కెనడా పౌరసత్వ చట్టంలో కీలక మార్పులు.. వేలాది మంది భారతీయ కుటుంబాలకు ఊరట!

కెనడా పౌరసత్వ చట్టంలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి! ఈ మేరకు కొత్త చట్టాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇది వేలాది మంది భారతీయ కుటుంబాలకు ఊరటనిచ్చే విధంగా ఉంది!

Published on: Nov 24, 2025, 06:45:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమ పౌరసత్వ చట్టంలో కీలక సంస్కరణలు తీసుకురావడానికి కెనడా సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం ద్వారా, చాలా కాలంగా పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయ మూలాలున్న కుటుంబాలకు, ఇతర విదేశాల్లో జన్మించిన కెనడియన్లకు ఊరట లభించే అవకాశం ఉంది!

కెనడా పౌరసత్వ చట్టంలో మార్పులు.. (Pixabay/Representational)
కెనడా పౌరసత్వ చట్టంలో మార్పులు.. (Pixabay/Representational)

నవంబర్ 21న విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. పాత నిబంధనల కారణంగా పౌరసత్వం కోల్పోయిన కెనడియన్లు తమ పిల్లలకు (విదేశాల్లో జన్మించినా లేదా దత్తత తీసుకున్నా) పౌరసత్వాన్ని అందించడానికి స్పష్టమైన మార్గం ఈ కొత్త చట్టంలో ఉంటుంది.

కొత్త చట్టంతో పౌరసత్వ పరిమితులకు ముగింపు

"కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత, గతంలో ఉన్న ‘తొలి తరం పరిమితి’ లేదా ఇతర పాత నిబంధనల వల్ల పౌరసత్వం లభించని వ్యక్తులకు పౌరసత్వం ఇవ్వబడుతుంది. విదేశాలలో జన్మించిన లేదా దత్తత తీసుకున్న కెనడియన్ తల్లిదండ్రులు, తమకు కెనడాతో ‘గణనీయమైన సంబంధం’ ఉంటే, ఈ బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత విదేశాల్లో జన్మించిన లేదా దత్తత తీసుకున్న తమ బిడ్డకు పౌరసత్వాన్ని ఇవ్వగలరు," అని ఆ ప్రకటన పేర్కొంది.

ఇమ్మిగ్రేషన్, శరణార్థులు, పౌరసత్వ శాఖ మంత్రి లీనా మెట్‌లెగ్ డియాబ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “బిల్లు సీ-3 మా పౌరసత్వ చట్టాల్లో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తుంది. విదేశాల్లో జన్మించిన లేదా దత్తత తీసుకున్న పిల్లలు ఉన్న కుటుంబాలకు ఇది న్యాయం చేస్తుంది. గత చట్టాల ద్వారా మినహాయించిన వ్యక్తులకు ఇది పౌరసత్వం ఇస్తుంది. అలాగే ఆధునిక కుటుంబాలు జీవించే విధానాన్ని ప్రతిబింబించేలా భవిష్యత్తు కోసం స్పష్టమైన నియమాలను ఏర్పాటు చేస్తుంది. ఈ మార్పులు కెనడా పౌరసత్వాన్ని బలోపేతం చేసి, రక్షిస్తాయి,” అని తెలిపారు.

తొలి తరం పరిమితిపై కోర్టు తీర్పు..

ఈ మొత్తం సమస్యకు మూలం 2009లో ఉంది. అప్పుడు ప్రభుత్వం తొలి తరం పరిమితి అనే నిబంధనను ప్రవేశపెట్టింది. ఈ నిబంధన ప్రకారం, తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా కెనడాలో జన్మించినవారు లేదా సహజసిద్ధంగా పౌరసత్వం పొందినవారు అయితేనే, వారి విదేశాల్లో జన్మించిన పిల్లలకు పౌరసత్వం లభించేది. దీని వల్ల, విదేశాల్లో జన్మించిన కెనడియన్ తల్లిదండ్రులకు విదేశాల్లో పుట్టిన పిల్లలకు పౌరసత్వం లభించకుండా పోయింది.

ఈ పరిమితిని డిసెంబర్ 2023లో ఒంటారియో సుపీరియర్ కోర్టు రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది. దీనిపై ఫెడరల్ ప్రభుత్వం అప్పీల్ చేయకుండా, కోర్టు నిర్ణయాన్ని అంగీకరించింది. ఈ పరిమితి కారణంగానే తాము పౌరులమని భావించినప్పటికీ, చట్టపరమైన ఆంక్షల వల్ల బయట ఉండిపోయిన "లాస్ట్ కెనడియన్స్" అనే వ్యక్తుల సమూహం ఏర్పడింది.

'బిల్లు సీ-3' లక్ష్యం ఏంటి?

బిల్లు సీ-3 అంతకుముందున్న నిబంధనల వల్ల ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ పౌరసత్వాన్ని తిరిగి అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2009- 2015లో చేసిన సంస్కరణలు చాలా మందికి పౌరసత్వ హోదాను పునరుద్ధరించినప్పటికీ, ఆ సమయంలో సుమారు 20,000 మంది తమ పౌరసత్వాన్ని విజయవంతంగా నిరూపించుకున్నారు. అయితే 2009లో ప్రవేశపెట్టిన తొలి తరం పరిమితి కొత్త మినహాయింపులకు దారితీసింది. డిసెంబర్ 2023లో కోర్టు ఈ నిబంధనను రద్దు చేయడంతో, ప్రభుత్వం ఆ తీర్పును అంగీకరించింది. దీనితో బిల్లు సీ-3 ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించే అవకాశం ఉంది.

బిల్లు సీ-3 కొత్తగా “గణనీయమైన సంబంధం” అనే అంశాన్ని కూడా ప్రతిపాదించింది. దీని ప్రకారం.. విదేశాల్లో జన్మించిన కెనడియన్లు తమ బిడ్డ పుట్టడానికి లేదా దత్తత తీసుకునే తేదీకి ముందు మొత్తంగా కనీసం 1,095 రోజులు కెనడాలో నివసించి ఉంటే, వారు తమ పిల్లలకు పౌరసత్వాన్ని ఇవ్వడానికి అర్హులు అవుతారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More