టెక్సాస్‌లో హెచ్-1బీ వీసాల నిలిపివేత.. చైనా కంపెనీలపై కఠిన ఆంక్షలు

టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ సంస్థలు, యూనివర్సిటీల్లో కొత్త హెచ్-1బీ వీసాల దరఖాస్తులను నిలిపివేస్తూ (Freeze) ఆదేశాలు జారీ చేశారు. దీనితో పాటు భద్రతా కారణాల దృష్ట్యా చైనాకు చెందిన 26 టెక్ కంపెనీలను రాష్ట్ర నెట్‌వర్క్‌ల నుంచి నిషేధించారు.

Published on: Jan 28, 2026, 08:22:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికాలో స్థిరపడాలనుకునే విదేశీ ఐటీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయులకు టెక్సాస్ ప్రభుత్వం షాకిచ్చింది. "టెక్సాస్ పౌరులకే తొలి ప్రాధాన్యం" (Texans Come First) అనే నినాదంతో గవర్నర్ గ్రెగ్ అబాట్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కొత్తగా హెచ్-1బీ (H-1B) వీసాదారులను నియమించుకోవడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

టెక్సాస్‌లో హెచ్-1బీ వీసాల నిలిపివేత.. చైనా కంపెనీలపై కఠిన ఆంక్షలు (AP)
టెక్సాస్‌లో హెచ్-1బీ వీసాల నిలిపివేత.. చైనా కంపెనీలపై కఠిన ఆంక్షలు (AP)

'టెక్సాస్ నిధులు.. టెక్సాస్ ప్రజలకే'

రాష్ట్ర పౌరులకు దక్కాల్సిన ఉద్యోగాలను విదేశీయులకు కట్టబెడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

“టెక్సాస్ పన్ను చెల్లింపుదారులు మన వర్క్‌ఫోర్స్ శిక్షణ కోసం బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడి పెడుతున్నారు. ఆ ఉద్యోగాలు మన టెక్సాస్ వాసులకే దక్కాలి” అని అబాట్ తన ఎక్స్‌ (X) వేదికగా స్పష్టం చేశారు.

ఫెడరల్ హెచ్-1బీ ప్రోగ్రామ్‌లో జరుగుతున్న దుర్వినియోగంపై వస్తున్న నివేదికలను ఆయన తన లేఖలో ప్రస్తావించారు. స్థానిక నిపుణులను నియమించుకోవడానికి సరైన ప్రయత్నాలు చేయకుండానే, కొన్ని సంస్థలు విదేశీ శ్రమను తక్కువ ధరకు వాడుకుంటున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొత్త నిబంధనలు ఇవే..

గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ విభాగాలు కొన్ని కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది:

ముందస్తు అనుమతి తప్పనిసరి: టెక్సాస్ వర్క్‌ఫోర్స్ కమిషన్ నుంచి లిఖితపూర్వక అనుమతి లేకుండా ఏ ప్రభుత్వ సంస్థ లేదా యూనివర్సిటీ కొత్త హెచ్-1బీ దరఖాస్తులు చేయకూడదు.

నివేదిక సమర్పణ: మార్చి నెలలోగా తమ వద్ద ఉన్న హెచ్-1బీ ఉద్యోగుల వివరాలను, వారి స్వదేశం, వృత్తి వంటి సమాచారాన్ని ప్రభుత్వానికి సమర్పించాలి.

స్థానికులకు అవకాశం: సదరు ఉద్యోగం కోసం స్థానిక టెక్సాస్ వాసులకు తగిన అవకాశం కల్పించామనే ఆధారాలను కూడా చూపించాల్సి ఉంటుంది.

ఎవరిపై ప్రభావం?

ప్రస్తుతానికి ఈ ఉత్తర్వులు కేవలం ప్రభుత్వ సంస్థలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే వర్తిస్తాయి. అయితే టెక్సాస్‌లోని ప్రైవేట్ దిగ్గజాలైన కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, ఒరాకిల్, టెస్లా వంటి కంపెనీలు భారీగా హెచ్-1బీ ఉద్యోగులను కలిగి ఉన్నాయి. ప్రస్తుతానికి ప్రైవేట్ రంగానికి మినహాయింపు ఉన్నప్పటికీ, ప్రభుత్వ వర్సిటీల్లో పరిశోధనలు చేసే భారతీయ విద్యార్థులు, మేధావులపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

చైనా టెక్ కంపెనీలపై నిషేధం

వీసా నిలుపుదలతో పాటు, చైనాకు చెందిన 26 టెక్ కంపెనీలను రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థల నుంచి నిషేధిస్తూ గవర్నర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెక్సాస్ ప్రజల డేటాను సేకరించి, రాష్ట్ర భద్రతకు ముప్పు వాటిల్లేలా చేసే శత్రు దేశాల ప్రయత్నాలను అడ్డుకోవడమే దీని ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

ఈ నిషేధిత జాబితాలో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అలీబాబా (Alibaba), షీన్ (Shein), టెము (Temu - PDD) తో పాటు హైసెన్స్ (Hisense) వంటి సంస్థలు ఉన్నాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ లేదా ఇతర విదేశీ శక్తులు టెక్సాస్ నెట్‌వర్క్‌లలోకి చొరబడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

గత జనవరి 20న ఇచ్చిన ఆదేశాల మేరకు టెక్సాస్ సైబర్ కమాండ్ నిర్వహించిన ముప్పు అంచనా (Threat Assessment) ఆధారంగా ఈ కంపెనీలపై ఆంక్షలు విధించారు. అమెరికాలోని ఇతర రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం కనిపిస్తోంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More