అర్బన్ కంపెనీ ఐపీఓ రేపు ప్రారంభం: గ్రే మార్కెట్‌లో రూ. 28 ప్రీమియం! పూర్తి వివరాలు, విశ్లేషణ ఇక్కడ తెలుసుకోండి
Urban Company IPO GMP today: అర్బన్ కంపెనీ ఐపీఓ సెప్టెంబర్ 10న ప్రారంభం కానుంది. ఒక్కో షేరు ధర రూ. 98 నుంచి రూ. 103 మధ్య నిర్ణయం. గ్రే మార్కెట్‌లో (జీఎంపీ) రూ. 28 ప్రీమియంతో ట్రేడ్ అవుతోంది.
అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అర్బన్ కంపెనీ లిమిటెడ్ ఐపీఓ సెప్టెంబర్ 10, బుధవారం భారత ప్రాథమిక మార్కెట్‌లోకి రాబోతోంది. ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ సెప్టెంబర్ 12 వరకు, అంటే శుక్రవారం వరకు అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఒక్కో షేరు ధరను రూ. 98 నుంచి రూ. 103 మధ్య నిర్ణయించింది. ఈ పబ్లిక్ ఇష్యూ బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ కానుంది. ఈ మెయిన్‌బోర్డు ఇష్యూ ద్వారా మొత్తం రూ. 1,900 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ. 472 కోట్లు కొత్త షేర్ల జారీ ద్వారా వస్తాయి. మిగిలిన రూ. 1,428 కోట్లు 'ఆఫర్ ఫర్ సేల్' (ఓఎఫ్‌ఎస్) కోసం కేటాయించారు.
ఐపీఓ ప్రారంభానికి ముందే అర్బన్ కంపెనీ షేర్లు గ్రే మార్కెట్‌లో సందడి సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ షేర్లు గ్రే మార్కెట్‌లో రూ. 28 ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయని మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. అంటే పెట్టుబడిదారులకు లిస్టింగ్ రోజున దాదాపు 28% లాభాలు వచ్చే అవకాశం ఉందని అంచనా. మార్కెట్ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారే ముప్పు ఉన్నందున ఈ అంచనాలు తారుమారు కూడా కావొచ్చు.
అర్బన్ కంపెనీ ఐపీఓ వివరాలు: 10 కీలక అంశాలు
- గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ): ప్రస్తుత జీఎంపీ రూ. 28గా ఉంది, ఇది మంచి లిస్టింగ్ లాభాలకు సూచన.
- ధర (ప్రైస్ బ్యాండ్): ఒక్కో షేరుకు ధర రూ. 98 నుంచి రూ. 103 వరకు నిర్ణయించారు.
- ఐపీఓ తేదీ: ఐపీఓ సెప్టెంబర్ 10న ప్రారంభమై సెప్టెంబర్ 12న ముగుస్తుంది.
- ఐపీఓ సైజు: కంపెనీ రూ. 1,900 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో కొత్త షేర్ల ద్వారా రూ. 472 కోట్లు, ఓఎఫ్‌ఎస్ ద్వారా రూ. 1,428 కోట్లు వస్తాయి.
- లాట్ సైజు: ఒక బిడ్డర్ ఒక లాట్‌లో 145 షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
- కేటాయింపు తేదీ: షేర్ల కేటాయింపు సెప్టెంబర్ 13న జరగవచ్చు. ఒకవేళ శనివారం కారణంగా ఆలస్యమైతే, సెప్టెంబర్ 15న ఇది ఖరారవుతుంది.
- రిజిస్ట్రార్: ఎంయూఎఫ్‌జీ ఇన్‌టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఐపీఓకు అధికారిక రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తోంది.
- లిస్టింగ్: ఈ పబ్లిక్ ఇష్యూ బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ కానుంది.
- లిస్టింగ్ తేదీ: షేర్లు సెప్టెంబర్ 17న లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
ఐపీఓ సమీక్ష:
అర్బన్ కంపెనీ తన సర్వీస్ నిపుణులకు శిక్షణ, ప్రామాణిక విధానాలు (ఎస్‌ఓపీలు), పరికరాలు, టెక్నాలజీ, ఆర్థిక సహాయం, బ్రాండింగ్ వంటి మద్దతును అందిస్తూ నాణ్యమైన సేవలను అందిస్తుంది. రెడ్‌సీర్ నివేదిక 2025 ప్రకారం అర్బన్ కంపెనీతో పనిచేసే సర్వీస్ నిపుణులు, ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో పనిచేసేవారి కంటే సగటున 30-40% ఎక్కువ సంపాదిస్తున్నారు.
ఆర్థికంగా బలమైన వృద్ధి
ఆర్థికంగా చూస్తే అర్బన్ కంపెనీ అద్భుతమైన వృద్ధిని, నిలకడను ప్రదర్శించింది. ఆర్థిక సంవత్సరం 2024-25లో కంపెనీ ఆదాయం 38% పెరిగి రూ. 1,144.5 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఏడాది రూ. 93 కోట్ల నష్టం వచ్చినప్పటికీ, ఈసారి రూ. 240 కోట్ల లాభం సాధించి లాభదాయకతను చాటింది. సర్వీస్‌ల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు, ఉత్పత్తి విక్రయాలు (నేటివ్ బ్రాండ్ ఉత్పత్తులు) మొత్తం ఆదాయంలో 26% వాటా కలిగి ఉండటం ద్వారా కంపెనీ విభిన్న కోణాల్లో ఆదాయ మార్గాలను కలిగి ఉందని స్పష్టమవుతోంది.
సాంకేతికత, సేవా ప్రమాణీకరణ, నిపుణుల సాధికారతను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా అర్బన్ కంపెనీ ఒక ప్రముఖ 'ఫుల్-స్టాక్ సర్వీస్ ప్రొవైడర్'గా ఎదిగింది. నిరంతర విస్తరణ, వినూత్న ఉత్పత్తులు, నమ్మకం, నాణ్యతపై దృష్టి పెట్టడం ద్వారా భారత్‌లో, అంతర్జాతీయంగా కూడా పెరుగుతున్న హోమ్ సర్వీసెస్ మార్కెట్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకుంటోంది. ఈ విధానం మార్కెట్‌లోని లోపాలను సరిదిద్ది, వేలాది మంది నిపుణులకు మంచి అవకాశాలను సృష్టించడమే కాకుండా, సామాజిక-ఆర్థిక అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది.
(డిస్‌క్లైమర్: ఈ కథనంలో పేర్కొన్న అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులవి లేదా బ్రోకరేజ్ కంపెనీలవి. హిందుస్తాన్ టైమ్స్‌వి కాదు.పెట్టుబడిదారులు ఎలాంటి నిర్ణయం తీసుకునే ముందుగా ధ్రువీకరణ పొందిన ఆర్థిక నిపుణులను సంప్రదించాలని సూచించడం జరుగుతోంది.)













