Swiggy share : స్విగ్గీ షేర్లలో రక్తపాతం- సింగిల్ ట్రేడింగ్​ సెషన్​లో దాదాపు రూ.10వేల కోట్లు ఆవిరి!

సెప్టెంబర్ 2026 త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో ప్రముఖ ఫుడ్ అండ్ క్విక్ కామర్స్ దిగ్గజం 'స్విగ్గీ' షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో దాదాపు 17 శాతానికి పైగా పడిపోయాయి. బిజినెస్ లాస్‌లు పెరగడం, బ్రోకరేజ్ సంస్థలు టార్గెట్ ధరలను సవరించడంతో ఒక్క రోజులో ఇన్వెస్టర్ల సొమ్ము దాదాపు రూ. 10వేల కోట్లు ఆవిరైపోయింది.

Published on: Oct 23, 2026, 13:11:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హైదరాబాద్, విశాఖపట్నం సహా దేశవ్యాప్తంగా ప్రజలు ఎక్కవగా వాడే ప్రముఖ ఫుడ్ అండ్ క్విక్ కామర్స్ యాప్ ‘స్విగ్గీ’ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను ముంచెసింది! ఒక్క శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌లోనే స్విగ్గీ షేరు ధర ఏకంగా 17 శాతానికి పైగా పడిపోయి, లిస్టింగ్ అయిన తర్వాత అత్యంత దారుణమైన (ఒకరోజు) పతనాన్ని నమోదు చేసింది. సెప్టెంబర్ 2026 (క్యూ2) త్రైమాసికానికి సంబంధించి కంపెనీ వెల్లడించిన ఫలితాలు నిరాశపరచడంతో పలు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు కంపెనీ టార్గెట్ ప్రైజ్​ని తగ్గించాయి. దీనితో ఒక్క రోజులోనే మార్కెట్లో స్విగ్గీ ఇన్వెస్టర్ల సంపద రూ.10,000 కోట్లు తుడిచిపెట్టుకుపోయింది!

స్విగ్గీ షేర్లలో రక్తపాతం- కారణం ఏంటి? (an AI-generated image for representational purposes)
స్విగ్గీ షేర్లలో రక్తపాతం- కారణం ఏంటి? (an AI-generated image for representational purposes)

స్విగ్గీ షేర్లలో బ్లడ్​బాత్- ఆల్ టైమ్ హై నుంచి 70 శాతం పతనం..

శుక్రవారం నాటి ట్రేడింగ్ ఓపెనింగ్​లో స్విగ్గీ షేరు ధర 17.22 శాతం క్షీణించి రూ.174.90 వద్ద 52 వారాల కనిష్ఠ స్థాయికి చేరింది. దీనితో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.48,300 కోట్ల కంటే దిగువకు జారిపోయింది. ఆల్ టైమ్ రికార్డులను పరిశీలిస్తే.. అక్టోబర్ 2025లో నమోదైన 52 వారాల గరిష్ఠ ధర రూ.434.50 తో పోలిస్తే ఈ షేరు 60 శాతం క్షీణించినట్టు. అంతేకాకుండా, డిసెంబర్ 2024లో సాధించిన ఆల్ టైమ్ హై రూ.595-600 స్థాయిల నుంచి ఏకంగా 70 శాతానికి పైగా పడిపోవడం గమనార్హం.

ఇక శుక్రవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో స్విగ్గీ షేర్లు 15శాతం నష్టంతో రూ. 180 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

స్విగ్గీ షేర్లలో బ్లడ్​బాత్- ఐపీఓ ఇన్వెస్టర్ల సంపద స్వాహా

నవంబర్ 2024లో స్విగ్గీ అట్టహాసంగా మార్కెట్లోకి అడుగుపెట్టినప్పుడు ఇష్యూ ధరను రూ.393గా నిర్ణయించారు. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.11,327 కోట్లను సేకరించి, ఏకంగా రూ.1.02 లక్షల కోట్ల వ్యాల్యుయేషన్ సాధించింది. అయితే నాటి నుంచి నేటి వరకు చూస్తే ఐపీఓ ఇన్వెస్టర్ల పెట్టుబడిలో 55 శాతానికి పైగా సంపద ఖాళీ అయింది. మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఇన్వెస్టర్లకు చెందిన సుమారు రూ.55,000 కోట్ల సంపద గాల్లో కలిసిపోయింది!

