ఉబర్‌లో భారీగా లేఆఫ్స్: 10 శాతం సిబ్బందిపై వేటు వేసిన సీఈఓ దారా ఖోస్రోషాహి

గ్లోబల్ రైడ్ షేరింగ్ దిగ్గజం ఉబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. సంస్థలో నిర్వహణ లేయర్స్ తగ్గించేందుకు దాదాపు 10 శాతం మంది ఉద్యోగులను (సుమారు 3,300 మంది) తొలగిస్తున్నట్లు సీఈఓ దారా ఖోస్రోషాహి ప్రకటించారు.

Published on: Sep 3, 2026, 21:10:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్లోబల్ రైడ్-షేరింగ్, డెలివరీ దిగ్గజం ఉబెర్ (Uber) సంస్థలో లేఆఫ్స్ మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మొత్తం సిబ్బందిలో దాదాపు 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల దాదాపు 3,300 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోనున్నారు. సంస్థలో అంతర్గత నిర్వహణ పొరలను (Layers) తగ్గించి, బృందాల నిర్మాణాన్ని సరళతరం చేయడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) దారా ఖోస్రోషాహి ఉద్యోగులకు పంపిన మెమోలో స్పష్టం చేశారు. స్థానిక చట్టపరమైన నిబంధనలు ఉన్న దేశాల్లో తప్ప, మిగిలిన అన్ని ప్రాంతాల్లో బాధితులకు ఇప్పటికే సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.

ఉబర్‌లో భారీగా లేఆఫ్స్: 10 శాతం సిబ్బందిపై వేటు వేసిన సీఈఓ దారా ఖోస్రోషాహి
ఉబర్‌లో భారీగా లేఆఫ్స్: 10 శాతం సిబ్బందిపై వేటు వేసిన సీఈఓ దారా ఖోస్రోషాహి

సంస్థ పునర్నిర్మాణానికే ఈ నిర్ణయం

గత ఐదేళ్లలో ఉబర్ వ్యాపారం గణనీయంగా విస్తరించింది. కంపెనీ రాబడి దాదాపు మూడు రెట్లు పెరిగినప్పటికీ, ఆ వృద్ధితో పాటు సంస్థలో ఆర్గనైజేషనల్ సంక్లిష్టత కూడా పెరిగింది. అనవసరపు మేనేజ్‌మెంట్ చట్రాలు, కోఆర్డినేషన్ కమిటీల వల్ల నిర్ణయాల ప్రక్రియ ఆలస్యమవుతోందని సీఈఓ అభిప్రాయపడ్డారు.

"ఇది ఉద్యోగుల పనితీరు ఆధారంగా తీసుకున్న నిర్ణయం కాదు. కంపెనీ రూపురేఖలు, ప్రాధాన్యతలను మార్చుకోవడంలో భాగంగానే ఈ మార్పులు చేస్తున్నాం" అని దారా ఖోస్రోషాహి వివరించారు. ఉద్యోగుల తొలగింపు ద్వారా మిగిలే నిధులను డ్రైవర్లు, కొరియర్లు, వ్యాపారుల పురోగతితో పాటు అటానమస్ (రోబోట్యాక్సీ) సాంకేతికతపై మరింతగా పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు.

మెమోలోని కీలక అంశాలివే

మేనేజ్‌మెంట్ వ్యవస్థల తగ్గింపు: సీఈఓ పదవికి 7 లేదా అంతకంటే ఎక్కువ స్థానాల దూరంలో (7+ layers) ఉన్న ఉద్యోగుల సంఖ్యను 20 శాతం మేర తగ్గించారు. 1-2 మంది మాత్రమే నివేదించే 'మైక్రో టీమ్స్'ను దాదాపు 50 శాతం వరకు కుదించారు.

విభాగాల విలీనం: డెలివరీ విభాగంలో విడివిడిగా ఉన్న రెస్టారెంట్స్, రిటైల్, డైరెక్ట్ ఆపరేషన్స్ టీమ్‌లను ఒకే గొడుగు కిందకు తెచ్చారు. టెక్నాలజీ విభాగంలో కోర్ సర్వీసెస్ ఇంజినీరింగ్, సైన్స్ బృందాలను విలీనం చేశారు.

రిమోట్ వర్క్ రద్దు: ఇకపై కేవలం 1 శాతం మంది ఉద్యోగులు మాత్రమే 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేసే వెసులుబాటు ఉంటుంది. మిగిలిన వారంతా వారానికి కనీసం 3 రోజులు ఆఫీస్‌కు రావాల్సిందేనని స్పష్టం చేశారు. గ్లోబల్ టీమ్‌లు న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయాల్లో మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది.

సోషల్ మీడియాలో కలకలం

ఉబర్ నిర్ణయంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యతిరేకత, ఆందోళన వ్యక్తమవుతున్నాయి. "నా మిత్రులైన ప్రతిభావంతులైన ప్రొడక్ట్ డిజైనర్లు ఉద్యోగాలు కోల్పోయారు" అని ఒక నెటిజన్ ఆవేదన వ్యక్తం చేయగా.. "ఈ లేఆఫ్స్ ఎప్పుడు ముగుస్తాయి? నైపుణ్యం ఉన్న ఇంజినీర్లను కూడా తొలగిస్తున్నారు" అని మరొకరు కామెంట్ చేశారు. ఉబెర్ రోబోట్యాక్సీ ప్రాజెక్ట్‌పై 10 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేయడానికి సిద్ధపడుతోందని, అందుకోసమే మానవ వనరులపై వేటు వేస్తోందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More