థర్డ్ వరల్డ్ దేశాల నుంచి వలసలను పూర్తిగా నిలిపివేస్తాం - ట్రంప్ సంచలన ప్రకటన!

థర్డ్ వరల్డ్ దేశాల నుంచి వలసలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు తన ట్రూత్​ సోషల్​ మీడియాలో ఒక పోస్ట్​ చేశారు.

Published on: Nov 28, 2025, 10:40:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

'థర్డ్ వరల్డ్ దేశాల' నుంచి వలసలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వైట్ హౌస్ సమీపంలో ఓ అఫ్గాన్ జాతీయుడు ఇద్దరు నేషనల్ గార్డ్ సిబ్బందిపై కాల్పులు జరిపిన కొద్ది రోజులకే ట్రంప్​ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన ట్రూత్​ సోషల్​ మీడియాలో శుక్రవారం కీలక ప్రకటన చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. (AP)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. (AP)

"అమెరికా వ్యవస్థ పూర్తిగా కోలుకోవడానికి వీలుగా, అన్ని 'థర్డ్ వరల్డ్ దేశాల' నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తున్నాను," అని ఆయన ప్రకటించారు.

“అమెరికా సాంకేతికంగా పురోగతి సాధించినప్పటికీ, తమ దేశ వలస విధానం అనేది ఆ పురోగతిని, చాలా మంది జీవన ప్రమాణాలను క్షీణింపజేసింది. లక్షలాది మంది బైడెన్ అక్రమ ప్రవేశాలను (నిద్రావస్తలో ఉన్న బైడెన్​ ఆటోపెన్​ ద్వారా సంతకాలు చేసిన వాటితో సహా) రద్దు చేస్తాను. యునైటెడ్ స్టేట్స్‌కు ఉపయోగపడని, లేదా మన దేశాన్ని ప్రేమించలేని ఎవరినైనా తొలగిస్తాను," అని ట్రంప్​ అన్నారు.

తమ దేశ పౌరులు కాని వారికి అందించే అన్ని ఫెడరల్ ప్రయోజనాలు, సబ్సిడీలను సైతం అంతం చేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు.

"శాంతికి భంగం కలిగించే వలసదారుల పౌరసత్వాన్ని రద్దు చేస్తాను. ఎవరైతే "పబ్లిక్ ఛార్జ్"గా, భద్రతాపరమైన ముప్పుగా ఉన్నారో, లేదా పాశ్చాత్య నాగరికతతో సరిపోలరో.. అటువంటి ఏ విదేశీయుడినైనా దేశం నుంచి బహిష్కరిస్తాను," అని ట్రంప్​ తేల్చిచెప్పారు.

ఈ భారీ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావాలను చూపనుంది! ఉద్యోగాలు, విద్య కోసం, లేదా తమ దేశాల్లో హింస నుంచి తప్పించుకోవడానికి అమెరికాకు వలస వెళ్లే లక్షలాది మందిని ఈ నిర్ణయం ప్రభావితం చేయనుంది.

థర్డ్​ వరల్డ్​ దేశాలు ఏవి?

ఈ థర్డ్​ వరల్డ్​ దేశాల మాట ప్రచ్ఛన్న యుద్ధం కాలం నాటిది! యూఎస్​, పాశ్చాత్య యూరోప్​తో కూడిన ఫస్ట్​ వరల్డ్​ లేదా కమ్యూనిస్ట్​ దేశాలతో కూడిన సెకండ్​ వరల్డ్​లో దేనికీ మద్దతివ్వని దేశాలను థర్డ్​ వరల్డ్​గా పిలిచేవారు. కానీ ఈ పదం ఇప్పుడు పాతపడిపోయింది! ఇప్పుడు దీనిని ఎల్​డీసీ (లీస్ట్​ డెవలప్డ్​ కంట్రీస్​)గా చూస్తున్నారు. అభివృద్ధి అనేది అత్యల్పంగా ఉన్న కొన్ని దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.

ఆఫ్రికా (32)- అంగోలా, బెనిన్​, బుర్కినా ఫాసో, బురుండి, సెంట్రల్​ ఆఫ్రికెన్​ రిపబ్లిక్​, చాడ్​, కొమొరొస్​, కాంగో, జిబోటి, ఎరిట్రియా, ఇథియోపియా, గాంబియా, గినియా, గినియా- బిస్సౌ, లెసొథో, లైబీరియా, మడగాస్కర్​, మాలావి, మాలి, మౌరిటానియా, మొజాంబిక్యూ, నైగర్​, రివాండ, సెనెగల్​, సియెర్రా లియోన్​, సోమాలియా, సౌత్​ సుడాన్​, సుడాన్​, టాంగో, యుగాండ, టాన్షేనియా, జాంబియా

ఆసియా (8)- అఫ్గానిస్థాన్​, బంగ్లాదేశ్​, కంబోడియా, లావో పిపుల్స్​ డెమొక్రటిక్​ రిపబ్లిక్​, మయన్మార్​, నేపాల్​, టిమోర్​-లెస్టే, యెమెన్​.

కరీబియన్​ (1)- హైతీ,

పెసిఫిక్​ (3)- కిరిబాటి, సోలోమన్​ ఐల్యాండ్స్​, తూలువా

ట్రంప్​ నిర్ణయం వెనుక కారణం..

వైట్ హౌస్‌కు కొన్ని బ్లాకుల దూరంలో జరిగిన దిగ్భ్రాంతికరమైన కాల్పుల ఘటన నేపథ్యంలోనే అధ్యక్షుడు ట్రంప్ వలసలపై ఇంతటి కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఒక దుండగుడు నేషనల్ గార్డ్‌కు చెందిన ఇద్దరు ట్రూపర్‌లు – సారా బెక్స్‌ట్రోమ్, ఆండ్రూ వోల్ఫ్ వద్దకు వచ్చి, చాలా దగ్గరిగా కాల్పులు జరిపాడు.

సారా బెక్స్‌ట్రోమ్ (20) ఈ దాడిలో మరణించింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ అధ్యక్షుడు ట్రంప్ ఈ రోజు ఉదయం మాట్లాడుతూ.. "అత్యంత గౌరవనీయమైన, యువ, అద్భుతమైన వ్యక్తి వెస్ట్ వర్జీనియాకు చెందిన సారా బెక్స్‌ట్రోమ్ కన్నుమూసింది. ఆమె ఇక మన మధ్య లేదు," అని భావోద్వేగంగా తెలిపారు.

ఆండ్రూ వోల్ఫ్ (24) పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.

దాడి చేసిన వ్యక్తి వివరాలు..

వైట్​ హౌస్​ దగ్గర దాడికి పాల్పడిన వ్యక్తి పేరు రహ్మానుల్లా లకన్వాల్​. అతని వయస్సు 29ఏళ్లు. అతను అఫ్గాన్​ జాతీయుడు. 2021లో అమెరికా తన బలగాలను ఆఫ్గానిస్థాన్ నుంచి ఉపసంహరించుకున్న తరువాత ఇతను అమెరికాకు వెళ్లాడు. అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ కాల్పుల వెనుక ఉద్దేశం ఏంటనేది ఇంకా నిర్ధారించలేదని అధికారులు తెలిపారు. అయినప్పటికీ, ఈ ఘటన దేశీయ భద్రత, వలస విధానాలపై తీవ్ర చర్చకు దారితీసింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More