Ramayana : రామాయణం బడ్జెట్ నుంచి రణ్‌బీర్, యశ్, సాయి పల్లవి రెమ్యూనరేషన్ వరకు..
నితేష్ తివారీ దశాబ్దపు డ్రీమ్ ప్రాజెక్ట్ 'రామాయణ్: పార్ట్ 1' థియేటర్లలోకి వచ్చింది. రూ. 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ పౌరాణిక దృశ్యకావ్యంలో రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి అందుకున్న పారితోషికాల వివరాలు వైరల్ అవుతున్నాయి.

భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, భారీ బడ్జెట్ దృశ్యకావ్యం 'రామాయణ్: పార్ట్ 1' నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి అడుగుపెట్టింది. నితేష్ తివారీ దర్శకత్వంలో రూ. 4,000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ పౌరాణిక చిత్రంపై తొలిరోజు నుంచే కోట్లాది మంది ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం ముందస్తు బుకింగ్స్ (అడ్వాన్స్ బుకింగ్స్) ద్వారానే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులను సృష్టించింది. దక్షిణ భారతదేశంలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సాయి పల్లవి సీతగా నటించడం, 'కేజీఎఫ్' స్టార్ యశ్ రావణాసురుడిగా ఆడియన్స్‌ను పలకరించడంతో మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్లు హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నటించిన వారి రెమ్యూనరేషన్స్ వివరాలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి.

ఈ రెండు భాగాల పౌరాణిక సిరీస్‌లో శ్రీరాముడి పాత్రను పోషించిన బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ అత్యధిక పారితోషికం పొందిన నటుడిగా అగ్రస్థానంలో నిలిచారు. నివేదికల ప్రకారం రణ్‌బీర్ ప్రతి భాగానికి రూ. 75 కోట్ల చొప్పున, రెండు భాగాలకు కలిపి ఏకంగా రూ. 150 కోట్లు రెమ్యూనరేషన్‌గా అందుకుంటున్నట్లు సమాచారం.

తన రెండు దశాబ్దాల సినీ కెరీర్‌లో రణ్‌బీర్ అందుకున్న అత్యంత భారీ పారితోషికం ఇదేనని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. శ్రీరాముడి పాత్రలో కనిపించడానికి ఆయన తన ఆహార్యాన్ని, బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చుకోవడమే కాకుండా కఠినమైన శిక్షణ కూడా తీసుకున్నారు.
(AFP)
'కేజీఎఫ్' సంచలనం తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ఈ చిత్రంలో రావణాసురుడిగా నటించారు. ఆయన రెండు భాగాలకు కలిపి రూ. 100 కోట్లు (అంటే భాగానికి రూ. 50 కోట్లు) పారితోషికంగా తీసుకుంటున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే యశ్ సంపాదన కేవలం యాక్టింగ్ ఫీజుకే పరిమితం కాకపోవడం గమనార్హం. ఈ చిత్రానికి ఆయన సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద లభించే లాభాల్లో కూడా యశ్‌కు భారీ వాటా దక్కనుంది.

సహజ నటిగా గుర్తింపు పొంది, తెలుగు కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సాయి పల్లవి ఈ చిత్రంలో సీతాదేవి పాత్రలో ఒదిగిపోయారు. ఆమె రెండు భాగాలకు కలిపి రూ. 12 కోట్లు (భాగానికి రూ. 6 కోట్లు) అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక హనుమంతుడి పాత్రలో కనిపిస్తున్న బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ రెండు భాగాలకు గానూ రూ. 40 కోట్లు పొందుతున్నారు. లక్ష్మణుడిగా నటిస్తున్న ప్రముఖ బుల్లితెర, వెండితెర నటుడు రవి దూబే రెండు భాగాలకు రూ. 20 కోట్లు (భాగానికి రూ. 10 కోట్లు) అందుకుంటున్నారు. ఇక శూర్పణఖ పాత్రలో కనిపించిన రకుల్ ప్రీత్ సింగ్ రూ. 1.5 కోట్లు, మండోదరిగా నటించిన కాజల్ అగర్వాల్ రూ. 1 కోటి పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ పారితోషికాల వ్యత్యాసాలు ఈ సినిమా నిర్మాణ పరిమాణాన్ని స్పష్టం చేస్తున్నాయి. కేవలం రెండు భాగాల షూటింగ్ బడ్జెట్ రూ. 1,000 నుంచి 1,100 కోట్లు కాగా, ప్రమోషన్లు, విజువల్ ఎఫెక్ట్స్, గ్లోబల్ రిలీజ్ ఖర్చులతో కలిపి మొత్తం ప్రాజెక్ట్ బడ్జెట్ రూ. 4,000 కోట్లకు పైగానే ఉన్నట్లు అంచనా. ఆస్కార్ విన్నింగ్ సంస్థ డీఎన్ఈజీ ఈ చిత్రానికి వీఎఫ్ఎక్స్ అందించగా, ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంగీతం సమకూర్చారు. భారతీయ చలనచిత్ర రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్న ఈ పౌరాణిక చిత్రం బాక్సాఫీస్ వద్ద రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో వేచి చూడాలి. ఈ రామాయణం సినిమా ట్విట్టర్ రివ్యూ తెలుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
(AFP)
E-Paper

