పుతిన్‌తో ట్రంప్ దూతల భేటీ.. ఉక్రెయిన్ శాంతి చర్చల్లో కీలక మలుపు

అబుదాబిలో రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చల అనంతరం అమెరికా దూతలు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ మాస్కో చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో క్రెమ్లిన్‌లో భేటీ అయ్యారు. ఖైదీల మార్పిడిపై ఒప్పందం కుదిరినా, యుద్ధ విరమణపై ప్రతిష్టంభన కొనసాగుతోంది.

Published on: Nov 12, 2026, 16:50:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

మాస్కో: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా తన దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక దూతలు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ గురువారం రష్యా రాజధాని మాస్కోలోని క్రెమ్లిన్‌కు చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో వీరు కీలక చర్చలు జరపనున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిలో అమెరికా మధ్యవర్తిత్వంతో రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య రెండు రోజుల పాటు సాగిన చర్చల అనంతరం ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

రష్యా దాడిలో దెబ్బతిన్న కీవ్ లోని ఒక అపార్ట్‌మెంట్ (AP Photo/Efrem Lukatsky)
రష్యా దాడిలో దెబ్బతిన్న కీవ్ లోని ఒక అపార్ట్‌మెంట్ (AP Photo/Efrem Lukatsky)

ఈ ఏడాది శాంతి ప్రయత్నాలు నిలిచిపోయిన నేపథ్యంలో, తొమ్మిది నెలల విరామం తర్వాత రష్యా, ఉక్రెయిన్ అధికారులు అబుదాబిలో తొలిసారి ముఖాముఖి చర్చలు జరిపారు. బుధవారం ముగిసిన ఈ చర్చల్లో భారీ ఎత్తున యుద్ధ ఖైదీల మార్పిడికి ఇరుపక్షాలు అంగీకరించాయి. అయితే ఎంతమందిని మార్చుకోవాలనే సంఖ్యపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 2014లో తూర్పు ఉక్రెయిన్‌లో మొదలైన ఘర్షణలు, 2022 ఫిబ్రవరి 24న పూర్తిస్థాయి యుద్ధంగా మారి దాదాపు ఐదేళ్లు కావస్తున్నాయి. ఈ సుదీర్ఘ యుద్ధాన్ని ఆపడంలో అబుదాబి చర్చలు తక్షణ పురోగతిని సాధించలేకపోయాయి. అయినప్పటికీ, దౌత్య ప్రక్రియలో వేగం తగ్గకూడదనే ఉద్దేశంతో కుష్నర్, విట్కాఫ్ నేరుగా క్రెమ్లిన్‌కు పయనమయ్యారు.

చర్చల్లో ఐరోపా భాగస్వామ్యంపై అమెరికా పట్టు

ఐరోపా ఖండం విస్తృత భద్రతా ఏర్పాట్లపై జరుగుతున్న ఈ చర్చల్లో ఐరోపా దేశాల ప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలని అమెరికా భావిస్తోంది. ఇందుకు పుతిన్ ఆమోదం పొందడమే తమ పర్యటన ప్రధాన లక్ష్యాలలో ఒకటని కుష్నర్ స్పష్టం చేశారు. మాస్కోతో చర్చలు జరిపేందుకు ఐరోపా దేశాలన్నీ కలిసి ఒకే ప్రతినిధిని నియమించాలని అమెరికాతో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరుకుంటున్నారు.

అయితే, నేరుగా జరిగే చర్చల్లో ఐరోపా దేశాలను చేర్చుకోవడానికి రష్యా ససేమిరా అంటోంది. ఐరోపా ఖండంలో రష్యా వ్యవహారశైలి, ఉద్దేశాలపై ఆయా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్‌కు ఐరోపా దేశాలు ఆర్థిక సాయం చేయడంతో పాటు ఆయుధాలను సరఫరా చేస్తున్నాయని, శాంతి ఒప్పందం కుదరకుండా అడ్డుపడుతున్న సమస్యల్లో అవి కూడా భాగమేనని మాస్కో ఆరోపిస్తోంది. మరోవైపు, ఐరోపా భద్రతపై జరిగే చర్చల్లో రష్యాను చేర్చుకోవడం పుతిన్‌కు అనవసరపు రాయితీలు ఇవ్వడమేనని పలు ఐరోపా దేశాలు భావిస్తున్నాయి.

నాటో కూటమి తూర్పు దిశగా విస్తరించడాన్ని తమ దేశ భద్రతకు అతిపెద్ద ముప్పుగా పుతిన్ అభివర్ణిస్తూ, రష్యా సరిహద్దుల నుంచి నాటో దళాలను వెనక్కి పిలవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉక్రెయిన్‌లో శాంతి కోసం నాటో వ్యూహాల విషయంలో రష్యాకు కొన్ని రాయితీలు ఇచ్చేందుకు మధ్యవర్తులు మొగ్గు చూపవచ్చని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామం ఐరోపా ప్రభుత్వాలను కలవరపెడుతోంది.

పుతిన్‌తో సమావేశం ముగిసిన తర్వాత, తాను, విట్కాఫ్ కలిసి గురువారం సాయంత్రమే ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌కు వెళ్లనున్నట్లు కుష్నర్ తెలిపారు. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో పాటు 40కి పైగా ఐరోపా దేశాల ప్రతినిధులు పాల్గొంటున్న సదస్సుకు హాజరవుతున్న జెలెన్‌స్కీతో అక్కడ వారు భేటీ అవుతారు.

