస్తిపై మనవడికి హక్కు ఉండదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు

2026 నవంబర్ 6న జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్, జస్టిస్ సునీతా అగర్వాల్‌లతో కూడిన ధర్మాసనం 'జే. రాజేష్ (మైనర్) ప్రతినిధి తల్లి జే. గోమతి వర్సెస్ ఎం. కుమారన్ (మరణించారు) చట్టబద్ధ వారసులు' కేసులో ఈ కీలక తీర్పును వెలువరించింది. తాత ఆస్తి పంపకాల సమయంలో తండ్రికి దక్కిన స్థలాన్ని, ఆ తర్వాత ఆయన ఇతరులకు విక్రయించడాన్ని సవాలు చేస్తూ కొడుకు వేసిన అప్పీలును ధర్మాసనం కొట్టివేసింది.

అసలు వివాదం ఏమిటి?

చెన్నైకి చెందిన ఎన్. రామకృష్ణన్ అనే వ్యక్తికి 1,811 చదరపు అడుగుల ప్లాటు ఉంది. ఆయన మరణానంతరం ఆస్తి పంపకాల కోసం కుమార్తె 1993లో కోర్టును ఆశ్రయించింది. 1994 ఫిబ్రవరి 3న కుదిరిన రాజీ డిక్రీ ద్వారా ఈ వివాదాస్పద స్థలం రామకృష్ణన్ కుమారుడికి (మనవడి తండ్రికి) దక్కింది.

కాగా, సదరు మనవడు 1994 జనవరి 6న జన్మించాడు. ఆ తర్వాత 1997లో తండ్రి ఆ ఆస్తిని ఇద్దరు వ్యక్తులకు విక్రయించారు. దీంతో మైనర్‌గా ఉన్న కొడుకు తన తల్లి ద్వారా కోర్టులో దావా వేశాడు. అది తమ పూర్వీకుల ఆస్తి అని, పుట్టుకతోనే తనకు అందులో ఉమ్మడి భాగస్వామ్య హక్కు వచ్చిందని వాదించాడు. ఆ ఆస్తిలో సగం వాటా తనకు ఇవ్వాలని, తండ్రి చేసిన విక్రయాలు చెల్లవని కోరాడు.

ప్రారంభంలో ట్రయల్ కోర్టు కొడుకుకు అనుకూలంగా తీర్పునిచ్చినప్పటికీ, అప్పీలేట్ కోర్టు దానిని తిరస్కరించింది. పంపకాల తర్వాత ఆ ఆస్తిపై తండ్రికి పూర్తి సర్వహక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. మద్రాస్ హైకోర్టు కూడా ఇదే నిర్ణయాన్ని సమర్థించడంతో, బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 8 కింద సంక్రమించే ఆస్తికి, ఉమ్మడి కుటుంబ ఆస్తికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సుప్రీం కోర్టు సవివరంగా విశ్లేషించింది.

హిందూ పురుషుడు ఎలాంటి విల్లు (ఉయిల్) రాయకుండా మరణిస్తే, ఆయన ఆస్తి ముందుగా చట్టంలోని క్లాస్-1 వారసులకు మాత్రమే చెందుతుందని ధర్మాసనం గుర్తుచేసింది. క్లాస్-1 వారసులలో కొడుకు, కుమార్తె, భార్య తదితరులు ఉంటారు. కొడుకు బ్రతికి ఉన్నంత కాలం మనవడికి స్వతంత్రంగా క్లాస్-1 వారసుడిగా హక్కు రాదు.

"హిందూ వారసత్వ చట్టం 1956లోని సెక్షన్ 8 నిబంధనలను విస్మరించలేము. అవే అమల్లో ఉంటాయి" అని ధర్మాసనం పేర్కొంది. గతంలో 'సిడబ్ల్యూటీ వర్సెస్ చందర్ సేన్' కేసులో ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ.. సెక్షన్ 8 కింద కొడుకు పొందే వారసత్వ ఆస్తి ఆయన వ్యక్తిగతమైనదే తప్ప, ఆయన పిల్లలకు ఉమ్మడి హిందూ కుటుంబ (హెచ్‌యూఎఫ్) ఆస్తిగా మారదని స్పష్టం చేసింది.

పంపకాల తర్వాత హక్కులు మారతాయి

ఆస్తి పంపకాలు పూర్తయిన వెంటనే ఉమ్మడి కుటుంబ ఆస్తి స్వభావం అంతమవుతుందని, ప్రతి వారసుడు తనకు వచ్చిన వాటాకు పరిపూర్ణ యజమాని అవుతాడని సుప్రీంకోర్టు వివరించింది.

ఈ కేసులో తాత ఆస్తిపై హక్కుల ప్రక్రియ మనవడు పుట్టకముందే ప్రారంభమైందని, 1994 రాజీ డిక్రీ లేదా తండ్రి చేసిన అమ్మకాల పత్రాలను మనవడు కోర్టులో సవాలు చేయలేదని ధర్మాసనం గుర్తుచేసింది. కేవలం జన్మతః హక్కు ఉందనే ప్రాతిపదికన మాత్రమే భాగస్వామ్యం కోరాడని, ఇది చట్ట ప్రకారం నిలబడదని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ అప్పీలును తోసిపుచ్చింది.

ఆస్తుల కొనుగోలుదారులు, కుటుంబాలు తెలుసుకోవాల్సిన అంశాలు

ఈ తీర్పుతో పూర్వీకుల ఆస్తిపై పిల్లలకు ఎప్పటికీ హక్కులు ఉండవని భావించకూడదు. ఆస్తి ఎలా సంక్రమించింది, ఉమ్మడి కుటుంబం కొనసాగుతోందా లేదా చట్టబద్ధంగా పంపకాలు జరిగాయా అనే అంశాలపైనే హక్కులు ఆధారపడి ఉంటాయి.

కేవలం పూర్వీకుల ఆస్తి అని పేర్కొన్నంత మాత్రాన పిల్లలకు దానంతట అదే హక్కు రాదు. సెక్షన్ 8 కింద పంపకాల ద్వారా తండ్రికి వచ్చిన ఆస్తిని విక్రయించడానికి లేదా వేరొకరికి ఇవ్వడానికి తండ్రికి పూర్తి హక్కులు ఉంటాయి. అందుకోసం పిల్లల ముందస్తు అనుమతి కానీ, వారి జన్మతః హక్కుల ఆమోదం కానీ అవసరం లేదని ఈ తీర్పు పునరుద్ఘాటించింది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More