...
...
Next Story

US election results live : ట్రంప్​నకు బిగ్ షాక్! అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల హవా!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవిష్యత్తును నిర్ణయించే 2026 యూఎస్ మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో డెమోక్రటిక్ పార్టీ అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది! రిపబ్లిక్​ పార్టీకి చెందిన అనేక స్థానాల్లో డెమోక్రటిక్ పార్టీ హవా కనిపిస్తోంది! పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: Nov 4, 2026, 09:09:51 IST
Advertisement

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్ పీఠంపై తన రెండో విడత పదవీకాలాన్ని కొనసాగిస్తున్న వేళ, ఆయన రాజకీయ భవిష్యత్తును, పాలనా అధికారాలను శాసించే 2026 యూఎస్ మధ్యంతర ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈ ఎన్నికల తొలి ఫలితాల సరళి ప్రకారం డెమోక్రటిక్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంటూ ట్రంప్​నకు చెందిన రిపబ్లికన్ల ఆధిక్యంలో ఉన్న పలు స్థానాలను సొంతం చేసుకుంటోంది.

అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల తాజా వివరాలు.. (Getty Images via AFP)
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల తాజా వివరాలు.. (Getty Images via AFP)

అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ, ఎగువ సభ అయిన సెనెట్​లలో మెజారిటీ సాధించి, వాషింగ్టన్‌పై ట్రంప్ సాధిస్తున్న ఏకచ్ఛత్రాధిపత్యానికి బ్రేకులు వేసేందుకు డెమోక్రాట్లు దూసుకుపోతున్నారు.

అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది తెలుగు ఎన్‌ఆర్‌ఐలు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ఈ ఫలితాలు అత్యంత కీలకం. హెచ్-1బీ వీసా విధానాలు, గ్రీన్ కార్డ్ నిబంధనలు, నిత్యావసరాల ధరలపై ట్రంప్ సర్కార్ తీసుకునే తీవ్రమైన నిర్ణయాలను అడ్డుకోవాలంటే కాంగ్రెస్‌లో డెమోక్రాట్ల విజయం అవసరమని అక్కడి తెలుగు వర్గాలు భావిస్తున్నాయి.

నార్త్ కరోలినాలో రిపబ్లికన్లకు షాక్: డెమోక్రాట్ల ఖాతాలోకి కీలక సీటు..

సెనెట్‌లో అధికారం చేపట్టాలంటే రిపబ్లికన్ల నుంచి కనీసం నాలుగు స్థానాలను కైవసం చేసుకోవాల్సిన డెమోక్రాట్లకు మొదటి నియోజకవర్గంలోనే భారీ విజయం దక్కింది1 నార్త్ కరోలినా మాజీ గవర్నర్, డెమోక్రాట్ అభ్యర్థి రాయ్ కూపర్ తన ప్రత్యర్థి, రిపబ్లికన్ నేత మైఖేల్ వాట్లీపై ఘన విజయం సాధించి ఆ స్థానాన్ని డెమోక్రాట్ల ఖాతాలో వేశారు.

ఈ ముందస్తు ఫలితాల సరళితో రిపబ్లికన్ పార్టీ క్యాంప్‌లో తీవ్ర ఆందోళన మొదలైంది. జార్జియా రాష్ట్రంలో రిపబ్లికన్ ప్రచార బృందాలు తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నట్లు సీఎన్‌ఎన్ నివేదించింది. ఓటర్ల భాగస్వామ్యం తమ అంచనాలను అందుకోలేకపోయిందని, కీలకమైన సెనెట్, గవర్నర్ స్థానాల్లో డెమోక్రాట్లు ముందంజలో ఉన్నారని రిపబ్లికన్ వర్గాలు అంగీకరిస్తున్నాయి.

కాంగ్రెస్‌ను డెమోక్రాట్లు గెలిస్తే ట్రంప్‌నకు ఎదురయ్యే ముప్పులేంటి?

మరోవైపు సెనెట్‌లో కూడా రిపబ్లికన్లు ఓడిపోతే, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలు, అత్యున్నత ప్రభుత్వ అధికారుల ఎంపిక విషయంలో ట్రంప్ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేరు.

