Jio IPO : జియో ఐపీఓ సబ్​స్క్రిప్షన్​కి ఇంకొన్ని గంటలే ఛాన్స్! అప్లై చేయాలా? వద్దా? జీఎంపీ ఎంతంటే..

భారత్‌లోనే అత్యంత భారీ బిజినెస్ డీల్‌గా నిలిచిన రూ.30,213 కోట్ల రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ నేటితో (అక్టోబర్ 23) ముగియనుంది. గ్రే మార్కెట్‌లో దాదాపు 22 శాతం ప్రీమియం పలుకుతున్న ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయవచ్చా లేదా అనే దానిపై మార్కెట్ దిగ్గజాల విశ్లేషణ ఇక్కడ చూడండి..

Published on: Oct 23, 2026, 11:20:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు తిరగరాస్తున్న 'జియో ప్లాట్‌ఫామ్స్' పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) సబ్​స్క్రిప్షన్ ప్రాసెస్ నేటితో (శుక్రవారం, అక్టోబర్ 23) ముగియనుంది. రూ.30,213 కోట్ల భారీ నిధుల సేకరణ లక్ష్యంతో మార్కెట్లోకి వచ్చిన ఈ జియో ఐపీఓకు మొదటి రోజు నుంచే ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. రెండో రోజు చివరి నాటికే మొత్తం ఇష్యూ 5.57 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయి మదుపరుల ఆదరణను చాటుకుంది!

జియో ఐపీఓ లేటెస్ట్ అప్డేట్స్.. (an AI-generated image for representational purposes)
జియో ఐపీఓ లేటెస్ట్ అప్డేట్స్.. (an AI-generated image for representational purposes)

తెలుగు రాష్ట్రాల్లోని రిటైల్ ఇన్వెస్టర్లు సహా దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, పెద్ద మదుపరులు ఈ ఐపీఓలో దరఖాస్తు చేసేందుకు చివరి క్షణం వరకు పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆఖరి రోజున అసలు బిడ్ వేయాలా? లేక లిస్టింగ్ తర్వాత కొనవచ్చా? అనే అంశాలపై ఆర్థిక రంగానికి చెందిన ప్రముఖ విశ్లేషకులు ఇచ్చిన సలహాలతో పాటు ఇతర కీలక వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

జియో ఐపీఓకు సబ్‌స్క్రిప్షన్ జోరు..

రెండో రోజు బిడ్డింగ్ ముగిసే సమయానికి రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 1.54 రెట్లు భర్తీ కాగా, కంపెనీ ఉద్యోగుల విభాగంలో 2.10 రెట్ల దరఖాస్తులు వచ్చాయి. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎన్​ఐఐ) కేటాయింపు 5.97 రెట్లు సబ్‌స్క్రిప్షన్ సాధించింది. విదేశీ, దేశీయ దిగ్గజ సంస్థాగత ఇన్వెస్టర్లు (క్యూఐబీ) ఈ ఇష్యూపై విపరీతమైన ఆసక్తి చూపిస్తూ ఏకంగా 13.29 రెట్లు దరఖాస్తులు దాఖలు చేశారు. దీనితో మార్కెట్‌లో జియో ప్లాట్‌ఫామ్స్ ఎంతటి నమ్మకాన్ని సంపాదించుకుందో స్పష్టమవుతోంది.

జియో ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఉందంటే..

ప్రాథమిక మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, గ్రే మార్కెట్‌లో జియో షేర్లకు బలమైన డిమాండ్ కనిపిస్తోంది! శుక్రవారం ఉదయం నాటికి జియో ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) రూ.240 వద్ద కొనసాగుతోంది. ఐపీఓ గరిష్ఠ ధర రూ.1,119 ప్రాతిపదికగా చూస్తే, ఇది దాదాపు 21.45 శాతం ప్రీమియంను సూచిస్తోంది. ఈ లెక్కన అక్టోబర్ 28న స్టాక్ ఎక్స్​ఛేంజీల్లో జియో షేరు రూ.1,359 వద్ద లిస్ట్ అయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

జియో ఐపీఓ ఇన్వెస్ట్ చేయొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారు?

