Iran Israel War : 5 రోజులు బ్రేక్.. ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన!

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. కొన్నింటిపై యుద్ధానికి బ్రేక్ ఇవ్వనున్నట్టుగా ప్రకటించారు.

Published on: Mar 23, 2026, 17:41:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొన్ని రోజులుగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం.. ప్రపంచ దేశాలపై పడుతోంది. ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొననాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. 5 రోజులపాటు దాడులు ఆపనున్నట్టుగా తెలిపారు. సమగ్ర పరిష్కారం కోసం అమెరికా, ఇరాన్‌లు చర్చలు జరిపాయని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​

ఈ చర్చల ఫలితంగా ఇరాన్ పవర్ ప్లాంట్లు, ఎనర్జీ ఇన్‌ఫ్రాపై మిలటరీ స్ట్రైక్స్‌ను వాయిదా వేస్తున్నట్టుగా ట్రంప్ వెల్లడించారు. శనివారం రాత్రి హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ట్రంప్ ఇరాన్‌కు 48 గంటల గడువు ఇచ్చారు. లేకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను అమెరికా తుడిచిపెట్టేస్తుందని హెచ్చరించారు.

'పశ్చిమాసియాలో యుద్ధం పూర్తిగా ఆపేసే విషయం మీద ఇరాన్‌తో రెండు రోజులుగా చర్చలు ఫలప్రదంగా కొనసాగుతున్నాయి. ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలు, విద్యుత్ కేంద్రాలపై దాడులు ఐదు రోజుల వరకు వాయిదా వేసేందుకు బలగాలను ఆదేశించాం. ఇరాన్‌తో చర్చలు కొనసాగుతాయి. ఆ తర్వాత ఫలితంపై ఆధారపడి భవిష్యత్ పరిస్థితులు ఉంటాయి.' అని డొనాల్డ్ ట్రంప్ ట్రూత్‌ సోషల్‌ వేదికగా ప్రకటన చేశారు.

కొన్ని రోజులుగా తీవ్రమవుతున్న పశ్చిమాసియా ఉద్రిక్తతలతో పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికే ట్రంప్ హెచ్చరికకు ఇరాన్ గట్టిగా స్పందిస్తూ.. తమ మౌలిక మౌలిక సదుపాయాలపై ఏ దాడి జరిగినా దాని ఫలితంగా మొత్తం గల్ఫ్ ప్రాంతం నష్టపోతుందని పేర్కొంది. తమ విద్యుత్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుంటే, గల్ఫ్ దేశాల్లోని కీలక మౌలిక సదుపాయాలపై దాడి చేస్తామని ఇరాన్ కూడా హెచ్చరించింది. అమెరికా సైనిక స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాల్లోని ఇంధన సంస్థాపనలే తమ లక్ష్యాలుగా ఉంటాయని తెలిపింది. అంతేకాదు హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని కూడా ఇరాన్ బెదిరించింది.

ఇరాన్, ఒమన్ మధ్య ఉన్న హోర్ముజ్ జలసంధి, ప్రపంచంలోని ప్రధాన సముద్ర మార్గాలలో ఒకటి. ప్రపంచ చమురు, గ్యాస్‌లో సుమారు చాలా వరకు దీని గుండానే రవాణా అవుతుంది.

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్.. ఇరాన్‌పై సైనిక చర్యను ప్రారంభించాయి. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ హోర్ముజ్ గుండా నౌకల రాకపోకలను నిరోధించింది. దీనివల్ల ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇరాన్ తీసుకున్న ఈ చర్య చమురు, గ్యాస్ ట్యాంకర్ల రాకపోకలను ప్రభావితం చేసింది. ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More