అడ్డగోలుగా టారీఫ్​ ప్రకటనలు చేస్తున్న ట్రంప్​- ఇప్పుడు మరో 25శాతం..

ఇరాన్‌తో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం సుంకాన్ని ప్రకటించారు. ఇరాన్​లో తాజా ఉద్రిక్తతల మధ్య ట్రంప్​ చేసిన ఈ ప్రకటన సర్వత్రా చర్చకు దారి తీసింది.

Published on: Jan 13, 2026, 05:37:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇరాన్​తో ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మరోమారు టారీఫ్​ అస్త్రాన్ని ప్రయోగించారు. ఇరాన్‌తో వ్యాపార లావాదేవీలు జరిపే ఏ దేశమైనా సరే, అమెరికాతో చేసే వ్యాపారంపై భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక కీలక ప్రకటన చేస్తూ.. ఇరాన్‌తో సంబంధాలు ఉన్న దేశాలపై 25శాతం అదనపు టారీఫ్ (సుంకం) విధిస్తున్నట్లు ప్రకటించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. (REUTERS)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. (REUTERS)

"వెంటనే అమల్లోకి వచ్చేలా.. ఇరాన్‌ ఇస్లామిక్ రిపబ్లిక్‌తో వ్యాపారం చేసే ఏ దేశమైనా, అమెరికాతో చేసే మొత్తం వ్యాపారంపై 25 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఇక ఎలాంటి చర్చలు ఉండవు, ఇదే నా తుది నిర్ణయం," అని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా పేర్కొన్నారు.

అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం.. చైనా, బ్రెజిల్, టర్కీ, రష్యా వంటి దేశాలు ప్రస్తుతం ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలను కలిగి ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో ఈ దేశాలపై తీవ్ర ఆర్థిక ప్రభావం పడే అవకాశం ఉంది.

తీవ్రమవుతున్న ఒత్తిడి.. సైనిక చర్యకూ సిద్ధం?

మరోవైపు ఇరాన్ పాలకులు ప్రస్తుతం దేశీయంగా తీవ్ర నిరసనలను ఎదుర్కొంటున్నారు. ఆర్థిక సంక్షోభంతో మొదలైన ఈ ఆందోళనలు, ఇప్పుడు మతపరమైన పాలనను అంతం చేయాలనే స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ పాలకులపై ట్రంప్ ప్రభుత్వం అన్ని వైపుల నుంచి ఒత్తిడిని పెంచుతోంది. ఇరాన్‌లో నిరసనకారుల హత్యలను తీవ్రంగా ఖండించిన ట్రంప్, అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఇరాన్ ప్రతిపక్ష నేతలతో తాను సంప్రదింపులు జరుపుతున్నానని, అలాగే ఆ దేశాధికారులను కూడా కలిసే అవకాశం ఉందని తెలిపారు.

ఎయిర్​ స్ట్రైక్స్​కి కూడా సిద్ధం..!

వాయు దాడులు (ఎయిర్ స్ట్రైక్స్) వంటి కఠిన నిర్ణయాలు పరిశీలనలో ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి దౌత్యానికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ వెల్లడించారు.

"ట్రంప్ వద్ద అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, అందులో వాయు దాడులు కూడా ఒకటి. కానీ, దౌత్య మార్గంలో సమస్యను పరిష్కరించుకోవడమే ఆయన మొదటి ప్రాధాన్యత," అని ఆమె సోమవారం విలేకరులతో అన్నారు.

మరోవైపు ఇరాన్​లో ప్రదర్శనకారులపై జరుగుతున్న అణచివేతను అడ్డుకోవడానికి ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. "వీధుల్లో పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. కమాండర్ ఇన్ చీఫ్ గా ట్రంప్ వద్ద అన్ని ఆప్షన్లు సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్ నేతలు పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి," అని కరోలిన్ లెవిట్ స్పష్టం చేశారు.

ఇరాన్ నుంచి విరుద్ధ సంకేతాలు..

ఇరాన్ ప్రభుత్వం బహిరంగంగా చెబుతున్న మాటలకు, వ్యక్తిగతంగా పంపుతున్న సందేశాలకు చాలా తేడా ఉందని వాషింగ్టన్ వర్గాలు చెబుతున్నాయి.

కాగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ స్పందిస్తూ.. అమెరికా పంపిన ప్రతిపాదనలను తాము పరిశీలిస్తున్నామని, అయితే ట్రంప్ హెచ్చరికలు దౌత్యానికి విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్, అరాక్చీ మధ్య నిరసనల కాలంలోనూ చర్చలు కొనసాగడం గమనార్హం.

అమెరికా తన ఆర్థిక, సైనిక శక్తిని ఏకకాలంలో ప్రయోగిస్తూ ఇరాన్‌ను దారిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తోందని తాజా పరిణామాలు విశ్లేషిస్తున్నాయి.

వెంటనే దేశం విడిచి వచ్చేయండి: అమెరికన్లకు ఆదేశం

ఇరాన్‌లో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేని స్థితి నెలకొంది. నిరసనలు హింసాత్మకంగా మారుతుండటం, ఇంటర్నెట్ షట్ డౌన్లు, రవాణా అంతరాయాల నేపథ్యంలో ఇరాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరులకు కీలక సూచనలు చేసింది. "ఇరాన్‌లో ఉన్న అమెరికన్లందరూ తక్షణమే ఆ దేశాన్ని విడిచి రావాలి. విమాన సర్వీసులు నిలిచిపోతున్నాయి, కాబట్టి సురక్షితంగా ఉన్నట్లయితే రోడ్డు మార్గం ద్వారా ఆర్మేనియా లేదా టర్కీకి వెళ్లిపోండి," అని హెచ్చరించింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More