సింగిల్​ ఛార్జ్​తో 460 కి.మీ కన్నా ఎక్కువ రేంజ్​! విన్​ఫాస్ట్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలపై బిగ్​ అప్డేట్​..

విన్​ఫాస్ట్ సంస్థ భారత మార్కెట్లో డెలివరీలను మొదలుపెట్టింది. తొలి మోడల్స్‌గా వీఎప్​6, వీఎఫ్​​7 వాహనాలను సరఫరా చేస్తోంది. తమిళనాడులోని తూత్తుకుడి ప్లాంట్‌లో అసెంబ్లింగ్ జరుగుతోంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 26, 2025 6:06 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీ సంస్థ విన్​ఫాస్ట్ భారత మార్కెట్‌లో అధికారికంగా తమ తొలి మోడళ్ల డెలివరీలను ప్రారంభించింది! ఈ సంస్థకు చెందిన వీఎఫ్​6, వీఎఫ్​7 మోడళ్లను వినియోగదారులకు అందజేసింది. సెప్టెంబర్ 2025లో భారత్‌లో ఈ బ్రాండ్‌ను ప్రారంభించిన కొన్ని వారాలకే డెలివరీలు మొదలయ్యాయి.

విన్​ఫాస్ట్​ ఎలక్ట్రిక్​ కార్లు..
విన్​ఫాస్ట్​ ఎలక్ట్రిక్​ కార్లు..

ఈ తొలి బ్యాచ్ ఎలక్ట్రిక్​ కార్లు ఇప్పటికే కొచ్చి, జైపూర్ వంటి పలు నగరాల్లోని కస్టమర్లకు చేరుకున్నాయి. భారత్‌లో తయారీ, రిటైల్, సర్వీస్ నెట్‌వర్క్‌ల గురించి సంస్థ తమ దీర్ఘకాలిక ప్రణాళికలను ఆవిష్కరించిన వెంటనే ఈ డెలివరీలు జరగడం గమనార్హం.

ఈ రెండు మోడళ్లను ప్రస్తుతం తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న వినఫాస్ట్ ఫ్యాక్టరీలో అసెంబ్లింగ్ చేస్తున్నారు. భారతదేశంలో స్థానిక ఉత్పత్తికి, అలాగే ఉపఖండంలోని ఇతర మార్కెట్లకు ఎగుమతి చేయడానికి తూత్తుకుడి ప్లాంట్ వినఫాస్ట్‌కు ప్రధాన కేంద్రంగా మారుతుంది.

విన్​ఫాస్ట్ వీఎఫ్​6: ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..

విన్​ఫాస్ట్ వీఎఫ్6 అనేది కాంపాక్ట్ ఎలక్ట్రిక్​ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోకి వస్తుంది. రూ. 20 లక్షల లోపు బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు, మంచి రేంజ్‌ను ఆశించే యువ నగర కొనుగోలుదారులను ఇది లక్ష్యంగా చేసుకుంది.

వీఎఫ్6 ఎక్స్​షోరూమ్ ధరలు రూ. 16.49 లక్షల నుంచి రూ. 18.29 లక్షల వరకు ఉన్నాయి. ఇది ఎర్త్, విండ్, విండ్ ఇన్ఫినిటీ అనే మూడు ట్రిమ్స్‌లో లభిస్తుంది. ఈ వాహనంలో 59.6 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉంటుంది. దీనికి అమర్చిన ఫ్రంట్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ 201 హెచ్‌పీ పవర్, 310 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

విన్​ఫాస్ట్ ప్రకారం వీఎఫ్6 ఎలక్ట్రిక్​ కారును ఒకసారి ఛార్జ్ చేస్తే 468 కి.మీ రేంజ్ ఇస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా 10 శాతం నుంచి 70 శాతం ఛార్జింగ్ కేవలం 25 నిమిషాల్లో పూర్తవుతుంది! అంతేకాదు ఈ ఎస్‌యూవీ 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని 8.9 సెకన్లలో చేరుకుంటుంది. ఇది పట్టణ, హైవే డ్రైవింగ్‌కు సరిపోతుంది.

ఈ కారు లోపల అధునాతనంగా, ఫీచర్లతో నిండి ఉంటుంది. 12.9-ఇంచ్​ టచ్‌స్క్రీన్, హెడ్-అప్ డిస్‌ప్లే, ఎయిర్ ప్యూరిఫైయర్, 360° కెమెరా, అడాస్​ సేఫ్టీ సూట్ దీని ప్రత్యేకతలు. ఇందులో ప్రామాణికంగా ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. విన్​ఫాస్ట్ తమ ఉత్పత్తిపై నమ్మకాన్ని తెలియజేస్తూ 7 సంవత్సరాలు లేదా 1.60 లక్షల కిమీ వారంటీని, ప్రారంభ ఆఫర్‌గా ఛార్జింగ్ బెనిఫిట్ ప్యాకేజీని అందిస్తోంది!

విన్​ఫాస్ట్ వీఎఫ్7: ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..

విన్​ఫాస్ట్ వీఎఫ్7 అనేది వీఎఫ్​6 కంటే ఒక సెగ్మెంట్ ఎక్కువైన మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఎక్కువ శక్తి, మెరుగైన రేంజ్, విశాలమైన స్థలం కోరుకునే కొనుగోలుదారులను ఇది టార్గెట్ చేస్తుంది. దీని ఎక్స్​షోరూమ్ ధర రూ. 20.89 లక్షల నుంచి రూ. 25.49 లక్షల వరకు ఉంది.

ఈ ఎలక్ట్రిక్​ కారులో ఎర్త్, విండ్, విండ్ ఇన్ఫినిటీ, స్కై, స్కై ఇన్ఫినిటీ అనే ఐదు ట్రిమ్స్ అందుబాటులో ఉన్నాయి.

వీఎఫ్7 రెండు బ్యాటరీ ప్యాక్‌లలో (59.6 కేడబ్ల్యూహెచ్​, 70.8 కేడబ్ల్యూహెచ్​) లభిస్తుంది. వీటి రేంజ్​ 468 కి.మీ నుంచి 530 కి.మీ మధ్యలో ఉంటుంది. అలాగే 2డబ్ల్యూడీ లేదా ఏడబ్ల్యూడీ (ఆల్-వీల్-డ్రైవ్) డ్రైవ్‌ట్రెయిన్‌లను ఎంచుకోవచ్చు.

పవర్ అవుట్‌పుట్ తక్కువ వేరియంట్‌లో 175 హెచ్‌పీ (250 ఎన్ఎమ్) నుంచి ఏడబ్ల్యూడీ వేరియంట్‌లో అత్యధికంగా 350 హెచ్‌పీ (500 ఎన్ఎమ్) వరకు ఉంటుంది.

టాప్-రేంజింగ్ వీఎఫ్7 కేవలం 5.8 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట రేంజ్ 510 కిమీ వరకు ఉంటుంది.

వీఎఫ్6 మాదిరిగానే, వీఎఫ్7 కూడా లగ్జరీతో కూడిన, సాంకేతికతతో నిండిన ఇంటీరియర్‌ను కలిగి ఉంది. కనెక్టెడ్ ఫంక్షన్లు, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, అడాస్​, టాప్ ట్రిమ్స్‌లో పనోరమిక్ సన్‌రూఫ్ దీని ప్రత్యేకతలు. ఈ మోడల్‌కు కూడా 10 సంవత్సరాలు లేదా 2 లక్షల కి.మీల వారంటీ లభిస్తుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More