Today's weather : ఐఎండీ షాకింగ్ వార్నింగ్! దిల్లీ నుంచి ఆంధ్ర వరకు.. 7 రోజులు భారీ ఉష్ణోగ్రతలే!
Heatwave alert : భారతదేశంలో వాతావరణం రెండు విభిన్న రూపాలను చూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 47డిగ్రీలకి చేరుకోవచ్చని అంచనా వేస్తూ రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేశారు ఐఎండీ. మరోవైపు, బెంగళూరుతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు ఐఎండీ భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.
Andhra Padesh Temperature today : భారతదేశాన్ని ఎండలు ముంచెత్తుతున్నాయి. భానుడి తాపానికి ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు జనం అల్లాడిపోతున్నారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శాస్త్రవేత్త నరేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే 6 నుంచి 7 రోజుల పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాల్పుల పరిస్థితులు కొనసాగుతాయి. పంజాబ్, హరియాణా, దిల్లీ-ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లకు ఐఎండీ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. అలాగే తూర్పు ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాలకు రాబోయే మూడు రోజుల పాటు ‘రెడ్ అలర్ట్’ ప్రకటించారు. దేశంలోనే అత్యధికంగా యూపీలోని బండాలో 48.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఆంధ్రప్రదేశ్‌లో నిప్పుల కొలిమి.. జిల్లాల వారీగా తీవ్రత..
రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత మరింత పెరుగుతుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించాయి. ఉష్ణోగ్రతల తీవ్రత ఆధారంగా జిల్లాలను మూడు కేటగిరీలుగా విభజించారు:
45డిగ్రీల నుంచి 47డిగ్రీలు (తీవ్ర వడగాల్పుల జోన్): కోస్తా, మధ్య ఆంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో ఎండలు మండిపోనున్నాయి.
44 డిగ్రీల నుంచి 45డిగ్రీలు (అధిక తీవ్రత జోన్): కాకినాడ, విజయనగరం, నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ప్రమాదకర స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
40డిగ్రీల నుంచి 43డిగ్రీలు (మధ్యస్థ జోన్): శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఎండ తీవ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది.
ప్రభుత్వ సూచన: ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
దిల్లీలో 'ఆరెంజ్ అలర్ట్' - 46డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు..
దేశ రాజధాని దిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో మే 27 వరకు తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక్కడ పగటి ఉష్ణోగ్రతలు 44డిగ్రీల నుంచి 46డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. అంతేకాకుండా, రాత్రి వేళల్లో కూడా వేడి గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
అటు రాజస్థాన్, బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
భారీ వర్షాల హెచ్చరిక - బెంగళూరుకు ‘యెల్లో అలర్ట్’
ఎండలు ఒకవైపు అల్లాడిస్తుంటే.. తూర్పు, ఈశాన్య భారత దేశంలో ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్- సిక్కిం రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చే ముప్పు ఉందని ఐఎండీ అప్రమత్తం చేసింది.
అలాగే దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కేరళ, కర్ణాటక అంతర్గత ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చు.
బెంగళూరు నగరానికి: మే 24 (ఆదివారం) వరకు వాతావరణ శాఖ ‘యెల్లో అలర్ట్’ జారీ చేసింది. బెంగళూరు అర్బన్, రూరల్, కోలార్, తుమకూరు, చిక్కబళ్లాపూర్, రామనగర జిల్లాల్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


