ఐటీసీ షేరు ఎందుకు క్షీణిస్తోంది? కోటక్ ఆసక్తికర విశ్లేషణ

గత మూడేళ్లలో ఐటీసీ షేరు 37 శాతం నష్టపోవడం వెనుక ఉన్న కారణాలను బ్రోకరేజ్ సంస్థ కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ విశ్లేషించింది. పొగాకు వ్యాపారంపై మార్కెట్ అంచనాలు, నాన్-టొబాకో రంగానికి ఉన్న అవకాశాలపై స్పష్టమైన వివరాలను వెల్లడించింది.

Published on: Sep 7, 2026, 15:27:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత స్టాక్ మార్కెట్లో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ (ITC) షేరు తీరు పెట్టుబడిదారులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. నాన్-టొబాకో రంగంలో (సిగరెట్లు మినహా ఇతర విస్తరణ విభాగాలు) వృద్ధి అవకాశాలు ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్ల ఉదాసీనత కారణంగా ఈ షేరు ఒత్తిడికి లోనవుతోంది. బెంచ్ మార్క్ సూచీలు లాభాల్లో దూసుకుపోతున్న సమయంలోనూ ఐటీసీ షేరు పతనాన్ని నమోదు చేయడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఐటీసీ షేరు ఎందుకు క్షీణిస్తోంది? కోటక్ ఆసక్తికర విశ్లేషణ
ఐటీసీ షేరు ఎందుకు క్షీణిస్తోంది? కోటక్ ఆసక్తికర విశ్లేషణ

బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) గణాంకాల ప్రకారం, గత మూడేళ్ల కాలంలో ఐటీసీ షేరు ఏకంగా 37 శాతం క్షీణించింది. ఇదే సమయంలో బెంచ్‌మార్క్ సూచీ సెన్సెక్స్ 15 శాతం లాభాన్ని అందించడం గమనార్హం. గత ఏడాది కాలంలోనూ సెన్సెక్స్ 6 శాతం నష్టపోతే, ఐటీసీ షేరు ఏకంగా 37 శాతం పడిపోయింది.

పొగాకు వ్యాపారాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారా?

ఈ పతనంపై ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ సెప్టెంబర్ 3న 'వాట్ ఈజ్ ద మార్కెట్ స్మోకింగ్ ఆన్ ఐటీసీ?' పేరుతో ఒక విశ్లేషణాత్మక నివేదికను విడుదల చేసింది. సంస్థ నిర్వహించిన రివర్స్-ఎస్ఓటీపీ (SoTP) వ్యాల్యుయేషన్ ప్రకారం, ఐటీసీ పొగాకు వ్యాపారం వన్-ఇయర్ ఫార్వర్డ్ ఈపీఎస్ (FY27-28E EPS) ఆధారంగా కేవలం 11 రెట్ల వద్ద మాత్రమే లభిస్తోంది.

"మా రివర్స్-ఎస్ఓటీపీ వ్యాల్యుయేషన్ ప్రకారం పొగాకు వ్యాపారం రాబడి భవిష్యత్తులోనూ చాలా తక్కువ స్థాయిలో స్థిరపడిపోతుందని మార్కెట్ భావిస్తోంది" అని కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఐటీసీ పొగాకు విభాగంపై ఇన్వెస్టర్లు తీవ్ర ప్రతికూల వైఖరితో ఉన్నారని లేదా నాన్-టొబాకో వ్యాపార విలువను చాలా తక్కువగా అంచనా వేస్తున్నారని ఈ లెక్కలు సూచిస్తున్నాయి.

360 ఫెయిర్ వ్యాల్యూ.. కొటక్ లెక్కలు ఇవే

కోటక్ సెక్యూరిటీస్ ఐటీసీ షేరుకు 12 నెలల కాలానికి 360 ఫెయిర్ వ్యాల్యూ (లక్ష్య ధర) కేటాయించింది. సంస్థ అంచనా ప్రకారం, 2026-29 ఆర్థిక సంవత్సరాల మధ్య ఐటీసీ పొగాకు విభాగం ఈబీఐటీ (EBIT) పెద్దగా మార్పు లేకుండా స్థిరంగా ఉంటుంది. అయితే, నాన్-టొబాకో ఎఫ్ఎంసీజీ విభాగం ఈబీఐటీ మాత్రం సంవత్సరానికి 19 శాతం చక్రవడ్డీ చొప్పున (CAGR) బలమైన వృద్ధిని నమోదు చేస్తుందని లెక్కగట్టింది.

"పొగాకు వ్యాపారానికి సెప్టెంబర్ 2028ఈ ఈపీఎస్‌పై 16 రెట్ల మల్టిపుల్‌తో 194, నాన్-టొబాకో వ్యాపారానికి సెప్టెంబర్ 2028ఈ ఈబీఐటీడీఏపై 30 రెట్ల మల్టిపుల్‌తో 80 విలువను కేటాయించాం. కంపెనీ వద్ద ఉన్న నగదు, ఇతర వ్యాపారాల విలువను రూ.84గా లెక్కించాం" అని కోటక్ ప్రతినిధులు వెల్లడించారు.

నాన్-టొబాకో విభాగంలో భారీ వృద్ధి సాధ్యమేనా?

ఇతర పోటీ కంపెనీలతో పోలిస్తే ఐటీసీ నాన్-టొబాకో వ్యాపారానికి 30 రెట్ల మల్టిపుల్ ఇవ్వడం కాస్త ఎక్కువగానే అనిపించవచ్చు. అయితే, పలు కీలక వినియోగ వస్తువుల విభాగాలలో ఐటీసీ మార్కెట్ వాటా ఇంకా తక్కువగా ఉండటంతో, రాబోయే రోజుల్లో ఇతర కంపెనీల కంటే వేగంగా లాభాలు ఆర్జించే అవకాశం ఉందని కోటక్ భావిస్తోంది. వ్యాపారం విస్తరించే కొద్దీ మార్జిన్లు పెరిగి ఆదాయం, లాభాలు వేగంగా పెరుగుతాయని వివరించింది.

పొగాకు విభాగంలో 11 రెట్ల పీఈ మల్టిపుల్ ఉండటం వల్ల, మార్కెట్ ప్రస్తుతం ఐటీసీ భవిష్యత్ ఆదాయాలను అత్యంత తక్కువగా అంచనా వేస్తోందని, నాన్-టొబాకో రంగాలు పుంజుకుంటే షేరులో రికవరీ కనిపించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More