Land Cruiser FJ : టయోటా రగ్గడ్ ఎస్‌యూవీ ల్యాండ్ క్రూజర్ ఎఫ్‌జే లాంచ్- ధర..
Toyota Land Cruiser FJ : టయోటా సంస్థ తమ సరికొత్త రగ్గడ్ బాడీ-ఆన్-ఫ్రేమ్ ఎస్‌యూవీ ‘ల్యాండ్ క్రూజర్ ఎఫ్‌జే’ ని జపాన్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. భారత కరెన్సీలో దీని ధర సుమారు రూ. 27.24 లక్షలు కాగా, త్వరలోనే ఇది ఇండియాలో కూడా విడుదల కానుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా గ్లోబల్ మార్కెట్లోకి సరికొత్త రగ్గడ్ ఎస్‌యూవీని తీసుకొచ్చింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘ల్యాండ్ క్రూజర్ ఎఫ్‌జే’ మోడల్‌ను జపాన్ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. అక్కడ దీని ధరను జేపీవై 4,500,100 (మన కరెన్సీలో దాదాపు రూ. 27.24 లక్షలు) గా నిర్ణయించింది. గ్లోబల్ లైనప్‌లోకి వచ్చిన ఈ సరికొత్త బాడీ-ఆన్-ఫ్రేమ్ ఎస్‌యూవీ.. త్వరలోనే భారత మార్కెట్లోకి కూడా అడుగుపెట్టబోతోంది. టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) నుంచి రాబోయే కొన్నేళ్లలో రానున్న మోస్ట్ పవర్‌ఫుల్ అండ్ బిగ్గెస్ట్ లాంచ్‌లలో ఇది ఒకటి కాబోతోందని ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి.

టయోటా ల్యాండ్ క్రూజర్ ఎఫ్జేకి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
టయోటా ల్యాండ్ క్రూజర్ ఎఫ్‌జే- కొలతలు..
ఈ సరికొత్త ఎస్‌యూవీ 4,610 ఎంఎం పొడవు, 1,855 ఎంఎం వెడల్పు, 1,890 ఎంఎం ఎత్తును కలిగి ఉంది. సైజ్ పరంగా చూస్తే ఇది మన దేశీయ మార్కెట్లోని మహీంద్రా స్కార్పియో-ఎన్ పరిమాణంలో ఉంటుంది. అయితే, దీని వీల్‌బేస్ 2,580 ఎంఎం మాత్రమే కావడంతో లోపలి భాగం (క్యాబిన్ స్పేస్) కొంచెం కాంపాక్ట్‌గా ఉంటుంది. రగ్గడ్ లుక్ కోసం దీనికి స్మూత్ ఎడ్జెస్‌తో కూడిన బాక్సీ డిజైన్‌ను అందించారు.
టయోటా ల్యాండ్ క్రూజర్ ఎఫ్‌జే- ఇంజన్, పవర్..
ప్రస్తుతం జపాన్ మార్కెట్లో విడుదలైన ల్యాండ్ క్రూజర్ ఎఫ్జేలో 2టీఆర్-ఎఫ్ఈ 2.7-లీటర్, ఫోర్-సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 164 హెచ్‌పీ పవర్, 245 ఎన్ఎమ్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, పార్ట్-టైమ్ ఫోర్-వీల్-డ్రైవ్ (4డబ్ల్యూడీ) సిస్టమ్‌తో వస్తుంది. ఆటోమొబైల్ వర్గాల సమాచారం ప్రకారం.. టయోటా భవిష్యత్తులో (బహుశా 2029 నాటికి) ఇందులో 1జీడీ-ఎఫ్‌టీవీ 2.8-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. అయితే దీనిపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
టయోటా ల్యాండ్ క్రూజర్ ఎఫ్‌జే- ఎక్స్‌టీరియర్ డిజైన్..
కారు వెలుపలి వైపు ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ముందు, వెనుక వైపులా ఎల్‌ఈడీ ఫాగ్ ల్యాంప్స్, 265/60 R18 సైజ్ టైర్లతో కూడిన 18-ఇంచ్ భారీ అలాయ్ వీల్స్, పార్ట్-ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే వెనుక వైపు సైడ్-హింజ్డ్ టైల్‌గేట్‌తో పాటు మధ్యలో స్పేర్ వీల్ (స్టెప్నీ) ను అమర్చడం వల్ల కారుకు పక్కా ఆఫ్-రోడర్ లుక్ వచ్చింది. అయితే, ఈ మోడల్లో టయోటా సన్‌రూఫ్ ఆప్షన్‌ను అందించలేదు. కారు ప్రధాన లక్ష్యం ఆఫ్-రోడింగ్ కాబట్టి, ఈ సెగ్మెంట్ కస్టమర్లకు సన్‌రూఫ్ లేకపోవడం పెద్ద లోటుగా అనిపించకపోవచ్చు.
టయోటా ల్యాండ్ క్రూజర్ ఎఫ్‌జే- క్యాబిన్, ఫీచర్లు..
కారు లోపలి భాగంలో అధునాతన హంగులు కల్పించారు. 7-ఇంచ్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లేతో కూడిన సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్దదైన 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్లు ఉన్నాయి.
టయోటా ల్యాండ్ క్రూజర్ ఎఫ్‌జే- భద్రతకు పెద్ద పీట..
సేఫ్టీ పరంగా ఇందులో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, బ్లైండ్ స్పాట్ మానిటర్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, డైనమిక్ రాడార్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ అలర్ట్, ప్రీ-కొలిజన్ సిస్టమ్, సేఫ్ పార్కింగ్ కోసం 360-డిగ్రీల కెమెరాను అందించారు.
ఇండియాలో ఫార్చ్యూనర్, హ్యుందాయ్ టూసాన్, జీప్ కంపాస్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఈ ల్యాండ్ క్రూజర్ ఎఫ్‌జే సిద్ధమవుతోంది. ఇండియాలో ఈ మోడల్ లాంచ్, ధర, ఫీచర్లు వంటి వివరాలపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


