ఏనుగులు నడుస్తుంటే అందరూ దారి ఇస్తారు.. హువాంగ్ రీఎంట్రీపై ఉదయ్ కోటక్

ఎన్విడియా సీఈవోగా జెన్సన్ హువాంగ్ పునరాగమనం ప్రపంచ మార్కెట్లలో అత్యంత కీలక నిర్ణయమని ఉదయ్ కోటక్ అభివర్ణించారు. ఏఐ రేసులో అమెరికా ముందుండాలనే వ్యూహంతో ఈ పరిణామం ముడిపడి ఉందని పేర్కొన్నారు. హువాంగ్ తిరిగి రావడంతో ఎన్విడియా షేర్లు, తైవాన్ సూచీ భారీగా లాభపడ్డాయి.

Published on: Nov 24, 2026, 16:51:10 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ తిరిగి ఆ సంస్థ సీఈవోగా బాధ్యతలు చేపట్టడం ప్రపంచ ఆర్థిక మార్కెట్ల చరిత్రలో అత్యంత కీలకమైన నిర్ణయాల్లో ఒకటని కొటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. కృత్రిమ మేధ (ఏఐ) పోటీ, మారుతున్న అంతర్జాతీయ రాజకీయ ప్రాధాన్యాలతో ఈ నిర్ణయాన్ని ఆయన ముడిపెట్టారు.

ఏనుగులు నడుస్తుంటే అందరూ దారి ఇస్తారు.. హువాంగ్ రీఎంట్రీపై ఉదయ్ కోటక్
ఏనుగులు నడుస్తుంటే అందరూ దారి ఇస్తారు.. హువాంగ్ రీఎంట్రీపై ఉదయ్ కోటక్

"ఎన్విడియా సీఈవోగా జెన్సన్ హువాంగ్ తిరిగి రావడం ప్రపంచ మార్కెట్ల చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన నిర్ణయాల్లో ఒకటి. ఎన్విడియా మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో 1 ట్రిలియన్ డాలర్లు, అమెరికా మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో 4 ట్రిలియన్ డాలర్లు తిరిగి పుంజుకున్నాయి. ఏఐ రేసులో అమెరికాను ముందుంచాలనే స్పష్టమైన రాజకీయ, ఆర్థిక అజెండా దీని వెనుక ఉంది. ప్రపంచ శక్తి సమతూకం కోసం ఆట నిబంధనలు మారుతాయనే సందేశం సరైనదో కాదో కానీ, ఏనుగులు నడిచేటప్పుడు అందరూ వాటికి దారి ఇవ్వడానికి పక్కకు జరుగుతారు" అని నవంబర్ 24న ఎక్స్ వేదికగా ఉదయ్ కోటక్ పోస్ట్ చేశారు.

12 రోజుల తర్వాత మళ్లీ పగ్గాలు

సమావేశాలు, చర్చల అనంతరం జెన్సన్ హువాంగ్‌ను తక్షణమే ప్రెసిడెంట్, సీఈవోగా తిరిగి నియమిస్తూ ఎన్విడియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సోమవారం ఏకగ్రీవంగా ఓటు వేశారు. ఈ నిర్ణయం వెలువడిన నేపథ్యంలోనే ఉదయ్ కోటక్ ఈ వ్యాఖ్యలు చేశారు. సమావేశంలో హువాంగ్ చూపిన నిజాయతీ, సంస్థను నడిపించగల సామర్థ్యంపై బోర్డు సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం తీసుకునే ముందు అమెరికా ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి సమాచారం తీసుకున్నట్లు కూడా బోర్డు వెల్లడించింది.

చైనా నిఘా వ్యవస్థకు చెందిన మహిళతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో నవంబర్ 12న హువాంగ్ రాజీనామా చేశారు. ఆ తర్వాత 12 రోజులకే ఆయన తిరిగి తన సంస్థ పగ్గాలు చేపట్టారు. ఈ వ్యవహారంపై బోర్డులోని స్వతంత్ర కమిటీ విచారణ జరిపిన సమయంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కొలెట్ క్రెస్‌ను తాత్కాలిక సీఈవోగా ఎన్విడియా నియమించింది.

ఎన్విడియా, తైవాన్ మార్కెట్లలో జోరు

హువాంగ్ పునరాగమన ప్రకటన వెలువడిన వెంటనే ఎన్విడియా షేర్లు దూసుకెళ్లాయి. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఏకంగా 31.48 శాతం లాభపడి 165.05 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి.

కేవలం ఎన్విడియా, అమెరికా మార్కెట్లే కాకుండా తైవాన్ స్టాక్ మార్కెట్ కూడా ఈ పరిణామంతో భారీగా లాభపడింది. ఫోకస్ తైవాన్ కథనం ప్రకారం.. మంగళవారం ఉదయం ట్రేడింగ్‌లో తైవాన్ బెంచ్‌మార్క్ సూచీ 'తైఎక్స్' 3,300 పాయింట్లకు పైగా ఎగబాకింది. ఇంట్రాడేలో అత్యధిక పాయింట్ల లాభాన్ని నమోదు చేయడంతో పాటు 40,000 మైలురాయిని దాటింది.

ఏఐ సాంకేతికతపై పోటీ ప్రపంచ ఆర్థిక, వ్యూహాత్మక ప్రాధాన్యాలలో కీలక భాగంగా మారుతున్న వేళ, ఎన్విడియా నాయకత్వ మార్పునకు ఉన్న విస్తృత ప్రాధాన్యాన్ని ఉదయ్ కోటక్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

ABOUT THE AUTHOR

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.