స్విగ్గీ షేర్లలో బ్లడ్​బాత్- ఫలితాలు ఎలా ఉన్నాయి?

సెప్టెంబర్ 2026తో ముగిసిన త్రైమాసికంలో స్విగ్గీ నికర నష్టం రూ.922 కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన కంపెనీ మొత్తం ఆదాయం 36.1 శాతం పెరిగి రూ.7,571 కోట్లకు చేరింది. ఇందులో ఫుడ్ డెలివరీ ఆదాయం 21.6 శాతం పెరిగి రూ.2,338 కోట్లుగా నమోదవగా, క్విక్ కామర్స్ (ఇన్​స్టామార్ట్) ఆదాయం 33.3 శాతం వృద్ధితో రూ.1,306 కోట్లకు చేరింది.

ఆదాయం పెరిగినప్పటికీ ఇన్వెస్టర్లను ప్రధానంగా ఆందోళనకు గురిచేస్తున్న అంశం ‘ఇన్‌స్టామార్ట్’ నష్టాలు. క్విక్ కామర్స్ విభాగంలో బ్లింకిట్ వంటి ప్రత్యర్థుల నుంచి తీవ్రమైన పోటీ ఎదురుకావడం, కొత్త డార్క్ స్టోర్ల విస్తరణ వ్యయం పెరగడం వల్ల ఇన్‌స్టామార్ట్ లాభాల బాట పట్టడం లేదు. ఇదే స్విగ్గీ షేర్ల పతనానికి ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

స్విగ్గీ షేర్లలో బ్లడ్​బాత్- బై, సెల్, హోల్డ్?

స్విగ్గీ ఫలితాల వెల్లడి అనంతరం దలాల్ స్ట్రీట్ బ్రోకరేజ్ సంస్థలు తమ అంచనాలను మార్చుకున్నాయి:

మోతీలాల్ ఓస్వాల్: ఈ షేరుకు ‘బై’ రేటింగ్ కొనసాగిస్తూనే, టార్గెట్ ధరను రూ.280కి తగ్గించింది. పోటీ తీవ్రత వల్ల ఇన్‌స్టామార్ట్ లాభాల్లోకి రావడానికి మరింత సమయం పడుతుందని పేర్కొంది.

ఐసీఐసీఐ సెక్యూరిటీస్: స్విగ్గీ షేర్​ ప్రైజ్ టార్గెట్​ని రూ.520 నుంచి రూ.400కి తగ్గించింది. అయితే ఫుడ్ డెలివరీ విభాగంలో మార్జిన్లు పెరగడం సానుకూల అంశమని అభిప్రాయపడింది.

ఎంకే గ్లోబల్: టార్గెట్ ధరను రూ.350 నుంచి రూ.310కి మార్చింది.

జేఎం ఫైనాన్షియల్: అత్యంత ప్రతికూల వైఖరి ప్రదర్శిస్తూ ‘రెడ్యూస్’ రేటింగ్ ఇచ్చింది. స్విగ్గీ షేర్ ప్రైజ్ టార్గెట్​ని రూ.200కి తగ్గించింది. ఇన్‌స్టామార్ట్ వ్యాపారానికి అసలు విలువే ఇవ్వలేమని, రాబోయే 2-3 ఏళ్లలో కంపెనీ నగదు నిల్వలు మరింత కరిగిపోతాయని హెచ్చరించింది.

మొత్తం మీద క్విక్ కామర్స్ రంగంలో లాభాలు కనిపించే వరకు స్విగ్గీ షేరుపై ఒత్తిడి కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్టే చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More