గంగోత్రిలో అన్యమతస్థుల ప్రవేశంపై నిషేధం.. అదే దారిలో మిగిలిన ఆలయాలు

ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి పుణ్యక్షేత్రంలో అన్యమతస్థుల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఆలయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే దారిలో ఉత్తరాఖండ్‌లోని పలు ఆలయ బోర్డులు నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

Published on: Jan 26, 2026, 14:55:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link
గంగోత్రిలో అన్యమతస్థుల ప్రవేశంపై నిషేధం.. అదే దారిలో మిగిలిన ఆలయాలు (Rameshwar Gaur)
గంగోత్రిలో అన్యమతస్థుల ప్రవేశంపై నిషేధం.. అదే దారిలో మిగిలిన ఆలయాలు (Rameshwar Gaur)

ఉత్తరాఖండ్ లోని పవిత్ర పుణ్యక్షేత్రాల పౌరాణిక వైభవాన్ని, సనాతన ధర్మ సంప్రదాయాలను కాపాడే దిశగా అక్కడి ఆలయ కమిటీలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దేవభూమిగా పిలుచుకునే ఈ ప్రాంతంలోని ప్రముఖ ఆలయాల్లోకి అన్యమతస్థుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించాలని అధికారులు భావిస్తున్నారు.

గంగోత్రి ధామ్ లో కఠిన నిబంధనలు

గంగోత్రి ఆలయ కమిటీ ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఒక కీలక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. "గంగోత్రి ధామ్ లోకి అన్యమతస్థుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తున్నాం" అని గంగోత్రి ఆలయ కమిటీ అధ్యక్షుడు సురేష్ సెమ్వాల్ స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు కేవలం గంగోత్రి ధామ్ కే పరిమితం కాకుండా, శీతాకాలంలో గంగామాత కొలువై ఉండే 'ముఖ్బా' ప్రాంతానికి కూడా వర్తిస్తాయని ఆయన వివరించారు.

బద్రీనాథ్ - కేదార్‌నాథ్ ఆలయాల్లోనూ ఇదే బాట

శ్రీ బద్రీనాథ్–కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTC) కూడా ఇదే దిశగా అడుగులు వేస్తోంది. తమ పరిధిలోకి వచ్చే 45 ఆలయాల్లోకి అన్యమతస్థుల ప్రవేశాన్ని నిషేధించాలని కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు రానున్న బోర్డు సమావేశంలో అధికారికంగా ప్రతిపాదనను ప్రవేశపెట్టనున్నట్లు BKTC అధ్యక్షుడు హేమంత్ ద్వివేది తెలిపారు.

"దేవభూమి ఉత్తరాఖండ్ యొక్క మతపరమైన, సాంస్కృతిక సంప్రదాయాలను కాపాడటం మాకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. గతంలో బీజేపీయేతర ప్రభుత్వాల హయాంలో ఈ పురాతన సంప్రదాయాలు ఉల్లంఘనకు గురయ్యాయి. ఈ పవిత్ర క్షేత్రాల పవిత్రతను కాపాడేందుకు, శతాబ్దాల నాటి ఆచారాలను పకడ్బందీగా అమలు చేసేందుకు ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్నాం" అని హేమంత్ ద్వివేది పేర్కొన్నారు.

హరిద్వార్‌ 'హర్ కీ పౌడీ' వద్ద హెచ్చరిక బోర్డులు

మరోవైపు, హరిద్వార్‌లోని సుప్రసిద్ధ గంగా ఘాట్ 'హర్ కీ పౌడీ' వద్ద 'అన్యమతస్థులకు ప్రవేశం లేదు' అనే బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. గంగా సభ ఆధ్వర్యంలో ఈ బోర్డులను ఘాట్‌కు వెళ్లే దారుల్లో, వంతెనల పిల్లర్లపై ఏర్పాటు చేశారు. అయితే, 1916 నాటి హరిద్వార్ మున్సిపల్ చట్టం ప్రకారం హర్ కీ పౌడీ ప్రధాన ఘాట్ లోకి అన్యమతస్థుల ప్రవేశంపై అప్పట్లోనే నిషేధం ఉందని గంగా సభ అధ్యక్షుడు నితిన్ గౌతమ్ గుర్తు చేశారు. ప్రజలకు ఈ నిబంధన గురించి అవగాహన కల్పించేందుకే ఇప్పుడు బోర్డులు పెట్టామని మున్సిపల్ కమిషనర్ నందన్ కుమార్ కూడా ధృవీకరించారు.

వివాదానికి కారణమైన ఆ వైరల్ వీడియో

ఈ నిర్ణయాల వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. మూడు రోజుల క్రితం అరబ్ దేశస్తుల ఆహార్యం (కందూరా) ధరించిన ఇద్దరు యువకులు హర్ కీ పౌడీ పరిసరాల్లో తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పోలీసుల విచారణలో ఆ ఇద్దరు యువకులు హిందువులేనని, కేవలం తమ యూట్యూబ్ ఛానెల్ కోసం వీడియోలు షూట్ చేసేందుకు అలా వేషధారణ మార్చారని తేలింది. ఈ ఘటన తర్వాత, వచ్చే ఏడాది జరగనున్న 'అర్ధకుంభమేళా' నాటికి హరిద్వార్‌లోని అన్ని ఘాట్లు, ఆలయాల్లో అన్యమతస్థుల ప్రవేశంపై శాశ్వత నిషేధం విధించాలని గంగా సభ డిమాండ్ చేస్తోంది. దీనిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా సీరియస్ గా ఆలోచిస్తోంది.

విపక్షాల విమర్శలు

ఈ పరిణామాలపై విపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇది కేవలం ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని ఆరోపించింది. "సాధారణంగానే అన్యమతస్థులు ఈ ఆలయాల్లోకి రారు. అలాంటప్పుడు ఇలాంటి అధికారిక నిషేధాల అవసరం ఏముంది? రాష్ట్రంలోని ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది," అని కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యకాంత్ ధస్మాన విమర్శించారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More