పెరుగుతున్న జీవన వ్యయం, ద్రవ్యోల్బణం, ఇరాన్‌తో యుద్ధం వంటి అంశాలపై అమెరికా ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తికి ఈ మధ్యంతర ఎన్నికల ఫలితాలు నిదర్శనంగా మారుతున్నాయి.

ఎన్ని స్థానాలకు ఈ సమరం జరుగుతోంది?

ఈ అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, సెనెట్‌లోని 100 స్థానాలకు గానూ 35 స్థానాలకు పోలింగ్ జరిగింది. వీటితో పాటు 36 రాష్ట్రాల్లో గవర్నర్ పదవులకు కూడా ఎన్నికలు ముగిశాయి.

దిగువ సభ : డెమోక్రాట్లు మరో 3 స్థానాలు అదనంగా గెలిస్తే మెజారిటీ సాధిస్తారు.

ఎగువ సభ : సెనెట్‌లో ప్రస్తుతం ఉన్న 53-47 రిపబ్లికన్ ఆధిక్యాన్ని తలకిందులు చేయాలంటే డెమోక్రాట్లకు 4 సీట్ల పెంపు అవసరం.

పోలింగ్ ముగిసిన వెంటనే హౌస్ డెమోక్రటిక్ మైనారిటీ లీడర్ హకీమ్ జెఫ్రీస్ మాట్లాడుతూ.. "అమెరికా రాజకీయం ఒక విప్లవాత్మక మార్పునకు ఆనుకుని నిలబడింది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌ను డెమోక్రాట్లు తిరిగి కైవసం చేసుకోబోతున్నారు," అని ధీమా వ్యక్తం చేశారు.

అయితే సెనెట్ విజయం డెమోక్రాట్లకు అంత తేలికైన విషయమేమీ కాదు! కన్జర్వేటివ్ ఆధిపత్యం ఉన్న కాన్సాస్, టెక్సాస్, ఐయోవా, ఒహాయో, అలాస్కా వంటి రాష్ట్రాల్లో పోటీ తీవ్రంగా ఉంది. మరోవైపు మిచిగాన్‌లో కాంగ్రెస్ ఉమెన్ హేలీ స్టీవెన్స్ తమ పార్టీ అభ్యర్థి అబ్దుల్ ఎల్-సయ్యద్‌కు కాకుండా రిపబ్లికన్ మైక్ రోజర్స్‌కు మద్దతు తెలపడం డెమోక్రాట్లకు అంతర్గత తలనొప్పిగా మారింది.

అయినప్పటికీ, 'డిసిషన్ డెస్క్ హెచ్​క్యూ' తుది అంచనా ప్రకారం డెమోక్రాట్లు హౌస్‌లో 241 సీట్లు, సెనెట్‌లో 52-48 మెజారిటీతో విజయం సాధిస్తారని విశ్లేషించింది.

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఇప్పటివరకు వెలువడిన ప్రధాన విజయాల లిస్ట్..

సెనెట్ విజేతలు:

జార్జియా: డెమోక్రాట్ జాన్ ఓసాఫ్ ఘన విజయం సాధించి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 2024 ప్రెసిడెన్షియల్ రేస్‌లో ట్రంప్ ఇక్కడ స్వల్ప ఆధిక్యం సాధించినప్పటికీ, ఇప్పుడు ఓసాఫ్ గెలవడం గమనార్హం.

న్యూహాంప్‌షైర్: డెమోక్రాట్ క్రిస్ పప్పాస్, రిపబ్లికన్ జాన్ ఈ. సునునూపై గెలుపొందారు.

నార్త్ కరోలినా: డెమోక్రాట్ రాయ్ కూపర్ రికార్డు విజయం సాధించి సెనెట్ సీటును కైవసం చేసుకున్నారు.

