వైరల్​ ChatGPT 1980's ట్రెండ్​ని ఇష్టమొచ్చినట్టు వాడేస్తున్నారా? ప్రైవసీ రిస్క్ తెలిస్తే షాక్..

ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వేదికగా 1980ల నాటి ఏఐ ఫోటోల ట్రెండ్ పిచ్చెక్కిస్తోంది. అయితే సరదాగా అప్‌లోడ్ చేసే ఒక్క క్లియర్ ఫోటో మీ వ్యక్తిగత బయోమెట్రిక్ సమాచారాన్ని, ప్రైవసీని తీవ్ర ప్రమాదంలో పడేస్తుందని డిజిటల్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు!

Published on: Sep 12, 2026, 05:59:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రస్తుతం సోషల్ మీడియాను 1980ల నాటి 'రెట్రో స్టైల్' ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫోటోల ట్రెండ్ ఊపేస్తోంది. మన ప్రస్తుత ఫొటోలను ఏఐ టూల్స్‌కు అందిస్తే, అవి 80ల నాటి చిరంజీవి, నాగార్జున, శ్రీదేవి సినిమాల తరహాలో లేదా పాతకాలపు నాటి వింటేజ్ పోర్ట్రెయిట్ల రూపంలోకి మార్చి ఇస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఫేస్‌బుక్ వేదికగా తెలుగు రాష్ట్రాల్లోనూ యువత ఈ ట్రెండ్‌ను విపరీతంగా ఫాలో అవుతోంది. పాతకాలపు హెయిర్ స్టైల్, నాటి దుస్తులు, వార్మ్ లైటింగ్‌తో కూడిన ఈ ఫోటోలు చూడటానికి భలే ముచ్చటగా ఉంటున్నాయి. కానీ, ఈ చిన్న సరదా వెనుక ఊహించని డిజిటల్ భద్రతా ప్రమాదాలు దాగి ఉన్నాయంటే నమ్మగలరా? వీటిపై సైబర్ సెక్యూరిటీ నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

1980's ట్రెండ్​తో ప్రైవసీ రిస్క్.. (AI-generated pictures for representational purposes)
1980's ట్రెండ్​తో ప్రైవసీ రిస్క్.. (AI-generated pictures for representational purposes)

ఫేషియల్ డేటా.. కేవలం ఫోటో మాత్రమే కాదు!

మనం సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసే స్పష్టమైన పోట్రైట్ కేవలం ఒక సాధారణ ఫొటో మాత్రమే కాదు. అందులో మీ వ్యక్తిగత బయోమెట్రిక్ వివరాలు దాగి ఉంటాయి. థర్డ్ పార్టీ ఏఐ యాప్‌లు లేదా ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో ఫోటోలను అప్‌లోడ్ చేసినప్పుడు, ఆ ఫేషియల్ డేటా సదరు కంపెనీల సర్వర్లలో భద్రమవుతుంది. వినియోగదారుల ప్రైవసీ విధానాలపై స్పష్టత లేని యాప్‌లు మీ ముఖ గుర్తింపు డేటాను ఇతర వ్యాపార సంస్థలకు విక్రయించే లేదా ఏఐ శిక్షణకు వాడుకునే ప్రమాదం ఉంది.

ఫోటో వెనుక దాగి ఉన్న మెటాడేటా ప్రమాదం..

మనం స్మార్ట్‌ఫోన్లలో తీసే ఒరిజినల్ ఫోటోలు కనిపించే రూపం కన్నా ఎక్కువ సమాచారాన్ని సదరు యాప్​లు తమలో దాచుకుంటాయి. ఫోటో ఫైల్‌తో పాటు ఫోన్ మోడల్, ఫోటో తీసిన సమయం, లొకేషన్ జీపీఎస్ వివరాలు మెటాడేటా రూపంలో రికార్డ్ అవుతాయి. దీనికి తోడు ఫోటో బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించే మీ ఇల్లు, ఆఫీసు, పిల్లల పాఠశాలలు, గుర్తింపు కార్డులు లేదా ఇతర పత్రాలు మీ నివాస ప్రాంత వివరాలను సులభంగా బయటపెడతాయి.

"ఏఐ టూల్స్ వాడే ముందు ఫోటోను చుట్టూ ఉన్న బ్యాక్‌గ్రౌండ్ కనిపించకుండా క్రాప్ చేయడం అత్యంత ముఖ్యమైన ముందస్తు జాగ్రత్త," అని సైబర్ భద్రతా నిపుణులు సూచిస్తున్నారు.

ఏఐ మోడళ్ల ట్రైనింగ్, చాట్‌జీపీటీ నిబంధనలు..

మనం అప్‌లోడ్ చేసే ఫోటోలను ఏఐ కంపెనీలు తమ సిస్టమ్‌లను మరింత మెరుగుపరచుకోవడానికి ఉపయోగిస్తాయి. ఉదాహరణకు ఓపెన్ ఏఐ సంస్థకు చెందిన చాట్‌జీపీటీ వాడేవారు తమ ఖాతాలోని 'డేటా కంట్రోల్స్' విభాగంలో "Improve the model for everyone" అనే ఆప్షన్‌ను నిలిపివేయకపోతే, మీరు అప్‌లోడ్ చేసే ఫోటోలు వారి మోడల్ ట్రైనింగ్‌కు వెళ్లిపోతాయి.

సమాచారం పబ్లిక్ సర్వర్లకు వెళ్లకుండా ఉండాలంటే తాత్కాలిక చాట్‌లు ఉపయోగించడం మేలు. ఇవి 30 రోజుల తర్వాత కంపెనీ సర్వర్ల నుంచి పూర్తిగా తొలగిపోతాయి.

పాటించాల్సిన ముందస్తు జాగ్రత్తలు..

ట్రెండ్‌లో భాగం కావాలనుకునేవారు కొన్ని కీలక నియమాలు పాటించాలి:

ఇతరుల ఫోటోలు వద్దు: మీ మిత్రులు, కుటుంబ సభ్యులు లేదా పిల్లల ఫోటోలను వారి ప్రమేయం లేకుండా ఏఐ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేయకూడదు.

ప్రైవసీ పాలసీ: గుడ్డిగా కొత్త యాప్‌లను ఇన్‌స్టాల్ చేయకుండా, వాటి డేటా యాక్సెస్ నిబంధనలు చదవాలి.

ఆఫ్‌లైన్ ఎడిటింగ్: అత్యంత వ్యక్తిగత ఫోటోలను ఎడిట్ చేయడానికి ఇంటర్నెట్‌తో పనిలేని ఆఫ్‌లైన్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ వాడటం సురక్షితం.

కొన్ని సెకన్లలో వచ్చే రెట్రో ఫోటో మీ ప్రైవసీని శాశ్వతంగా ముప్పులో పడేసే అవకాశం ఉంది. కాబట్టి సోషల్ మీడియాలో ఏఐ ట్రెండ్‌ను బ్లైండ్‌గా ఫాలో అయ్యే ముందు ప్రైవసీ ప్రమాదాలను గుర్తుంచుకోవడం శ్రేయస్కరం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More