
3 రోజుల పర్యటనలో భాగంగా మెస్సీ ప్రస్తుతం కోల్‌కతాలో ఉన్నారు. సాల్ట్ లేక్‌లోని యుభ భారతి క్రిరంగన్ స్టేడియంలో మెస్సీ ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాల్సి ఉందని సమాచారం. అంతేకాదు స్టేడియం చుట్టూ తిరిగి ఫ్యాన్స్ కోసం ‘ల్యాప్’ నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం భారీ ఎత్తున, భారీ ధరకు టికెట్లు కూడా విక్రయించారు. మెస్సీని చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో స్టేడియంకు తరలివెళ్లారు.
మెస్సీ ఉదయం 11:30లకు స్టేడియం లోపలికి వచ్చారు. ఆ వెంటనే ఆర్గనైజర్స్, పలువురు రాజకీయ నేతలు, ఫుట్‌బాల్ ప్లేయర్లు, ప్రముఖులు ఆయన్ని చుట్టుముట్టారు. మెస్సీ చుట్టుపక్కన చాలా మంది గుమిగూడటంతో ఆర్గనైజర్స్‌లో భద్రతపై ఆందోళన మొదలైంది. వాళ్లని పంపించేందుకు ప్రయత్నించారు. కానీ పంపించలేకపోయారు. స్టేడియం సీట్లల్లో కూర్చున్న వారికి అసలు మెస్సీ ఎక్కడున్నారో కూడా కనిపించలేదు! ఈ గందరగోళం మధ్య, స్టేడియంలో ఎక్కువసేపు ఉండాల్సిన మెస్సీ.. కొద్దసేపటికే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
రూ.12వేలు పెట్టి టికెట్ కొన్న ఓ వ్యక్తి.. మెస్సీని కనీసం ఒక్క క్షణం కూడా సరిగ్గా చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు, ప్రముఖులే చూసేడట్టు అయితే తమకు టికెట్లు ఎందుకు అమ్మడం అని ప్రశ్నించారు.
మెస్సీ వెళ్లిపోయాడన్న విషయం తెలిసిన తర్వాత ఫ్యాన్స్‌లో కోపం తీవ్ర స్థాయికి చేరింది. తమ చేతుల్లో ఉన్న బాటిళ్లను విసికొట్టారు. చాలా మంది పై నుంచి కుర్చూలు కూడా కిందకి విసిరేశారు. ఫలితంగా మైదాన ప్రాంతంలో చెత్త పేరుకుపోయింది.
కొందరు అసంతృప్తితో స్టేడియం నుంచి వెళ్లిపోయారు. కానీ చాలా మంది బ్యారికెడ్లు దాటుకుని మైదాన ప్రాంతం లోపలికి చొచ్చుకొచ్చారు. టెంట్లు పీకేశారు. దొరికినది పట్టుకుని విరగొట్టారు.