ఐపీఓ ఇప్పటికే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయినప్పటికీ, సుదీర్ఘకాల దృక్పథంతో జియో ప్లాట్​ఫామ్స్​లో ఇన్వెస్టే చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

"కేవలం లిస్టింగ్ రోజు స్వల్ప లాభాలు వస్తాయా లేదా అనేది చూసి నిర్ణయం తీసుకోకూడదు. దీర్ఘకాలిక పెట్టుబడి ప్రాతిపదికన ఈ ఐపీఓకు దరఖాస్తు చేసుకోవడం శ్రేయస్కరం. కంపెనీ రాబోయే కాలంలో సాధించే వృద్ధిపైనే ఇన్వెస్టర్లు దృష్టి పెట్టాలి," అని రేలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్) అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు.

అంచనా వేసిన ఎబిట్​డాకు కంపెనీ వ్యాల్యుయేషన్ 11.6 రెట్లుగా ఉండటంతో ఇది మరీ చౌకైందేమీ కాదని, అయితే టెలికాం రంగానికే పరిమితం కాకుండా క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి భవిష్యత్ సాంకేతికతలలోకి జియో విస్తరిస్తున్న తీరు సుదీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలను ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ షేర్ల కేటాయింపు దక్కని పక్షంలో, లిస్టింగ్ రోజున 20 నుంచి 30 శాతం ప్రీమియంతో షేరు ప్రారంభమైతే కొద్దిరోజులు ఆగి మార్కెట్ దిద్దుబాటు సమయంలో కొనుగోలు చేయడం మేలని సలహా ఇచ్చారు.

"వ్యాల్యుయేషన్స్ ఆశాజనకంగా ఉన్నాయి. సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి బలమైన మద్దతు లభిస్తున్నందున రిటైల్ ఇన్వెస్టర్లు ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడాన్ని పరిశీలించవచ్చు," అని సెబీ రిజిస్టర్డ్ స్వతంత్ర మార్కెట్ నిపుణుడు అంబరీష్ బాలిగా తెలిపారు.

భారతీ ఎయిర్‌టెల్‌తో పోలిస్తే జియో పొజిషన్ ఏంటి?

ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ డైరెక్టర్, సీఈఓ అజయ్ గార్గ్ కంపెనీ బలాబలాలను విశ్లేషించారు. జియో ప్లాట్‌ఫామ్స్ దాదాపు 53.3 కోట్ల భారీ కస్టమర్ల బేస్ కలిగి ఉండి, ఆర్థిక సంవత్సరం 2026లో రూ.1.47 లక్షల కోట్ల ఆదాయాన్ని, రూ.30,049 కోట్ల నికర లాభాన్ని గడించిందని ఆయన వివరించారు.

ఐపీఓ గరిష్ఠ ధర వద్ద కంపెనీ మార్కెట్ విలువ రూ.10.3 లక్షల కోట్లుగా ఉంది. ఆర్థిక సంవత్సరం 2026 సంపాదన ఆధారంగా జియో ఐపీఓ పీఈ రేషియో 33.3 రెట్లు కాగా, దాని ప్రధాన పోటీదారు భారతీ ఎయిర్‌టెల్ పిఈ రేషియో 40.7 రెట్లుగా ఉంది. అంటే పీఈ నిష్పత్తి ప్రాతిపదికన ఎయిర్‌టెల్ కంటే జియో చౌకగా లభిస్తోంది.

అలాగే, 2026 జూన్ త్రైమాసికంలో జియో వినియోగదారు సగటు ఆదాయం (ఆర్​పూ) నెలకు రూ.215.6 గా నమోదు కాగా, ఎయిర్‌టెల్ ఏఆర్‌పీయూ రూ.264 గా ఉంది. దీనిని బట్టి జియోకు మున్ముందు ఆర్​పూ పెంచుకుని ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని స్పష్టమవుతోంది.

"లిస్టింగ్ గెయిన్స్ మాత్రమే ఆశించే వారు లిస్టింగ్ తర్వాత మార్కెట్ సరళిని చూసి నిర్ణయం తీసుకోవడం మంచిది. అయితే లిస్టింగ్ తర్వాత కూడా తక్కువ ధరకే షేరు దొరుకుతుందని గ్యారెంటీ లేదు. కాబట్టి తాత్కాలిక హడావుడిని చూడకుండా కంపెనీ దీర్ఘకాలిక వృద్ధిని నమ్మి ఇన్వెస్ట్ చేయాలి," అని అజయ్ గార్గ్ స్పష్టం చేశారు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఎదైనా ఐపీఓలో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More