అక్కడ ఆదివారమూ వర్కింగ్ డేనే! శుక్రవారమే వీకెండ్- ప్రపంచ దేశాల్లో వింత వారాంతపు నియమాలు ఇలా..
శని, ఆదివారాలు రాగానే విశ్రాంతి తీసుకునే అలవాటు చాలా దేశాల్లో ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఇదే నిబంధన చెల్లదు. సౌదీ అరేబియా, ఖతార్, నేపాల్, బ్రూనై వంటి దేశాల్లో ఆదివారం కూడా సాధారణ పనిదినమే! ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు అమలు చేస్తున్న వినూత్న వారాంతపు నిబంధనలపై ప్రత్యేక కథనం..
వారంలో ఐదు లేదా ఆరు రోజులు కష్టపడి పనిచేసి, శని ఆదివారాలు రాగానే ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడం మనకు అలవాటు. మన భారతదేశంలోనూ ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు ఎక్కువగా శని, ఆదివారాలనే వారపు సెలవులుగా పరిగణిస్తాయి. కానీ ప్రపంచమంతా ఇదే శైలిని అనుసరిస్తుందని భావిస్తే పొరపాటే! అనేక దేశాల్లో ఆదివారం రోజున ఆఫీసులు, విద్యాసంస్థలు సాధారణ రోజుల్లాగే కళకళలాడుతుంటాయంటే మీరు నమ్మగలరా? అక్కడి మత విశ్వాసాలు, అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు, ఇంధన పొదుపు వ్యూహాలకు అనుగుణంగా ఆయా ప్రభుత్వాలు ప్రత్యేకమైన 'వర్కింగ్ వీక్' నిబంధనలను రూపొందించాయి.

సౌదీ అరేబియా, ఖతార్: ఆదివారం కూడా ఆఫీసులు ఓపెన్!
గల్ఫ్, ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం సాధారణ పనిదినంగా సాగుతుంది. సౌదీ అరేబియాలో ప్రభుత్వ కార్యాలయాలు ఆదివారం నుంచి గురువారం వరకు పనిచేస్తాయి. ఇక్కడ శుక్ర, శనివారాలను అధికారిక వారాంతపు సెలవులుగా పరిగణిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లు, ప్రాంతీయ వాణిజ్య భాగస్వాములతో మెరుగైన సమన్వయం సాధించేందుకు సౌదీ ప్రభుత్వం జూన్ 2013లోనే గురు-శుక్రవారాల సెలవుల స్థానంలో శుక్ర-శనివారాల విధానాన్ని అమలులోకి తెచ్చింది.
ఇక ఖతార్ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. 'అమిరీ నిర్ణయం సంఖ్య 57 (2025)' ప్రకారం ఖతార్‌లో అధికారిక పనిదినాలు ఆదివారం నుంచి గురువారం వరకే ఉంటాయి. బంగ్లాదేశ్ కూడా ఆదివారం నుంచి గురువారం వరకు పనిదినాలను కొనసాగిస్తూ, శుక్ర, శనివారాలను వారపు సెలవులుగా ఏప్రిల్ 2026 నాటి ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా పునరుద్ధరించింది. గల్ఫ్, మిడిల్ ఈస్ట్ క్లయింట్లతో పనిచేసే హైదరాబాద్, బెంగళూరులోని వాారికి ఈ సమయ వేళల మార్పులపై స్పష్టమైన అవగాహన ఉంటుంది.
బ్రూనై వింత నిబంధన: వరుసగా రాని రెండు రోజుల సెలవులు!
ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన వారాంతపు విధానం కలిగిన దేశాల్లో బ్రూనై ఒకటి. సాధారణంగా వారపు సెలవులు వరుసగా రెండు రోజులు ఉంటాయి. కానీ బ్రూనైలో ప్రభుత్వ ఉద్యోగులు సోమవారం నుంచి గురువారం వరకు పనిచేసి, శుక్రవారం సెలవు తీసుకుంటారు. మళ్లీ శనివారం ఆఫీసుకు వచ్చి విధులు నిర్వహించి, ఆదివారం రోజున రెండో సెలవును తీసుకుంటారు. అంటే అక్కడి ఉద్యోగులకు శుక్రవారం, ఆదివారం అనేవి వరుసగా రాని వారపు సెలవులుగా మారడం విశేషం.
షార్జాలో మూడ్రోజుల వీకెండ్.. నేపాల్‌లో ఇంధన పొదుపు వ్యూహం!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) జనవరి 2022 నుంచి ఫెడరల్ ఉద్యోగుల కోసం శని-ఆదివారాల వారాంతాన్ని ప్రవేశపెట్టింది. అయితే యుఏఈ లో భాగమైన 'షార్జా' మాత్రం మరింత భిన్నమైన బాట పట్టింది. షార్జాలోని ప్రభుత్వ ఉద్యోగులు సోమవారం నుంచి గురువారం వరకు కేవలం నాలుగు రోజులు మాత్రమే పనిచేస్తారు. వీరికి శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఏకంగా మూడు రోజుల పాటు భారీ వారాంతపు సెలవు లభిస్తుంది.
మరోవైపు మన పొరుగు దేశమైన నేపాల్ కూడా ఇటీవల తన సెలవుల విధానంలో కీలక మార్పు చేసింది. గతంలో నేపాల్ ప్రభుత్వానికి శనివారం ఒక్క రోజే అధికారిక సెలవుగా ఉండేది. అయితే దేశంలో ఎదురవుతున్న ఇంధన కొరత, దిగుమతి ఖర్చులను తగ్గించుకునేందుకు ఏప్రిల్ 2026లో ప్రభుత్వం శని, ఆదివారాలను రెండ్రోజుల వారపు సెలవులుగా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని నేపాల్ ప్రభుత్వం జూన్ నాటి సమీక్షలోనూ అధికారికంగా ఖరారు చేసింది.
ఇలా ప్రతీ దేశం తమ భౌగోళిక పరిస్థితులు, స్థానిక సంస్కృతులు, ఆర్థిక ప్రయోజనాలకు అనుగుణంగా వారాంతపు రోజులను నిర్ణయించుకుంటుంది. అయితే ప్రభుత్వాలు ప్రకటించే అధికారిక రోజులకు, ప్రైవేటు కంపెనీలు పాటించే పనిదినాలకు మధ్య కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంటుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


