అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ రిపీట్! ఆసుపత్రిలో మారిపోయిన పిల్లలు- 36ఏళ్ల తర్వాత..
అమెరికాలో 36 ఏళ్ల క్రితం ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇద్దరు పసిబిడ్డలు మారిపోయారు. ఇటీవల డీఎన్ఏ పరీక్షతో ఈ షాకింగ్ నిజం వెలుగులోకి రావడంతో, బాధితులు సదరు హాస్పిటల్‌పై కోర్టులో భారీ దావా వేశారు.
కన్నబిడ్డలను కంటికి రెప్పలా చూసుకున్నారు.. 36 ఏళ్ల పాటు అపారమైన ప్రేమను పంచారు. కట్ చేస్తే.. తాము ఇంతకాలం పెంచిన బిడ్డ తమవాడు కాదని, తమ సొంత రక్తం వేరే ఎక్కడో పెరుగుతోందని తెలిసి ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలాయి! ఆసుపత్రి సిబ్బంది చేసిన ఒక్క పొరపాటు.. రెండు కుటుంబాల జీవితాలను పూర్తిగా మార్చేసింది. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన ఈ మైండ్ బ్లోయింగ్ ఘటన అమెరికాలోని నార్త్ డకోటాలో వెలుగుచూసింది.

నార్త్ డకోటాలోని గ్రాఫ్టన్ నగరంలో ఉన్న 'యూనిటీ మెడికల్ సెంటర్' ఆసుపత్రి నిర్వాకం వల్ల.. పుట్టినప్పుడే ఇద్దరు మగబిడ్డలు మారిపోయారు. ఈ ఘోర తప్పిదం వల్ల తాము వేరే కుటుంబాలలో పెరిగామంటూ బాధితులు సదరు ఆసుపత్రిపై ఇప్పుడు కోర్టులో కేసు దాఖలు చేసినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ 'ఫాక్స్ న్యూస్' వెల్లడించింది.
ఈ ఘోర పొరపాటు గత 36 సంవత్సరాలుగా ఎవరికీ తెలియకుండా దాగి ఉండటం గమనార్హం.
1988 జనవరి 26న ఏం జరిగింది?
కోర్టు పత్రాల ప్రకారం.. ఈ విచిత్ర సంఘటన 1988 జనవరి 26న జరిగింది. ఆ రోజు ఆ మెడికల్ సెంటర్‌లో కేవలం ఇద్దరే ఇద్దరు మగశిశువులు జన్మించారు. వారిలో ఒకరు కైల్ బైలిన్, మరొకరు జెరెమీ మోరిసన్. అయితే, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే సమయంలో సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఒకరి బిడ్డను మరొకరి తల్లిదండ్రులకు అప్పగించి ఇళ్లకు పంపించేశారు!
నిజానికి జెరెమీ మోరిసన్‌గా పుట్టాల్సిన కైల్ బైలిన్ వద్ద ఇప్పటికీ తను పుట్టినప్పుడు ఆసుపత్రిలో వేసిన ఐడెంటిఫికేషన్ బ్రాస్‌లెట్ (చేతి పట్టీ) భద్రంగా ఉంది. దానిపై తప్పుడు పేరు రాసి ఉండటాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ 36 ఏళ్ల ప్రయాణంలో తాము మారిపోయామనే చిన్న అనుమానం కూడా ఆ ఇద్దరు యువకులకు రాలేదు. కాకపోతే, జెరెమీ మోరిసన్ మాత్రం తన కుటుంబంలో తానేదో విడిగా ఉంటున్నట్లు, అందరిలా లేనట్లు ఎప్పుడూ భావించేవారట.
డీఎన్ఏ టెస్టుతో ఊహించని మలుపు!
రెండు సంవత్సరాల క్రితం కైల్ బైలిన్ సరదాగా చేసుకున్న ఒక డీఎన్ఏ పరీక్షతో ఈ దశాబ్దాల నాటి రహస్యం ఒక్కసారిగా బద్దలైంది! ఆ టెస్ట్ రిజల్ట్స్‌లో ఆయనకు ఒక తెలియని మహిళతో బయోలాజికల్ మ్యాచ్ (రక్త సంబంధం) ఉన్నట్లు చూపించింది. ఆరా తీయగా ఆమె కైల్‌కు మేనత్త అవుతుందని తేలింది. దీనితో అనుమానం వచ్చి లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు నిజం బయటపడింది.
"మా కుటుంబంలో నాలాగే ఉండే వ్యక్తి ఒక్కరు కూడా లేరు. జుట్టు గోధుమ రంగులో ఉండే మా ఫ్యామిలీలో, నేను ఒక్కడినే కాస్త తెల్లటి జుట్టుతో విచిత్రంగా కనిపించేవాడిని," అని జెరెమీ మోరిసన్ తన గతాన్ని గుర్తుచేసుకున్నారు.
ప్రస్తుతం కొలరాడోలో నివసిస్తున్న మోరిసన్, ఆసుపత్రి చేసిన ఆ చిన్న తప్పు తన జీవిత గమనాన్నే మార్చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. "ఒకవేళ నేను నా సొంత తల్లిదండ్రుల వద్దకే వెళ్లి ఉంటే, కచ్చితంగా కొలరాడోలో ఉండేవాడిని కాదు. నార్త్ డకోటాలోనే ఉండి, మా సొంత పొలంలో పనులు చేసుకుంటూ ఉండేవాడిని," అని మోరిసన్ చెప్పారు.
ప్రస్తుతం ఈ ఇద్దరు యువకులు తమ తమ కన్నవారిని కలుసుకున్నారు. ఆ మొదటి కలయిక ఎంతో భావోద్వేగంగా, కాస్త ఇబ్బందికరంగా సాగిందని వారు వివరించారు. అయితే, ఇంతవరకు ఈ ఇద్దరు వ్యక్తులు మాత్రం ఒకరినొకరు ముఖాముఖి కలుసుకోకపోవడం గమనార్హం!
ఆసుపత్రి యాజమాన్యం సమాధానం ఏంటి?
ఈ వ్యవహారంపై అధికారికంగా కోర్టును ఆశ్రయించడానికి ముందు, నష్టపరిహారం విషయమై దాదాపు ఏడాది పాటు ఆసుపత్రితో ఈ రెండు కుటుంబాలు చర్చలు జరిపాయి. అయితే అక్కడ ఎలాంటి సయోధ్య కుదరకపోవడంతో నిరూపితమైన ఆధారాలతో న్యాయస్థానంలో దావా వేశారు.
ఈ వివాదంపై యూనిటీ మెడికల్ సెంటర్ స్పందిస్తూ.. ఈ నిజం వెలుగులోకి రావడం వల్ల ఆయా కుటుంబాలు అనుభవిస్తున్న మానసిక వేదనను తాము అర్థం చేసుకోగలమని పేర్కొంది. అయితే, దీనికి తాము బాధ్యులం కాదంటూ తేల్చేసింది. అంతేకాకుండా, ఈ కేసును పూర్తిగా కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించింది.
మరోవైపు ఆసుపత్రి చూపించిన నిర్లక్ష్యంపై ఇప్పుడు సోషల్ మీడియాలోనూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


