
ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ వాతావరణం మారనుంది. వాతావరణంలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఈ నెల 13వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇది సముద్రంలో మరింత బలపడి తదుపరి దశలో వాయుగుండంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంది.
ఈ అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 15వ తేదీ నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి.ఈ మార్పుల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షాలు పడే సూచనలున్నాయి.
ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలు మరియు రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.
మరోవైపు…. అక్టోబర్ 15వ తేదీ తర్వాత దేశంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.ఈశాన్య రుతుపవనాల రాకతో పాటు సముద్రంలో ఏర్పడే ఈ ఉపరితల ఆవర్తనం తోడవడంతో తూర్పు తీర ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలో వరుసగా భారీ వర్షాలు కురిసే అవకాశాలన్నాయి.
తీర ప్రాంత రైతులు, మత్స్యకారులు వాతావరణ శాఖ ఇచ్చే సూచనలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.ఆకస్మిక ఈదురుగాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలే ప్రమాదం ఉన్నందున అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.