అమెరికా వీసా నిబంధనల్లో మార్పులు: సోషల్ మీడియా ఖాతాలు పబ్లిక్ చెయ్యాల్సిందే

అమెరికా నాన్-ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులకు సోషల్ మీడియా స్క్రీనింగ్ నిబంధనలను విస్తరిస్తూ ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి ఐ, టీఎన్, టీడీ వీసా కేటగిరీల దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైళ్లను అందరికీ కనిపించేలా 'పబ్లిక్'లో ఉంచడం తప్పనిసరి చేశారు.

Published on: Oct 1, 2026, 15:45:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

అమెరికా పర్యటనకు వెళ్లాలనుకునే నాన్-ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులపై విదేశాంగ శాఖ తనిఖీలను మరింత కఠినతరం చేసింది. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం మరో మూడు వీసా కేటగిరీలను సోషల్ మీడియా స్క్రీనింగ్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ విభాగానికి చెందిన దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాల ప్రైవసీ సెట్టింగులను 'పబ్లిక్' లేదా 'ఓపెన్'గా మార్చాలని ఆదేశించారు.

అమెరికా వీసా నిబంధనల్లో మార్పులు: సోషల్ మీడియా ఖాతాలు పబ్లిక్ చెయ్యాల్సిందే
అమెరికా వీసా నిబంధనల్లో మార్పులు: సోషల్ మీడియా ఖాతాలు పబ్లిక్ చెయ్యాల్సిందే

కొత్తగా ఏ వీసాలు చేరాయి?

నూతన నిబంధనల ప్రకారం ప్రధానంగా మూడు వర్గాల దరఖాస్తుదారులు సోషల్ మీడియా తనిఖీలకు గురికానున్నారు. విదేశీ మీడియా ప్రతినిధులకు జారీ చేసే 'ఐ' (I) వీసా, యూఎస్ఎమ్‌సీఏ (USMCA) ఒప్పందం కింద కెనడా, మెక్సికో దేశాల నుంచి వచ్చే నిపుణులకు ఇచ్చే 'టీఎన్' (TN) వీసా, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఇచ్చే 'టీడీ' (TD) వీసాలు ఈ జాబితాలో చేరాయి. భద్రతా తనిఖీలను వేగవంతం చేసేందుకే సోషల్ మీడియా ఖాతాలను బహిరంగంగా ఉంచాలని సూచించినట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

ఇదివరకే అమల్లో ఉన్న విభాగాలు ఇవే..

సోషల్ మీడియా స్క్రీనింగ్ ప్రక్రియ అమెరికాలో కొత్తదేమీ కాదు. గతంలోనే అనేక వీసా విభాగాలకు ఇది వర్తిస్తోంది. విద్యార్థి వీసాలైన ఎఫ్ (F), ఎమ్ (M), తాత్కాలిక ఉద్యోగ వీసాలైన హెచ్-1బీ (H-1B), హెచ్-3 (H-3), ఎక్స్ఛేంజ్ విజిటర్ వీసా జే (J), నిశ్చితార్థం/కుటుంబ సభ్యుల వీసా కే (K)లతో పాటు క్యూ, ఆర్, ఎస్, టీ, యు వీసాల పరిధిలోని దరఖాస్తుదారులకు ఇదివరకే ఈ నిబంధనలు అమలు చేస్తున్నారు.

2019 నుంచే వీసా దరఖాస్తులలో సోషల్ మీడియా ఖాతాల వివరాలను సేకరిస్తున్నారు. దేశ భద్రత, ప్రజల రక్షణకు ముప్పు కలిగించే వారిని గుర్తించడానికే ఈ సమాచారాన్ని పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రతీ వీసా మంజూరు ప్రక్రియను జాతీయ భద్రతకు సంబంధించిన నిర్ణయంగానే పరిగణిస్తామని విదేశాంగ శాఖ పునరుద్ఘాటించింది.

'ఈఎస్టీఏ' ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత

మరోవైపు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ప్రతిపాదించిన ఇతర కఠిన స్క్రీనింగ్ నిబంధనలపై పర్యాటక రంగం, పౌర హక్కుల సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీసా వేవర్ ప్రోగ్రామ్ కింద వచ్చే 'ఈఎస్టీఏ' (ESTA) దరఖాస్తుదారులు తమ గత ఐదేళ్ల సోషల్ మీడియా వివరాలు, ఐదేళ్ల ఫోన్ నంబర్లు, పదేళ్ల ఈమెయిల్ ఐడీలు, దగ్గరి బంధువుల సమాచారాన్ని అందించాలని 2025 డిసెంబర్‌లో ప్రతిపాదించారు.

పర్యాటక రంగానికి దెబ్బేనా?

వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ (డబ్ల్యూటీటీసీ) నిర్వహించిన సర్వేలో మూడో వంతు అంతర్జాతీయ ప్రయాణికులు ఈ రకమైన కఠిన నిబంధనలు ఉంటే అమెరికా పర్యటనను విరమించుకుంటామని చెప్పారు. సోషల్ మీడియా సమాచారాన్ని సేకరించడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని డబ్ల్యూటీటీసీ ప్రెసిడెంట్ గ్లోరియా గెవారా పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ ఫ్రాంటియర్ ఫౌండేషన్ (ఈఎఫ్‌ఎఫ్) ప్రతినిధి సోఫియా కోప్ కూడా ఈ ప్రతిపాదన పౌర హక్కులకు విఘాతం కలిగిస్తుందని హెచ్చరించారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More