
ఆశ్వయుజ శుద్ధ సప్తమిని పురస్కరించుకుని జగన్మాత, చదువుల తల్లి శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మదినం సందర్భంగా దుర్గగుడికి వేలాది సంఖ్యలో భక్తులు పోటెత్తారు. మూలా నక్షత్రం రోజు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ దుర్గగుడి బోర్డు, పోలీసులు చర్యలు తీసుకున్నారు.
సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శన సౌకర్యం కల్పించారు. ఇంద్రకీలాద్రిపై ఎలాంటి వీవీఐపీ, విఐపి సిఫార్సు దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. క్షేత్రస్థాయిలో తోపులాటలు జరగకుండా పోలీసు యంత్రాంగం హోల్డింగ్ పాయింట్ల ద్వారా భక్తులను దఫదఫాలుగా క్యూలైన్లలోకి పంపుతోంది.
ఉన్నతాధికారులు సీసీటీవీ నెట్వర్క్ను ఉపయోగిస్తూ క్షేత్రస్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఐదు అంచల భద్రతా వలయంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో దుర్గమ్మను దర్శించుకుంటున్నారు.
దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రం నుంచి విజయదశమి వరకు ఉన్న రోజులను విశేష పుణ్యదినాలుగా భావిస్తారని వేద పండితులు తెలిపారు. సరస్వతీ రూపంలో ఉన్న అమ్మవారు ధవళ వర్ణ వస్త్రాలు ధరించి, హంస/నెమలి వాహనారూఢురాలై, అక్షరమాల, అభయముద్ర, రెండు చేతుల్లో వీణను ధరించి దర్శనమిస్తారు.
చైతన్య స్వరూపిణి అయిన మహా సరస్వతి దేవి రాక్షసులైన శుంభనిశుంభుల అహంకారాన్ని మట్టుబెట్టి దేవతలను కాపాడింది. జ్ఞాన, చింతామణి, నీల, ఘట, కిణి, అంతరిక్ష మహా సరస్వతులు అనే సప్త నామాలతో ఈ వాగ్దేవి పూజలందుకుంటుంది.
వాల్మీకి మహర్షి, మహాకవి కాళిదాసు వంటి దివ్య కవులకు వాగ్వైభవాన్ని, కవితా స్ఫూర్తిని ప్రసాదించిన కరుణామయి ఈ చదువుల తల్లి. సరస్వతీ దేవిని శరణాగతి భావంతో ఆరాధిస్తే బుద్ధి వికాసం, జ్ఞాపకశక్తి, యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం, రచన, ధారణా శక్తులు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా విద్యార్థులు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల విద్యా ప్రాప్తి కలుగుతుంది. మూలా నక్షత్రం పూజలో భాగంగా సరస్వతీ దేవికి అటుకులు, బెల్లం, శనగపప్పు, కొబ్బరిని ప్రత్యేక నైవేద్యంగా సమర్పిస్తారు.