ఏపీలో 2 ఫేక్​ యూనివర్సిటీలు, దేశవ్యాప్తంగా 22! డిగ్రీలు చెల్లవు- యూజీసీ అలర్ట్​..

దేశవ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలకు సంబంధించిన లిస్ట్​ని యూజీసీ విడుదల చేసింది. వీటిల్లో రెండు ఆంధ్రప్రదేశ్​లో ఉన్నాయి. ఈ వర్సిటీలు ఇచ్చిన డిగ్రీలు చెల్లవని యూజీసీ తేల్చి చెప్పింది.

Published on: Oct 29, 2025, 09:30:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశవ్యాప్తంగా ఉన్న నకిలీ యూనివర్సిటీలపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఎలాంటి అనుమతులు లేకుండా పనిచేస్తూ, తాము యూనివర్సిటీలమంటూ తప్పుగా ప్రచారం చేసుకుంటున్న 22 సంస్థల జాబితాను యూజీసీ విడుదల చేసింది. వీటిల్లో రెండు ఆంధ్రప్రదేశ్​కి చెందిన వర్శిటీలు ఉన్నాయి!

విద్యార్థులకు యూజీసీ హెచ్చరిక..
విద్యార్థులకు యూజీసీ హెచ్చరిక..

ఈ సంస్థలు యూజీసీ చట్టం, 1956 ప్రకారం డిగ్రీలను ప్రదానం చేయడానికి అధికారం లేనివని కమిషన్ స్పష్టం చేసింది. కాబట్టి, ఈ సంస్థల నుంచి పొందిన విద్యార్హతలు ఉద్యోగాల కోసం లేదా తదుపరి చదువుల కోసం చెల్లవని యూజీసీ తేల్చి చెప్పింది.

దిల్లీలోని కోట్లా ముబారక్‌పూర్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఇంజనీరింగ్ సంస్థకు సంబంధించిన ఒక కేసు నేపథ్యంలో ఈ చర్యను యూజీసీ తీసుకుంది. ఈ సంస్థకు కేంద్రం లేదా ఏ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా గుర్తింపు లేదని కమిషన్ పేర్కొంది. యూజీసీ చట్టంలోని సెక్షన్లు 2(ఎఫ్), 3ని ఉటంకిస్తూ.. ఈ సంస్థ జారీ చేసే డిగ్రీలకు ఎలాంటి చట్టపరమైన ప్రామాణికత ఉండదని నోటీసులో నొక్కి చెప్పింది.

యూజీసీ విడుదల చేసిన జాబితా ప్రకారం, నకిలీ సంస్థలు అత్యధికంగా దిల్లీలో 10 ఉన్నాయని తేలింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ 4 సంస్థలతో రెండో స్థానంలో ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తలో రెండు నకిలీ సంస్థలు ఉండగా.. మహారాష్ట్ర, పుదుచ్చేరిలలో తలో ఒకటి చొప్పున ఉన్నాయి.

ఫేక్​ యూనివర్సిటీల జాబితా..

ఆంధ్రప్రదేశ్:

  • క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ (గుంటూరు - రెండు చిరునామాలు)
  • బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా (విశాఖపట్నం)

దిల్లీ:

  • ఆల్ ఇండియా ఇన్​స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్​ ఫిజికల్ హెల్త్ సైన్సెస్, అలీపూర్
  • కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, దర్యాగంజ్
  • యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, దిల్లీ
  • వొకేషనల్ యూనివర్సిటీ, దిల్లీ
  • ఏడీఆర్-సెంట్రిక్ జ్యుడిషియల్ యూనివర్సిటీ, రాజేంద్ర ప్లేస్
  • ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, దిల్లీ
  • విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్-ఎంప్లాయ్‌మెంట్, సంజయ్ ఎన్‌క్లేవ్
  • స్పిరిచువల్ యూనివర్సిటీ, రోహిణి
  • వరల్డ్ పీస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, పీతమ్‌పురా
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఇంజనీరింగ్, కోట్లా ముబారక్‌పూర్

కేరళ:

  • ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ ప్రొఫెటిక్ మెడిసిన్, కోజికోడ్
  • సెయింట్ జాన్స్ యూనివర్సిటీ, కిషన్ అట్టమ్

మహారాష్ట్ర:

రాజా అరబిక్ యూనివర్సిటీ, నాగ్‌పూర్

పుదుచ్చేరి:

శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, తిలస్‌పేట్

ఉత్తరప్రదేశ్:

  • గాంధీ హిందీ విద్యాపీఠ్, ప్రయాగ్, అలహాబాద్
  • నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ (ఓపెన్ యూనివర్సిటీ), అలీఘర్
  • భారతీయ శిక్షా పరిషద్, లక్నో
  • మహామాయ టెక్నికల్ యూనివర్సిటీ, నోయిడా

పశ్చిమ బెంగాల్:

  • ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, కోల్‌కతా
  • ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్​ రీసెర్చ్, కోల్‌కతా

విద్యార్థులకు యూజీసీ సూచన

యూజీసీ చట్టంలోని సెక్షన్ 22ను ఉల్లంఘిస్తూ డిగ్రీ కోర్సులను నడుపుతున్న గుర్తింపు లేని సంస్థలలో చేరవద్దని విద్యార్థులను ఈ నోటీసు హెచ్చరిస్తోంది. ఇటువంటి సంస్థలు తరచుగా అధికారిక ధృవీకరణ మార్గాల గురించి తెలియని విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటాయని కమిషన్ గుర్తించింది.

విద్యార్థులు తమ విద్యా భవిష్యత్తు సురక్షితంగా ఉండాలంటే, ఏ ఉన్నత విద్యా సంస్థలో చేరే ముందు అయినా, తప్పనిసరిగా అధికారిక వనరుల ద్వారా ఆ సంస్థల గుర్తింపును సరిచూసుకోవాలని యూజీసీ కోరింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More