Today weather : పుంజుకున్న వర్షాలు- దిల్లీ, యూపీలకు భారీ వర్ష సూచన.. హిమాచల్‌కు హెచ్చరికలు!
తూర్పు భారతదేశంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర దిశగా పయనిస్తుండటంతో దిల్లీ, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లలో వర్షాలు తీవ్రరూపం దాల్చనున్నాయి. రాగల కొద్ది రోజుల్లో పలు రాష్ట్రాలకు యెల్లో, ఆరెంజ్ అలర్ట్‌లను వాతావరణ శాఖ జారీ చేసింది.
భారతదేశంలో రుతుపవనాల నిష్క్రమణ వేళ వాతావరణం అనూహ్యంగా మారుతోంది. తూర్పు భారతదేశంపై ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర దిశగా కదులుతుండటంతో రాగల రెండు రోజుల్లో దేశ రాజధాని దిల్లీతో పాటు ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లలో వర్షాల తీవ్రత గణనీయంగా పెరిగే అవకాశముంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆయా రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.

వారాంతంలో దిల్లీలో వానలు.. ఆదివారానికి యెల్లో అలర్ట్
వాయుగుండం ప్రభావంతో దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో వారాంతంలో వర్షాలు పునఃప్రారంభం కానున్నాయి. శుక్రవారం పొడి వాతావరణం నెలకొని, గరిష్ట ఉష్ణోగ్రత 33 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశముంది. అయితే శనివారం మధ్యాహ్నం లేదా సాయంత్రం నుంచి వాతావరణం మారిపోనుంది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడనుంది.
ఆదివారం నాటికి వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో ఐఎండీ దిల్లీకి 'యెల్లో అలర్ట్' ప్రకటించింది. నోయిడా, ఘజియాబాద్‌లలో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉండగా.. దిల్లీ, గుర్గావ్, ఫరీదాబాద్‌లలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్వతంత్ర వాతావరణ నిపుణుడు నవదీప్ దహియా వెల్లడించారు.
హిమాచల్ ప్రదేశ్‌లో పండగ వేళ భారీ వర్ష సూచన..
కొండ ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్‌లో రాబోయే కొన్ని రోజులు భారీ వర్షాలు కురుస్తాయని షిమ్లా వాతావరణ కేంద్రం అంచనా వేసింది. సెప్టెంబర్ 26న సీర్మౌర్ జిల్లాకు యెల్లో అలర్ట్, సెప్టెంబర్ 27న అదే జిల్లాకు అత్యంత భారీ వర్ష సూచనతో 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేశారు. అలాగే సెప్టెంబర్ 27న మండి, సిమ్లా, సోలన్ జిల్లాలకు, సెప్టెంబర్ 28న సీర్మౌర్, షిమ్లా, సోలన్‌లకు యెల్లో అలర్ట్ అమల్లో ఉంటుంది.
సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, కిన్నౌర్, లాహౌల్-స్పితి వంటి గిరిజన జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ నెలలో హిమాచల్ ప్రదేశ్ ఇప్పటివరకు 27% వర్షపాత లోటును ఎదుర్కోగా, లాహౌల్-స్పితి జిల్లాలో అత్యధికంగా 66% లోటు నమోదైంది. ఈ తాజా వర్షాలు వర్షపాత లోటును కొంతవరకు భర్తీ చేసే అవకాశం ఉంది.
యూపీలో మళ్లీ జోరందుకున్న రుతుపవనాలు
పశ్చిమ ఉత్తర ప్రదేశ్ నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ సాధారణం కంటే నాలుగు రోజుల ముందే ప్రారంభమైనప్పటికీ, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తూర్పు, మధ్య యూపీలో వర్షాలు మళ్లీ బలపడనున్నాయి. సెప్టెంబర్ 25, 26 తేదీల్లో తూర్పు ఉత్తర ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.
వర్షాల ప్రభావంతో యూపీ వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 6 నుంచి 9 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయి, వాతావరణం ఒక్కసారిగా చల్లబడనుంది. ప్రస్తుత పరిస్థితులు రుతుపవనాల తదుపరి నిష్క్రమణకు అనుకూలంగా లేవని, రాగల వారం రోజుల పాటు యూపీలో తదుపరి ఉపసంహరణ ఉండదని లక్నో వాతావరణ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త అతుల్ కుమార్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లో ఓవరాల్‌గా 6% వర్షపాత లోటు నమోదైంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


