అమెరికాలో భారతీయ విద్యార్థికి 30 నెలల జైలు.. కారణమేంటంటే?

అమెరికాలో స్టూడెంట్ వీసాపై ఉన్న భారతీయుడు వెంకటేశ్వర చాగంరెడ్డికి యూఎస్ కోర్టు 30 నెలల జైలు శిక్ష విధించింది. వియత్నాం యుద్ధంలో పాల్గొన్న ఒక వృద్ధుడిని బురిడీ కొట్టించి పెద్ద మొత్తంలో బంగారం కాజేసిన కేసులో ఈ తీర్పు వెలువడింది.

Published on: Sep 11, 2026, 14:31:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఒక భారతీయ విద్యార్థి దారి తప్పి జైలు పాలయ్యాడు. వృద్ధులను లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయల దగాకు పాల్పడిన కేసులో యూఎస్ ఫెడరల్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో నివసిస్తున్న 37 ఏళ్ల వెంకటేశ్వర చాగంరెడ్డికి 30 నెలల (రెండున్నరేళ్లు) జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.

అమెరికాలో భారతీయ విద్యార్థికి 30 నెలల జైలు..
అమెరికాలో భారతీయ విద్యార్థికి 30 నెలల జైలు..

రూ.83 లక్షలకు పైగా పరిహారం చెల్లించాలని ఆదేశం

బాధితుడికి 99,496 డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.83 లక్షలు) నష్టపరిహారంగా చెల్లించాలని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ డి. రస్సెల్ ఆదేశించారు. జైలు శిక్ష, మూడేళ్ల పర్యవేక్షణ వ్యవధి (Supervised Release) పూర్తయిన తర్వాత వెంకటేశ్వర చాగంరెడ్డిని అమెరికా నుంచి డిపోర్ట్ (దేశం నుంచి పంపించివేయడం) చేసే అవకాశాలు ఉన్నాయని యూఎస్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ (డీఓజే) తెలిపింది.

మైక్రోసాఫ్ట్ సపోర్ట్ పేరిట పక్కా స్కెచ్

ఈ మోసం 2025 ఆగస్టులో ప్రారంభమైంది. వియత్నాం యుద్ధంలో పాల్గొన్న ఒక అమెరికన్ వృద్ధుడు సాంకేతిక సహాయం కోసం మైక్రోసాఫ్ట్ కస్టమర్ కేర్ అనుకుని ఒక నంబర్‌కు ఫోన్ చేశారు. ఆ అవతల ఉన్న సైబర్ నేరగాళ్లు ఆయన కంప్యూటర్‌లో చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయని భయపెట్టారు. ఆపై ఫెడరల్ అధికారి, ట్రెజరీ డిపార్ట్‌మెంట్ అధికారిగా నటిస్తూ వృద్ధుడికి మాయమాటలు చెప్పారు.

బ్యాంక్ ఖాతాలోని డబ్బు భద్రంగా ఉండాలంటే దానిని బంగారంగా మార్చి, తమ ప్రతినిధికి అప్పగించాలని ఆదేశించారు. వారి మాటలు నమ్మిన బాధితుడు బంగారాన్ని కొనుగోలు చేసి, దానికి సంబంధించిన ఫోటోలు పంపి, అధికారిగా వచ్చిన వ్యక్తికి బంగారంతో కూడిన ప్యాకెట్‌ను ఇచ్చేశారు.

పోలీసుల రెడ్ హ్యాండెడ్ ఆపరేషన్

కొద్ది రోజుల తర్వాత సదరు నేరగాళ్లు బాధితుడి నుంచి మరిన్ని నిధులు డిమాండ్ చేశారు. అనుమానం వచ్చిన వృద్ధుడు తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పగా, వారు వెంటనే డెలావేర్ కౌంటీ షెరీఫ్ ఆఫీస్ పోలీసులను ఆశ్రయించారు. నేరగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు ఒక వ్యూహాన్ని అమలు చేశారు.

పాత పద్ధతిలోనే బంగారం తీసుకెళ్లేందుకు వచ్చిన వెంకటేశ్వర చాగంరెడ్డిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన వాహనాన్ని తనిఖీ చేయగా 500 డాలర్ల నగదు, ఒక సెల్ ఫోన్, 23 ఔన్సుల బంగారం లభించాయి. చాగంరెడ్డి కేవలం ఒక్కరినే కాకుండా టెక్సాస్ నుంచి నార్త్ కరోలినా, కాన్సాస్, ఓక్లహామా వంటి పలు రాష్ట్రాల్లో పర్యటించి వృద్ధుల నుంచి బంగారం సేకరించినట్లు విచారణలో తేలింది. 2026 ఏప్రిల్‌లోనే ఆయనపై నేరం రుజువు కాగా, తాజాగా శిక్ష ఖరారైంది.

ఏటా బిలియన్ డాలర్ల దగా

"భయపెట్టడం, మోసం చేయడం ద్వారా వృద్ధులను లక్ష్యంగా చేసుకునే సైబర్ ముఠాల దారుణాలకు ఈ కేసు ఒక ఉదాహరణ" అని యూఎస్ అటార్నీ క్రిస్టోఫర్ జె. నాసర్ పేర్కొన్నారు. 2025లో వృద్ధులపై జరిగిన ఇటువంటి మోసాలపై డీఓజే తీవ్ర చర్యలు చేపట్టింది. సుమారు 600 మందికి పైగా నిందితులపై 280కి పైగా కేసులు నమోదు చేసి, 2.3 బిలియన్ డాలర్ల మేర దోపిడీకి గురైన సొత్తుపై దర్యాప్తు చేపట్టింది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More