రాజకీయ మార్పులే శాంతికి సువర్ణావకాశం: జెలెన్‌స్కీ

అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల తర్వాత జనవరిలో డెమోక్రాట్లు యూఎస్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం, వచ్చే ఏడాది ఫ్రాన్స్‌లో జరగనున్న ఎన్నికలు వంటి రాజకీయ పరిణామాలు శాంతి ఒప్పందానికి ఒక 'సువర్ణావకాశం' కల్పిస్తాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభిప్రాయపడ్డారు.

"2027లో ఐరోపా రాజకీయ ముఖచిత్రం మారవచ్చు... అమెరికాలోనూ ఇప్పటికే మార్పులు చోటుచేసుకోవడం మనం చూస్తున్నాం. 2027 కంటే ముందే ఒక ఫలితాన్ని సాధించాలని చర్చల ప్రక్రియలో ఉన్న వారంతా నిజంగా కోరుకుంటున్నారు. కాబట్టి నేడు నిజంగానే ఒక అనుకూల సమయం, సువర్ణావకాశం అందుబాటులో ఉంది" అని బుధవారం రాత్రి డబ్లిన్‌లో జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

ఖైదీల మార్పిడి ప్రతిపాదన సానుకూల అడుగు అని ప్రశంసించిన ఆయన, శాంతి కోసం రష్యా ఆక్రమించిన తమ భూభాగాలను వదులుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అబుదాబి చర్చల్లో పెద్దగా పురోగతి ఉంటుందనే అంచనాలు మొదటి నుంచీ తక్కువగానే ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్ అప్పుడప్పుడు ఖైదీలను మార్చుకుంటున్నప్పటికీ, శాంతి ఒప్పంద షరతుల విషయంలో ఇరుదేశాల మధ్య భారీ అంతరం కొనసాగుతోంది. యుద్ధానంతర భద్రతా హామీలతో పాటు రష్యా ఆక్రమణలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాల భవితవ్యం ఒప్పందానికి ప్రధాన అడ్డంకులుగా మారాయి.

చలికాలం సమీపిస్తున్నా ఆగని దాడులు

మరోవైపు, 1,200 కిలోమీటర్ల (సుమారు 750 మైళ్లు) పొడవైన యుద్ధక్షేత్రం వెంబడి పోరాటం తీవ్రంగా కొనసాగుతోంది. శాంతి స్థాపనకు ఇంకా సుదీర్ఘ సమయం పడుతుందని మధ్యవర్తులు హెచ్చరిస్తున్నారు. యుద్ధభూమిలో ఉక్రెయిన్ సేనల గట్టి ప్రతిఘటనతో రష్యా భారీ సైన్యం ముందుకు కదలలేకపోతోంది. దీంతో సామాన్య ప్రజలకు వేడి, విద్యుత్, తాగునీటి సరఫరాను నిలిపివేసి వారి మనోధైర్యాన్ని దెబ్బతీసేలా రష్యా వ్యూహాత్మక బాంబు దాడులకు పాల్పడుతోంది. దీనిని 'చలికాలాన్ని ఆయుధంగా వాడుకోవడం' అని కీవ్ అభివర్ణిస్తోంది.

ఇరుదేశాలు సుదూర శ్రేణి క్షిపణులు, డ్రోన్లతో పరస్పరం విరుచుకుపడుతున్నాయి. రాత్రిపూట 71 ఉక్రెయిన్ డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని ఒక డ్రోన్ తయారీ కర్మాగారంతో పాటు ఆ ప్రాంతంలో క్షిపణి ఇంధనం, డ్రోన్ విడిభాగాలు తయారు చేసే మరో మూడు కేంద్రాలపై తమ దళాలు దాడులు చేశాయని తెలిపింది. జైటోమిర్‌లోని విద్యుత్ సబ్‌స్టేషన్లు, ఉక్రెయిన్ సాయుధ దళాల కోసం సరుకులతో నల్ల సముద్రంలోని ఒడెసా ఓడరేవుకు వెళ్తున్న ఒక భారీ నౌకపైనా దాడులు జరిపినట్లు వెల్లడించింది.

సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో కారు బాంబు పేలుడు.. రష్యా కల్నల్ మృతి

రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరంలో గురువారం తెల్లవారుజామున జరిగిన కారు బాంబు పేలుడులో ఒక సైనికాధికారి మృతి చెందారు. ఈ ఘటనను రష్యా ప్రధాన నేర పరిశోధన సంస్థ 'ఇన్వెస్టిగేటివ్ కమిటీ' ధ్రువీకరించింది. అయితే మృతుడి పేరును కానీ, ఈ దాడి వెనుక ఎవరున్నారనే వివరాలను కానీ వెల్లడించలేదు. మరణించిన వ్యక్తి కల్నల్ స్థాయి అధికారి అని, ఆయన కారు నడుపుతూ బయలుదేరిన సమయంలో అందులోని పేలుడు పదార్థం పేలిపోయిందని 'ఫోంటాంకా' వార్తా సంస్థ పేర్కొంది. గతంలోనూ పలువురు సీనియర్ రష్యా అధికారులు బాంబు పేలుళ్లు, ఇతర దాడుల్లో మరణించారు. ఈ దాడులకు ఉక్రెయినే కారణమని రష్యా ఆరోపిస్తుండగా, రష్యా గడ్డపై జరిగిన కొన్ని దాడులకు తామే బాధ్యులమని కీవ్ ప్రకటించుకుంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More