Electric cars : టాటా నుంచి 2 ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లు- సఫారీ ఈవీ, అవిన్య ఈవీ లాంచ్​ ఎప్పుడంటే..

టాటా మోటార్స్ 2031 ఆర్థిక సంవత్సరం నాటికి భారత మార్కెట్లో 6 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 2026 దీపావళికి 'సఫారీ ఈవీ', 2027లో లగ్జరీ 'అవిన్య ఈవీ' ఎస్‌యూవీలను లాంచ్ చేయనుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

Published on: Jul 27, 2026, 05:37:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ దేశీయ ఈవీ మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు దూకుడు పెంచింది. 2031 ఆర్థిక సంవత్సరం నాటికి భారత మార్కెట్లోకి 6 కొత్త మోడళ్లను తీసుకురానున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ విస్తరణ ప్రణాళికలో భాగంగా కొత్త మోడళ్లతో పాటు ప్రస్తుతం ఉన్న కార్లలో ఫేస్‌లిఫ్ట్‌లు, వేరియంట్లు, ఇంజిన్/పవర్‌ట్రెయిన్ అప్‌గ్రేడ్‌లను తీసుకురానుంది.

టాటా అవన్య ఈవీ ఇదిగో..
టాటా అవన్య ఈవీ ఇదిగో..

వచ్చే ఐదేళ్లలో తన మొత్తం ప్యాసింజర్ వెహికిల్స్​ విక్రయాల్లో కనీసం 30 శాతం వాటాను ఎలక్ట్రిక్ కార్ల ద్వారానే సాధించాలని టాటా మోటార్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ లక్ష్యాన్ని చేరుకునేందుకు 4 సరికొత్త ఈవీ మోడళ్లను లైనప్‌లోకి తీసుకురానుంది. ఇవి 2031 నాటికి దేశీయ ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో 15 నుంచి 20 శాతం వాటాను కైవసం చేసుకుంటాయని కంపెనీ భావిస్తోంది.

ఇక అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లలో.. ముందుగా 2026 దీపావళి పండగ సీజన్‌లో ‘టాటా సఫారీ ఈవీ’ ని లాంచ్ చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఆ తర్వాత 2027లో ప్రీమియం బ్రాండ్ ‘అవిన్య ఈవీ’ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.

ఈ నేపథ్యంలో ఈ రాబోయే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాము.

టాటా సఫారీ ఈవీ..

టాటాకు చెందిన అత్యాధునిక 'Acti.ev+' ప్లాట్‌ఫామ్‌పై సఫారీ ఈవీ రూపుదిద్దుకుంటోంది. ఇది ఇటీవల మార్కెట్లోకి వచ్చిన హారియర్ ఈవీ పవర్‌ట్రెయిన్‌ను పంచుకునే అవకాశం ఉంది. హారియర్ ఈవీలో 65కేడబ్ల్యూహెచ్, 75కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 622 కిలోమీటర్ల పరిధి (రైడింగ్ రేంజ్) ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే, సఫారీ ఈవీ పరిమాణం, బరువు కాస్త ఎక్కువగా ఉండటంతో దీని రేంజ్ గణాంకాల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

అంతేకాకుండా, హారియర్ ఈవీలో ఉపయోగించిన 'టైడల్' (TiDAL - Tata Intelligent Digital Architecture Layer) ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఆర్కిటెక్చర్‌నే సఫారీ ఈవీలోనూ వాడనున్నారు. ఈ ఆర్కిటెక్చర్ వల్ల అడ్వాన్స్‌డ్ కనెక్టెడ్ కార్ ఫీచర్లు, 540-డిగ్రీ కెమెరా, ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్) వంటి సాంకేతికతలు చాలా సులభంగా పనిచేస్తాయి.

బయటి డిజైన్ విషయానికి వస్తే.. ఎలక్ట్రిక్ కారుకు తగినట్లు సీల్డ్-ఆఫ్ గ్రిల్, కొత్త బంపర్లు, సరికొత్త హెడ్‌ల్యాంప్‌లు, గాలి నిరోధకతను తగ్గించే ఏరో-ఆప్టిమైజ్డ్ అల్లాయ్ వీల్స్, ఈవీ బ్యాడ్జింగ్ ఉంటాయి. కారు లోపలి డిజైన్, ఫీచర్లు రెగ్యులర్ ఇంధన సఫారీని పోలి ఉన్నప్పటికీ, ఈవీ కోసం ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ఫీచర్లు తోడవుతాయి.

టాటా అవిన్య ఈవీ..

2027లో అధికారికంగా విడుదల కానున్న తన అత్యంత ప్రీమియం కారు 'అవిన్య'ను రోడ్లపై పబ్లిక్ టెస్టింగ్ చేయడాన్ని టాటా ఇప్పటికే ప్రారంభించింది. స్పై షాట్ల ఆధారంగా పరిశీలిస్తే.. ప్రొడక్షన్ వర్షెన్ మోడల్ దాదాపు కాన్సెప్ట్ కారు రూపంలోనే రాబోతోంది. మూసేసి ఉన్న గ్రిల్, ఫ్రంట్ బంపర్‌పై నిలువుగా అమర్చిన లైటింగ్ ఎలిమెంట్స్, సన్నటి డీఆర్‌ఎల్‌లు, పెద్ద సైజు ఏరో-ఆప్టిమైజ్డ్ అల్లాయ్ వీల్స్, ప్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, స్లోపింగ్ రూఫ్‌లైన్, బాడీ క్లాడింగ్‌తో ఇది అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

ఈ కారు పవర్‌ట్రెయిన్ వివరాలను కంపెనీ ఇంకా రహస్యంగా ఉంచినప్పటికీ, ఇది 65కేడబ్ల్యూహెచ్ నుంచి 80కేడబ్ల్యూహెచ్ రేంజ్ కలిగిన పెద్ద బ్యాటరీ ప్యాక్‌లతో వచ్చే అవకాశం ఉంది. టాటా అవిన్య కారును ‘చెరీ-జెఎల్‌ఆర్’ జాయింట్ వెంచర్ అభివృద్ధి చేసిన ప్రసిద్ధ ‘ఫ్రీలాండర్’ ఆర్కిటెక్చర్‌పై నిర్మిస్తున్నారని పరిశ్రమ వర్గాల సమాచారం. ఈ ప్లాట్‌ఫామ్ 800వీ ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్‌తో పాటు ఏకంగా 350కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల కారు బ్యాటరీ నిమిషాల వ్యవధిలోనే వేగంగా ఛార్జ్ అవుతుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More