ఇతర సెనెట్ విజేతలు: క్రిస్ కూన్స్ (డెలావేర్ - డెమోక్రాట్), కోరీ బుకర్ (న్యూజెర్సీ - డెమోక్రాట్), జూలియానా స్ట్రాటన్ (ఇల్లినోయ్ - డెమోక్రాట్), ఎడ్వర్డ్ మార్కీ (మాసాచుసెట్స్ - డెమోక్రాట్), జాన్ రీడ్ (రోడ్ ఐలాండ్ - డెమోక్రాట్), జాన్ హికెన్‌లూపర్ (కొలరాడో - డెమోక్రాట్), బెన్ లుజాన్ (న్యూమెక్సికో - డెమోక్రాట్). రిపబ్లికన్ల తరఫున ఆష్లే మూడీ (ఫ్లోరిడా), హ్యారియెట్ హాగ్మాన్ (వ్యోమింగ్) విజయం సాధించారు.

ప్రతినిధుల సభలో భారతీయ అమెరికన్ల హవా:

వర్జీనియా 10వ నియోజకవర్గం: మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా సలహాదారుగా పనిచేసిన భారతీయ అమెరికన్ సుహాస్ సుబ్రమణ్యం ప్రతినిధుల సభకు ప్రతిష్టాత్మకంగా తిరిగి ఎన్నికయ్యారు.

ముఖ్య ప్రతినిధులు: డెమోక్రాట్ల తరఫున కొలిన్ ఆల్‌రెడ్ (టెక్సాస్), జోక్విన్ కాస్ట్రో (టెక్సాస్), గ్రెగొరీ మీక్స్ (న్యూయార్క్), ప్యాట్ ర్యాన్ (న్యూయార్క్), జెన్నిఫర్ మెక్‌క్లెల్లన్ (వర్జీనియా) గెలవగా.. రిపబ్లికన్ల తరఫున జిమ్ జోర్డాన్ (ఒహియో), జేమ్స్ కోమర్ (కెంటకీ), కార్లోస్ గిమెనెజ్ (ఫ్లోరిడా) విజయం సాధించారు.

గవర్నర్ పదవుల ఫలితాలు:

ఫ్లోరిడా చరిత్ర: ఫ్లోరిడా రాష్ట్ర తొలి నల్లజాతీయుడైన రిపబ్లికన్ అభ్యర్థి బైరాన్ డొనాల్డ్స్ గవర్నర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు.

ఇతర గవర్నర్లు: జేబీ ప్రిట్జ్కర్ (ఇల్లినోయ్ - డెమోక్రాట్), మౌరా హీలీ (మాసాచుసెట్స్ - డెమోక్రాట్), వెస్ మూర్ (మేరీల్యాండ్ - డెమోక్రాట్), జోష్ షాపిరో (పెన్సిల్వేనియా - డెమోక్రాట్), కాథీ హోచుల్ (న్యూయార్క్ - డెమోక్రాట్) విజయం సాధించారు.

ఫలితాలను ట్రంప్ అంగీకరిస్తారా? తీవ్ర అనుమానాలు!

ఒకవేళ ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఓటమి ఎదురైతే ట్రంప్ దానిని అంగీకరించరనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం ఓటర్లను ఉద్దేశించి 'ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్' ఛానెల్‌లో మాట్లాడిన ట్రంప్.. వలసదారులపై కఠిన చర్యలు, ఇరాన్ యుద్ధం, సుంకాల విధించడం ద్వారా తానే అమెరికాను గొప్పగా మార్చానని సమర్థించుకున్నారు.

2020 ప్రెసిడెన్షియల్ ఎన్నికల ఫలితాలను తిరగరాయడానికి ప్రయత్నించిన ట్రంప్, ఈసారి కూడా (ఎటువంటి ఆధారాలు లేకుండా) డెమోక్రాట్లు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. న్యూయార్క్ రాష్ట్రంలోని ఒక నియోజకవర్గంలో ఓటింగ్ యంత్రాలు సాంకేతిక లోపానికి గురవ్వడంతో రైట్-వింగ్ మీడియా దానికి అక్రమాల రంగు పులిమే ప్రయత్నం చేసింది. అయితే అధికారులు బ్యాలెట్లన్నీ పారదర్శకంగా లెక్కిస్తామని స్పష్టం చేశారు.

మొత్తానికి అమెరికా పార్లమెంట్ తీర్పు ట్రంప్ రాజకీయాన్ని ఏ మలుపు తిప్పుతుందో తేలడానికి మరో కొన్ని గంటల సమయం పట్టనుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks