CJP Protest Jantar Mantar : మేం ఎవరికీ భయపడబోం - సీజేపీ వ్యవస్థాకుడు అభిజీత్ దీప్కే
నీట్, సీబీఎస్‌ఈ పరీక్షల అక్రమాలపై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) భారీ నిరసన చేపట్టింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే డిమాండ్ చేశారు.
Abhijeet Dipke CJP : దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ శనివారం ఒక వినూత్న ఉద్యమానికి వేదికైంది. వివిధ పోటీ పరీక్షలు, ప్రభుత్వ నియామక పరీక్షల్లో జరిగిన అక్రమాలకు నిరసనగా 'కాక్రోజ్ జనతా పార్టీ' (సీజేపీ) ఆధ్వర్యంలో వందలాది మంది యువతీయువకులు భారీ ప్రదర్శన నిర్వహించారు.

పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని నిరసనకారులు గట్టిగా డిమాండ్ చేశారు. ఈ నిరసనను ఉద్దేశించి సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే మాట్లాడుతూ…. హక్కుల కోసం పోరాడే శక్తులు ఎవరికీ "భయపడే" ప్రసక్తే లేదని స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.
ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన అభిజీత్ డిప్కే… శనివారం ఉదయమే అమెరికా నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ పోలీసుల నుంచి ముందస్తు అనుమతి లభించిన అనంతరం ఆయన జంతర్ మంతర్ వద్దకు చేరుకునే సరికే, ఉదయం నుంచే అక్కడ దేశవ్యాప్తంగా వచ్చిన విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేసే ప్లకార్డులు, పోస్టర్లు చేతబూనిన నిరసనకారులు, తమ ముఖాలకు బొద్దింక మాస్కులు ధరించి నిరసన తెలపడం అక్కడ ఆకర్షణగా నిలిచింది. ఈ మాస్కులను నిరసన వేదిక వద్దే నిర్వాహకులు పంపిణీ చేశారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో పాటు, అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశంలో చేస్తున్న "హిందూ-ముస్లిం" విభజన రాజకీయాలను తక్షణమే ఆపాలని నిరసనకారులు నినాదాలు చేశారు. "భారత్ మాతా కీ జై" అంటూ జంతర్ మంతర్ పరిసరాలను హోరెత్తించారు. మతపరమైన రాజకీయాలను వ్యతిరేకిస్తూనే….. కేవలం దేశభక్తి నినాదాలు, మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే నినాదాలు చేయాలని తన మద్దతుదారులకు డిప్కే దిశానిర్దేశం చేశారు.
భయపడబోం : అభిజీత్ డిప్కే
సభను ఉద్దేశించి సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే మాట్లాడుతూ…. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లేటప్పుడు తన తల్లి ఎంతగా ఏడ్చిందో, అంతకంటే ఎక్కువగా భారతదేశానికి తిరిగి వచ్చేటప్పుడు ఏడ్చిందని చెప్పారు. తాను ఇండియాలో అడుగుపెట్టగానే ఎక్కడ అరెస్టు చేస్తారోనని ఆమె భయపడిందని పేర్కొన్నారు. "ఇది కేవలం మా అమ్మ భయం మాత్రమే కాదు, దేశంలో రాజకీయాలపై గొంతు ఎత్తే ప్రతి యువకుడి తల్లిదండ్రుల భయం ఇది. మనం ఇంకా ఎంతకాలం ఇలా భయం నీడలో బతుకుతాం…? మనం ఎవరికీ భయపడటం లేదని ఆ పాలకులకు గట్టిగా చెప్పండి," అని ఆయన పిలుపునిచ్చారు.
భారీ భద్రత నడుమ జరిగిన ఈ ప్రదర్శనలో ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. వీరితో పాటు సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య, సీపీఐ నేత అనీ రాజా, పలు వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు ఈ నిరసనలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
"మిత్రులారా, ఇది చాలా సుదీర్ఘమైన పోరాటం. సోషల్ మీడియా వేదికగా మేము విద్యాశాఖ మంత్రి రాజీనామాను డిమాండ్ చేయడం ప్రారంభించి నెల రోజులు గడిచింది. కానీ అధికారంలో ఉన్నవారికి అస్సలు సిగ్గు లేదు. తప్పులను సరిదిద్దే చర్యలు తీసుకోకుండా….. మా అకౌంట్లను హ్యాక్ చేయడం, మా పోస్టులను డిలీట్ చేయించడం లాంటి పనులపైనే వారు దృష్టి పెట్టారు. మీరు సోషల్ మీడియాలో మా పోస్టులను తొలగించగలరేమో కానీ, క్షేత్రస్థాయిలో ఉన్న మా ఉనికిని, మా ఆశయాలను ఎప్పటికీ తుడిచిపెట్టలేరు" అని డిప్కే ప్రసంగిస్తుండగా సభలో ఉన్న వారి నుంచి భారీ స్పందన లభించింది.
ఈ నిరసన పిలుపు నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్, సరిహద్దు ప్రాంతాలు, ఇతర సున్నిత ప్రాంతాలలో అదనపు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా న్యూఢిల్లీ పరిధిలో 1,000 మందికి పైగా పోలీసులను రంగంలోకి దించారు.
జంతర్ మంతర్ వద్ద నిరసన జరుగుతున్న సమయంలో అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతో, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా…. ఈ నిరసన ప్రదర్శనకు ముందే సీజేపీ అహింసా మార్గాన్ని అనుసరించాలని, పోలీసు యంత్రాంగానికి పూర్తి స్థాయిలో సహకరించాలని పాల్గొనే ప్రతి ఒక్కరికీ స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

