కెనడాలో నివసిస్తున్న విదేశీయులకు రానున్న రోజులు అత్యంత సవాలుతో కూడుకున్నవిగా మారనున్నాయి. అక్కడ లక్షలాది మంది వర్క్ పర్మిట్ వీసా గడువు ముగుస్తుండటంతో, అక్రమ వలసదారుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి. వీరిలో దాదాపు సగం మంది భారతీయులే ఉంటారని అంచనా.
ఇమ్మిగ్రేషన్ నిపుణుడు కన్వర్ సెయిరా.. 'ఇమ్మిగ్రేషన్, రిఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా' (ఐఆర్సీసీ) నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. 2025 చివరి నాటికి సుమారు 10.53 లక్షల వర్క్ పర్మిట్ల గడువు ముగిసింది. 2026లో మరో 9.27 లక్షల పర్మిట్లు ముగియనున్నాయి. మిస్సిసాగాకు చెందిన సెయిరా ఈ వివరాలను హిందుస్థాన్ టైమ్స్‌తో పంచుకున్నారు.
ముగుస్తున్న గడువు.. పెరుగుతున్న ఆంక్షలు..
సాధారణంగా వర్క్ పర్మిట్ గడువు ముగిసిన తర్వాత, సదరు వ్యక్తి మరో వీసా పొందడమో లేదా శాశ్వత నివాస హోదా (పీఆర్)కు మారడమో చేయాలి. లేదంటే వారు చట్టబద్ధమైన హోదా కోల్పోతారు. అయితే, ప్రస్తుతం కెనడా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేస్తోంది. ముఖ్యంగా తాత్కాలిక కార్మికులు, అంతర్జాతీయ విద్యార్థుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. దీనివల్ల వలసదారులు తమ స్టేటస్‌ని పునరుద్ధరించుకోవడం క్లిష్టతరంగా మారింది.
"కెనడా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంత భారీ సంఖ్యలో ప్రజలు తమ చట్టబద్ధమైన హోదాను కోల్పోయే పరిస్థితి వచ్చింది," అని సెయిరా హెచ్చరించారు.
"2026 మొదటి త్రైమాసికంలోనే సుమారు 3.15 లక్షల పర్మిట్ల గడువు ముగియనుంది. ఇది ఇమ్మిగ్రేషన్ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. 2026 మధ్య నాటికి కెనడాలో దాదాపు 20 లక్షల మంది సరైన పత్రాలు లేకుండానే నివసించే ప్రమాదం ఉంది. అందులో కనీసం 10 లక్షల మంది భారతీయులే ఉండొచ్చు," అని ఆయన అంచనా వేశారు. విద్యార్థుల వీసాల గడువు ముగియడం, శరణార్థుల దరఖాస్తులు తిరస్కరణకు గురికావడం వంటివి ఈ సంఖ్యను మరింత పెంచవచ్చని ఆయన పేర్కొన్నారు.
పెరుగుతున్న సామాజిక సమస్యలు..
చట్టబద్ధమైన హోదా లేని వారి సంఖ్య పెరగడం వల్ల గ్రేటర్ టొరంటో పరిధిలోని బ్రాంప్టన్, కాలెడన్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే సామాజిక సమస్యలు మొదలయ్యాయి. నివాస సౌకర్యం లేక అక్రమ వలసదారులు అటవీ ప్రాంతాల్లో గుడారాలు వేసుకుని జీవిస్తున్నారని తెలుస్తోంది.
{{/usCountry}}చట్టబద్ధమైన హోదా లేని వారి సంఖ్య పెరగడం వల్ల గ్రేటర్ టొరంటో పరిధిలోని బ్రాంప్టన్, కాలెడన్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే సామాజిక సమస్యలు మొదలయ్యాయి. నివాస సౌకర్యం లేక అక్రమ వలసదారులు అటవీ ప్రాంతాల్లో గుడారాలు వేసుకుని జీవిస్తున్నారని తెలుస్తోంది.
{{/usCountry}}బ్రాంప్టన్‌కు చెందిన జర్నలిస్ట్ నితిన్ చోప్రా ఒక 'టెంట్ సిటీ'ని సందర్శించి అక్కడి పరిస్థితులను డాక్యుమెంట్ చేశారు. హోదా కోల్పోయిన భారతీయులు పన్నులు కట్టకుండా కేవలం 'క్యాష్' (నగదు) కోసం పనులు చేస్తున్నారని, అలాగే కెనడాలో ఉండటానికి అడ్డదారిలో 'కాంట్రాక్ట్ వివాహాలు' (మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్) చేసుకునేందుకు కొందరు ఏజెంట్లు బ్యూరోలు కూడా నడుపుతున్నారని ఆయన వెల్లడించారు.
ఈ సంక్షోభంపై 'నౌజవాన్ సపోర్ట్ నెట్‌వర్క్' వంటి సంఘాలు గళమెత్తుతున్నాయి. వర్క్ పర్మిట్ల గడువు ముగియడం వల్ల ఇబ్బంది పడుతున్న కార్మికుల కోసం జనవరిలో నిరసనలు చేపట్టాలని నిర్ణయించాయి. టొరంటోకు చెందిన సామాజిక కార్యకర్త బిక్రమ్‌జిత్ సింగ్ మాట్లాడుతూ.. చట్టబద్ధమైన మార్గాలు లేక ఇబ్బంది పడుతున్న కార్మికుల పక్షాన నిలబడతామని తెలిపారు.
“పని చేయడానికి మేము అర్హులమైతే.. ఇక్కడ ఉండటానికి కూడా అర్హులమే” అనే నినాదంతో వారు కెనడా ప్రభుత్వ నిబంధనల్లో మార్పులు కోరుతున్నారు. తాత్కాలిక కార్మికులు, విద్యార్థులు దేశంలోనే చట్టబద్ధంగా కొనసాగేలా సంస్కరణలు తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.