యూఎస్ మిడ్‌టర్మ్ ఎన్నికల్లో భారత సంతతి సత్తా: ప్రతినిధుల సభలో ఐదుగురి గెలుపు
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో (US Midterm Elections 2026) భారత సంతతికి చెందిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ఐదుగురు అభ్యర్థులు విజయం సాధించగా, మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా అరుణా మిల్లర్ మరోసారి గెలుపొందారు.
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో (US Midterms) భారత సంతతికి చెందిన ప్రతినిధులు తమ పొలిటికల్ సత్తాను చాటారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం ప్రతినిధుల సభకు (US House of Representatives) ఐదుగురు ఇండియన్-అమెరికన్లు విజయం సాధించగా, మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా అరుణా మిల్లర్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
గెలుపొందిన ప్రధాన భారత సంతతి విజేతల ప్రొఫైళ్లు ఇవే:
అమీ బెరా (కాలిఫోర్నియా)
కాలిఫోర్నియాలోని 3వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి డెమోక్రాటిక్ అభ్యర్థి అమీ బెరా (61) ప్రతినిధుల సభకు ఎనిమిదోసారి విజయం సాధించారు. రిపబ్లికన్ అభ్యర్థి రాబ్ టక్కర్‌పై ఆయన విజయం సాధించారు. వృత్తిరీత్యా వైద్యనిపుణులైన అమీ బెరా 2012లో తొలిసారిగా కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు.
నేపథ్యం: గుజరాత్ నుంచి వచ్చి స్థిరపడిన వలసదారుల సంతానమైన బెరా, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (ఇర్విన్) నుంచి ఎంబీబీఎస్ పట్టా పొందారు.
బాధ్యతలు: గతంలో శాక్రమెంటో కౌంటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేశారు. ప్రస్తుతం హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ, ఇంటెలిజెన్స్ కమిటీలలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. భారత్-అమెరికా సంబంధాల బలోపేతంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
సుహాస్ సుబ్రమణ్యం (వర్జీనియా)
వర్జీనియాలోని 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి డెమోక్రాటిక్ ప్రతినిధి సుహాస్ సుబ్రమణ్యం (40) రెండోసారి విజయం సాధించారు. రిపబ్లికన్ అభ్యర్థి డేవ్ బెక్విత్ను ఓడించి ఆయన తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
నేపథ్యం: టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో జన్మించిన సుహాస్ న్యాయవాది, వ్యాపారవేత్త. గతంలో బరాక్ ఒబామా హయాంలో వైట్‌హౌస్ టెక్నాలజీ పాలసీ అడ్వైజర్‌గా వ్యవహరించారు.
రాజకీయ ప్రయాణం: వర్జీనియా హౌస్ ఆఫ్ డెలిగేట్స్ (2019-2023), స్టేట్ సెనెట్ (2023-2024) సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది. స్వచ్ఛంద ఫైర్‌ఫైటర్‌గా, అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుడిగా సమాజ సేవ చేశారు.
రో ఖన్నా (కాలిఫోర్నియా)
సిలికాన్ వ్యాలీ కేంద్రంగా ఉన్న కాలిఫోర్నియా 17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి డెమోక్రాట్ ప్రతినిధి రో ఖన్నా (50) విజయం సాధించారు.
నేపథ్యం: పిలడెల్ఫియాలో జన్మించిన రో ఖన్నా తాత అమర్నాథ్ విద్యాశంకర్ భారత స్వాతంత్య్ర సమరయోధుడు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించారు.
రాజకీయ ప్రయాణం: కాంగ్రెషనల్ ప్రోగ్రెసివ్ కాకస్ వైస్ చైర్‌గా సేవలు అందిస్తున్న రో ఖన్నా, 2020లో బెర్నీ శాండర్స్ ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్‌కు కో-చైర్‌గా వ్యవహరించారు. జెఫ్రీ ఎప్స్టీన్ కేసు ఫైళ్లను బహిర్గతం చేయడంలో చురుగ్గా వ్యవహరించారు.
ప్రమీలా జయపాల్ (వాషింగ్టన్)
వాషింగ్టన్‌లోని 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ (సీటెల్ పరిసర ప్రాంతాలు) నుంచి డెమోక్రాటిక్ నాయకురాలు ప్రమీలా జయపాల్ మరోసారి విజయం సాధించారు.
నేపథ్యం: 1965లో చెన్నైలో జన్మించిన ప్రమీల, 16 ఏళ్ల వయస్సులో అమెరికా వెళ్లి జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు. నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.
రికార్డు: యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో అడుగుపెట్టిన తొలి దక్షిణాసియా-అమెరికన్ మహిళగా 2016లో రికార్డు సృష్టించారు. వలసదారుల హక్కులు, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక సమానత్వంపై నిరంతరం గళం విప్పుతున్నారు.
పియా దాండియా (ఫ్లోరిడా)
ఫ్లోరిడాలోని 22వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి డెమోక్రాటిక్ అభ్యర్థి పియా దాండియా సంచలన విజయం సాధించారు. రిపబ్లికన్ అభ్యర్థి కేసీ అస్కార్‌ను ఓడించి ఆమె తొలిసారిగా యూఎస్ కాంగ్రెస్‌లో అడుగుపెడుతున్నారు.
నేపథ్యం: పామ్ బీచ్ కౌంటీలో భారతీయ వలస దంపతులకు జన్మించిన పియా, గతంలో ఉపాధ్యాయురాలిగా, హార్లెమ్‌లో హైస్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు.
అనుభవం: వైట్‌హౌస్ ఫెలోగా, యాపిల్ (Apple) టెక్నాలజీ సంస్థలో సేవలందించారు. పేద పిల్లలకు ఉన్నత విద్య, ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక పాఠశాలను స్థాపించారు.
అరుణా మిల్లర్ (మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్)
మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా డెమోక్రాటిక్ నాయకురాలు అరుణా మిల్లర్ (61) గవర్నర్ వెస్ మూర్తో కలిసి రెండోసారి విజయం సాధించారు.
తెలుగు మూలాలు: ఆంధ్రాప్రదేశ్‌లో జన్మించిన అరుణ, 7 ఏళ్ల వయస్సులో కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లారు. మిస్సోరీ యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.
ప్రత్యేకత: పొలిటికల్ కెరీర్‌కు ముందు 25 ఏళ్ల పాటు సివిల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీర్‌గా పనిచేశారు. మేరీల్యాండ్‌లో లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి వలసదారైన మహిళగా రికార్డు సృష్టించారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


