యూఎస్ మిడ్టెర్మ్స్ 2026: అమెరికా ఎన్నికల బరిలో భారత సంతతి దిగ్గజాలు
నవంబర్ 3న జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతి నాయకులు కీలక స్థానాలకు పోటీ పడుతున్నారు. ఫెడరల్ సభలు, గవర్నర్, అటార్నీ జనరల్, మేయర్ పీఠాల కోసం వివేక్ రామస్వామి, రో ఖన్నా, అరుణా మిల్లర్ సహా పలువురు నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
నవంబర్ 3, 2026న జరగనున్న అమెరికా మధ్యంతర (మిడ్‌టెర్మ్) ఎన్నికల సమరం ఊపందుకుంది. ఈ ఎన్నికలు అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండో విడత పాలనలో చివరి రెండేళ్ల అధికారాన్ని ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో తేల్చనున్నాయి. దాంతోపాటు అమెరికా రాజకీయాల్లో భారత సంతతి నేతల ప్రాతినిధ్యంపై ఈ పోలింగ్ స్పష్టత ఇవ్వనుంది. ఫెడరల్ స్థాయి నుంచి రాష్ట్ర, స్థానిక సంస్థల వరకు పలువురు ఇండో-అమెరికన్లు ఎన్నికల రంగంలోకి దిగారు.

అమెరికా కాంగ్రెస్‌లో బలబలాలు
ప్రస్తుతం యూఎస్ కాంగ్రెస్‌లోని రెండు సభల్లోనూ రిపబ్లికన్ పార్టీకే మెజారిటీ ఉంది. 435 స్థానాలున్న ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో రిపబ్లికన్లకు 219, డెమొక్రాట్లకు 214 స్థానాలు ఉండగా, రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇక 100 స్థానాలున్న సెనెట్‌లో రిపబ్లికన్లు 53 స్థానాలతో ఆధిక్యంలో ఉన్నారు.
ఈ మధ్యంతర ఎన్నికల్లో ప్రతినిధుల సభలోని అన్ని స్థానాలతో పాటు, 35 సెనెట్ స్థానాలకు, పలు రాష్ట్రాల గవర్నర్, మేయర్ పదవులకు పోలింగ్ జరగనుంది. కాలిఫోర్నియా, వాషింగ్టన్, వర్జీనియా, అరిజోనా, ఫ్లోరిడా, టెక్సాస్, ఒహియో, న్యూయార్క్, మేరీల్యాండ్ రాష్ట్రాల్లో భారత సంతతి అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ప్రతినిధుల సభ బరిలో డెమొక్రాట్లు
అమెరికా ప్రతినిధుల సభలో మళ్లీ విజయం సాధించేందుకు నలుగురు డెమొక్రాటిక్ ఇండో-అమెరికన్ ప్రజాప్రతినిధులు పోటీలో ఉన్నారు.
రో ఖన్నా (కాలిఫోర్నియా 17వ నియోజకవర్గం): సిలికాన్ వ్యాలీ ప్రాంతం కలిగిన ఈ స్థానం నుంచి రో ఖన్నా పోటీ చేస్తున్నారు. ఇక్కడ రిపబ్లికన్ అభ్యర్థిగా మరో భారత సంతతి నేత రితేష్ టాండన్ బరిలో ఉండటంతో ముఖాముఖి పోటీ నెలకొంది.
ప్రమీలా జయపాల్ (వాషింగ్టన్ 7వ నియోజకవర్గం): ప్రమీలా జయపాల్ మళ్లీ పోటీ చేస్తుండగా, రిపబ్లికన్ పార్టీ నుంచి భారత సంతతికి చెందిన నిరవ్ షేత్ ఆమెపై పోటీ పడుతున్నారు.
అమీ బెరా (కాలిఫోర్నియా 3వ నియోజకవర్గం): అమీ బెరా డెమొక్రాటిక్ అభ్యర్థిగా నిలబడి తన స్థానాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్నారు.
సుహాస్ సుబ్రమణ్యం (వర్జీనియా 10వ నియోజకవర్గం): ఉత్తర వర్జీనియా నుంచి సుహాస్ సుబ్రమణ్యం డెమొక్రాటిక్ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేస్తున్నారు.
వీరితో పాటు అరిజోనా 1వ నియోజకవర్గం నుంచి ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్యుడు, మాజీ రాష్ట్ర శాసనసభ్యుడు అమిష్ షా (డెమొక్రాట్) పోటీ పడుతున్నారు. ఈయన మాజీ ఎన్ఎఫ్ఎల్ క్రీడాకారుడైన రిపబ్లికన్ అభ్యర్థి జే ఫీలీని ఎదుర్కొంటున్నారు. ఫ్లోరిడా 22వ నియోజకవర్గం నుంచి డెమొక్రాట్ పియా దాండియా.. రిపబ్లికన్ అభ్యర్థి కేసీ అస్కర్ పై పోటీ చేస్తున్నారు.
మరోవైపు, ప్రైమరీ ఎన్నికల్లో ఇల్లినాయిస్ సెనెట్ రేసులో రాజా కృష్ణమూర్తి, మిచిగాన్ 13వ కాంగ్రెషనల్ నియోజకవర్గంలో శ్రీ థానేదార్ ఓటమి పాలయ్యారు.
గవర్నర్, అటార్నీ జనరల్ పదవుల కోసం తీవ్ర పోటీ
ఈ ఎన్నికల్లో అత్యంత ఆసక్తిరేపుతున్న రేసుల్లో ఒహియో గవర్నర్ స్థానం ఒకటి. బయోటెక్ పారిశ్రామికవేత్త, 2024 రిపబ్లికన్ ప్రాథమిక ప్రెసిడెన్షియల్ రేసులో నిలిచిన వివేక్ రామస్వామి.. ఒహియో గవర్నర్ పీఠం కోసం రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీకి దిగారు. డెమోక్రటిక్ అభ్యర్థి, మాజీ రాష్ట్ర ఆరోగ్య డైరెక్టర్ అమీ ఆక్టన్ను ఆయన ఎదుర్కొంటున్నారు. రామస్వామితో కలిసి రాబర్ట్ ఎ. మెక్కోలీ రన్నింగ్ మేట్‌గా ఉన్నారు.
న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవి కోసం రిపబ్లికన్ అభ్యర్థి సరితా కొమటిరెడ్డి.. డెమొక్రాటిక్ నేత లెటీషియా జేమ్స్‌కు సవాలు విసురుతున్నారు. అలాగే, హైదరాబాద్‌లో జన్మించిన మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్, గవర్నర్ వెస్ మోర్తో కలిసి మళ్లీ గెలిచేందుకు పోటీపడుతున్నారు.
లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో నిత్య రామన్
కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ మేయర్ పోరులో కేరళకు చెందిన డెమొక్రాట్ నిత్య రామన్ ఉన్నారు. ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ సిటీ కౌన్సిల్ సభ్యురాలైన నిత్య రామన్, రన్ ఆఫ్ రౌండ్లో ప్రస్తుత మేయర్ కరెన్ బాస్‌ను ఎదుర్కొంటున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే లాస్ ఏంజిల్స్ మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి దక్షిణాసియా మహిళగా నిత్య రామన్ ఘనత సాధిస్తారు.
అదేవిధంగా టెక్సాస్ అసెంబ్లీలోని 47వ నియోజకవర్గం నుంచి పూజా సేథీ, 66వ నియోజకవర్గం నుంచి సందీప్ శ్రీవాత్సవ (రిపబ్లికన్ అభ్యర్థి మ్యాట్ షాహీన్ పై) డెమొక్రాట్ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


